ఒకే ఫ్రేమ్‌లో ర‌జ‌నీ - క‌మ‌ల్ హాస‌న్‌ని గురువు బాల‌చంద‌ర్ వీక్షిస్తే!

భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ చిత్రం త్వరలోనే పట్టాలెక్కబోతోంది.

Update: 2026-06-15 04:18 GMT

భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ చిత్రం త్వరలోనే పట్టాలెక్కబోతోంది. తమిళ చిత్ర పరిశ్రమకు రెండు కళ్లుగా భావించే లెజెండరీ నటులు సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత మళ్లీ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ సంచలన ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ అధికారికంగా ధృవీకరించారు. ప్రముఖ జాతీయ మీడియాతో ల‌తాజీ ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ఈ సినిమా షూటింగ్ చాలా త్వరలోనే ప్రారంభం కానుందని స్పష్టం చేశారు.

ఈ అరుదైన కలయిక కేవలం అభిమానులకే కాకుండా.. మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమకే ఒక చారిత్రాత్మక మైలురాయి కాబోతోందని లతా రజనీకాంత్ అభివర్ణించారు. రజనీకాంత్, కమల్ హాసన్ తమ కెరీర్ ప్రారంభంలో లెజెండరీ దర్శకుడు కె. బాలచందర్ సారథ్యంలో కలిసి నటించారు. ఆ తర్వాత తమకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకుని సూపర్ స్టార్లుగా ఎదిగారు. వీరిద్దరి మధ్య ఉన్నది కేవలం వృత్తిపరమైన పోటీ మాత్రమే కాదు.. అంతకుమించిన గొప్ప స్నేహానుబంధం అని ఆమె గుర్తుచేశారు. ఈ ఇద్దరు దిగ్గజాలు మళ్లీ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే.. వారి గురువు, స్వర్గీయ కె. బాలచందర్ ఎంతో గర్వపడతారని ఈ సందర్భంగా లతా రజనీకాంత్ భావోద్వేగానికి లోనయ్యారు.

ప్రస్తుతం రజనీకాంత్ వయసుతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా దూసుకుపోతున్నారు. ఆయన గత బ్లాక్‌బస్టర్ హిట్ `జైలర్` చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న `జైలర్ 2` షూటింగ్ ఇప్పటికే ముగింపు దశకు చేరుకుందని లతా రజనీకాంత్ వెల్లడించారు. ``సూపర్ స్టార్‌కి అస్సలు విశ్రాంతి లేదు.. ఒక సినిమా తర్వాత మరో సినిమా చేస్తూనే ఉన్నారు`` అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. అలాగే రజనీకాంత్ సినిమా స్క్రిప్ట్‌ల ఎంపికలో తాను ఎలాంటి సలహాలు ఇవ్వనని... తానూ ఒక సాధారణ అభిమానిలాగే ఆయన సినిమాలను థియేటర్లలో ఎంజాయ్ చేస్తానని.. ఆయన ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ ప్రేక్షకులను అలరించడమే తమకు కావాలని పేర్కొన్నారు.

సినిమాలతో పాటు తన సామాజిక సేవా కార్యక్రమాల గురించి కూడా లతా రజనీకాంత్ మాట్లాడారు. సమాజంలో స్థానిక, ప్రాంతీయ నాయకత్వాన్ని ఉత్త‌మంగా పెంపొందించడానికి.. సహజసిద్ధమైన జీవన విధానాన్ని ప్రోత్సహించడానికి... అలాగే భారతీయుల మధ్య సామాజిక బంధాలను బలోపేతం చేయడానికి తాము కొత్తగా `మక్కల్ మేడై` అనే పౌర వేదికను ప్రారంభించినట్లు తెలిపారు. అయితే భవిష్యత్తులో ఈ వేదిక రాజకీయ పార్టీగా మారే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ప్రస్తుతం తాము భవిష్యత్తు గురించి కాకుండా కేవలం వర్తమానం కోసమే పనిచేస్తున్నామని... రాజకీయాలపై ఇప్పుడే వ్యాఖ్యానించలేనని ల‌తా ర‌జ‌నీకాంత్ స్పష్టం చేశారు.

ఏది ఏమైనా.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో .. సినిమా వర్గాల్లో లతా రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. రజనీకాంత్ - కమల్ హాసన్ ల క్రేజీ కాంబినేషన్‌పై వస్తున్న వార్తలు ఇరు హీరోల అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా సినీ ప్రియులు కంటున్న ఈ కల నిజమైతే.. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఇది అత్యంత అద్భుతమైన, చారిత్రాత్మకమైన రీ-యూనియన్‌గా నిలిచిపోవడం ఖాయం.

Tags:    

Similar News