ఒక్క సినిమా కోసం రెండేళ్లు అన్నింటికీ దూరం..!
కూలీ సినిమా సూపర్ హిట్ అయితే టాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోతో సినిమా వెంటనే షురూ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.;
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన 'కూలీ' సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. షూటింగ్ పూర్తి అయ్యి దాదాపుగా మూడు నెలలు కావస్తుంది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. రజనీకాంత్ మరో వైపు జైలర్ 2 సినిమాను చేస్తున్నాడు. కానీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ మాత్రం మరే సినిమా గురించి ఆలోచన లేకుండా సుదీర్ఘ కాలంగా 'కూలీ' సినిమా కోసం వర్క్ చేస్తున్నాడు. దాదాపు రెండేళ్లుగా లోకేష్ కనగరాజ్ 'కూలీ' పై వర్క్ చేస్తూనే ఉన్నాడు. ఇంకా నెల రోజుల పాటు అదే సినిమా పనిలో ఉంటాడు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న ఈ సమయంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ కు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కొన్ని నెలల క్రితం దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ కూలీ సినిమా కోసం తాను రెండేళ్లుగా కష్టపడుతున్నాను. ఈ రెండుళ్ల కాలంలో ఎన్నో ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి దూరంగా ఉండాల్సి వచ్చింది, ఎన్నో సరదాలు, ఇతర విషయాలను త్యాగం చేయాల్సి వచ్చిందని, ఫ్యామిలీ టైమ్ లేకుండా పోయిందని చెప్పుకొచ్చాడు. తనకు రజనీకాంత్ సర్‌పై ఉన్న అభిమానంను మొత్తం కూలీ సినిమాలో చూపిస్తాను అంటూ లోకేష్ హామీ ఇచ్చాడు. విక్రమ్ సినిమా తర్వాత మళ్లీ ఆ రేంజ్ సినిమాను చేయలేక పోయిన లోకేష్ కనగరాజ్ ఈసారి అంతకు మించి కూలీ ఉంటుంది అనే ధీమాతో ఉన్నాడు. ఈ మధ్య కాలంలో లోకేష్ కనగరాజ్ తో సినిమా కోసం ఎంతో మంది ప్రముఖ హీరోలు క్యూలో ఉన్నారు.
కూలీ సినిమా సూపర్ హిట్ అయితే టాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోతో సినిమా వెంటనే షురూ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ప్రముఖ నిర్మాణ సంస్థ ఆ హీరో కోసం ఇతడిపై అడ్వాన్స్ ఇచ్చి మరీ కర్చిఫ్ వేసినట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. కూలీ సినిమా కోసం లోకేష్ కనగరాజ్ చూపిస్తున్న డేడికేషన్ చూస్తూ ఉంటే ముచ్చటేస్తుందని చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. కూలీ కోసం పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు చాలా మంది లోకేష్ కనగరాజ్ గురించి ప్రముఖంగా మాట్లాడుతూ ఉంటారు. సినిమా గురించి తప్ప అతడు మరే విషయాల గురించి మాట్లాడడు అని, అతడి నుంచి రాబోయే రోజుల్లో అద్భుతమైన సినిమాలు వస్తాయని చెబుతూ ఉంటారు.
రజనీకాంత్ జైలర్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దాంతో కూలీ సినిమా విషయమై ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. రజనీకాంత్ సైతం లోకేష్ కనగరాజ్ పై నమ్మకంతో ఈ సినిమాను చేశాడు. మరి అంచనాలు అందుకుని ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ సక్సెస్ చేసేనా అనేది చూడాలి. తెలుగులో ఈ సినిమాను భారీ రేటుకు కొనుగోలు చేసి ప్రముఖ నిర్మాణ సంస్థ విడుదల చేసేందుకు గాను రెడీ అయింది. ఈ కాంబోకి ఉన్న బజ్ నేపథ్యంలో ఓవర్సీస్‌లోనూ అత్యధిక బిజినెస్ చేసింది. ఇప్పటి వరకు ఏ తమిళ మూవీ చేయని స్థాయిలో అక్కడ బిజినెస్ చేయడంతో అభిమానులు వసూళ్లపై చాలా నమ్మకంగా ఉన్నారు.