ఆయనతో రజనీ మరోసారా? ప్రమోషన్ స్టంటా?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు జైలర్ 2 మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.;

Update: 2025-10-16 10:30 GMT

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు జైలర్ 2 మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచిన జైలర్ కు సీక్వెల్ గా రూపొందుతున్న ఆ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది జూన్ లో ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఇప్పటికే ఆడియెన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి.

సన్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ తెరకెక్కిస్తున్న జైలర్ 2లో రమ్యకృష్ణ, శివరాజ్ కుమార్ తదితరులు నటిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ గెస్ట్ రోల్ లో నటిస్తున్నట్లు తెలుస్తుండగా.. యువ సంచలనం అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ కు దర్శకత్వం వహించిన నెల్సన్ దిలీప్ కుమారే ఇప్పుడు కూడా సీక్వెల్ రూపొందిస్తున్నారు.

అలా రెండోసారి రజనీకాంత్ తో వర్క్ చేస్తున్న నెల్సన్ దిలీప్ కుమార్.. ఇప్పుడు మూడో సారి కూడా పని చేయనున్నారని కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే జైలర్ 2 షూటింగ్ ను 70 శాతం కంప్లీట్ చేసిన ఆయన.. రీసెంట్ గా మరో స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. దాన్ని ఇటీవల రజనికి స్క్రిప్ట్ నేరేట్ చేశారని సీన్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

నెల్సన్ చెప్పిన స్క్రిప్ట్ ను విన్న రజనీకాంత్.. స్టోరీ బాగుందని చెప్పినట్లు సమాచారం. అంతే కాదు.. స్క్రిప్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే నిజమైతే మూడో సారి రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో మరో సినిమా రానుందన్నమాట.

ఇప్పుడు ఆ విషయంపై అనేక మంది నెటిజన్లు, అభిమానులు, సినీ ప్రియులు రెస్పాండ్ అవుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్స్ పెడుతున్నారు. చాలా మంది అభిమానులు.. రజనీకాంత్ ను ఎలా ప్రెజెంట్ చేయాలో నెల్సన్ దిలీప్ కుమార్ కు బాగా తెలుసని అభిప్రాయపడుతున్నారు. జైలర్ మూవీలో తలైవా స్వాగ్, స్టైల్ ను గుర్తుచేస్తున్నారు.

అయితే మరికొందరు మాత్రం.. వస్తున్న వార్తల్లో నిజం లేదేమోనని డౌట్ పడుతున్నారు. ఇటీవల ఏ డైరెక్టర్ తో వర్క్ చేస్తున్నారో.. ఆయనతో మరో సినిమా చేస్తారని కావాలని ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. కానీ ఆ తర్వాత సైలెంట్ అవుతున్నారని చెబుతున్నారు. అదంతా మూవీ కోసం ప్రమోషన్ స్టంట్ అని కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు రజనీ - నెల్సన్ కాంబో కూడా అంతేనని అంటున్నారు. ఏదేమైనా రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ మరో మూవీ విషయంలో ఏది నిజమో వేచి చూడాలి.

Tags:    

Similar News