సాహసోపేతమైన నిర్ణయం వెనుక అసలు కథ!
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా ఉలగనాయగన్ కమల్ హాసన్ నిర్మాతగా ఓ భారీ ప్రాజెక్ట్ ప్రకటనతో సినీ ప్రపంచం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది.;
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా ఉలగనాయగన్ కమల్ హాసన్ నిర్మాతగా ఓ భారీ ప్రాజెక్ట్ ప్రకటనతో సినీ ప్రపంచం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఇద్దరు దిగ్గజాలు దశాబ్దాల తర్వాత ఒకే ప్రాజెక్ట్ కోసం చేతులు కలపడం భారతీయ సినిమాలోనే చారిత్రాత్మక ఘట్టం. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహించే బాధ్యతను తొలుత సుందర్ సి కి అప్పగించారు. అయితే అనూహ్యంగా ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలగడం, ఆ స్థానంలోకి మరో దర్శకుడు రావడం అప్పట్లోనే చర్చనీయాంశమైంది. తాజాగా సినిమా నుండి ఎందుకు తప్పుకున్నాననే విషయాన్ని సుందర్ స్వయంగా వెల్లడించి ఆశ్చర్యానికి గురిచేశారు.
రజనీకాంత్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన `అరుణాచలం`వంటి బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు సుందర్ సి. రజనీ బాడీ లాంగ్వేజ్, ఆయన మాస్ ఇమేజ్‌ను ఎలా వాడుకోవాలో బాగా తెలిసిన దర్శకుడిగా సుందర్ కి పేరుంది. అలాంటి అనుభవం ఉన్న దర్శకుడు, రజనీ-కమల్ వంటి భారీ కాంబినేషన్‌ను డీల్ చేసే అవకాశం వస్తే వదులుకోవడం నిజంగా ఊహించని పరిణామం. `ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్.. అంతటి ఒత్తిడిని తట్టుకోవడం నా వల్ల సాధ్యం కాదు` అని సుందర్ వెల్లడించడం చర్చకు దారి తీస్తోంది. ఒక స్టార్ డైరెక్టర్ తన పరిమితులను ఇంత బహిరంగంగా అంగీకరిం చడం సినీ వర్గాల్లో అరుదుగా జరుగుతుంది.
సుందర్ సి నిర్ణయం వెనుక లోతైన విశ్లేషణ కనిపిస్తోంది. రజనీకాంత్ హీరోగా - కమల్ హాసన్ లాంటి మేధావి నిర్మాతగా ఉన్నప్పుడు ఆ సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉంటాయి. ప్రతి సన్నివేశం, డైలాగ్ విషయంలో ఇద్దరు అగ్ర నటుల అభిమానులను సంతృప్తి పరచడం కత్తి మీద సాము లాంటిదే. సుందర్ సి వినోదాత్మక చిత్రాలను వేగంగా, ఒత్తిడి లేకుండా తీయడానికి ఇష్టపడతారు. కానీ ఈ ప్రాజెక్ట్ విషయంలో అడుగడుగునా ఎదురయ్యే సవాళ్లు, ఆ ఇద్దరు లెజెండ్స్ ఇమేజ్‌ను బ్యాలెన్స్ చేయడంలో ఉండే క్లిష్టత తన పనితీరుపై ప్రభావం చూపుతుందని సుందర్ ముందే గ్రహించినట్లు కనిపిస్తోంది.
ఒక దర్శకుడికి అవకాశం రావడం కంటే? ఆ అవకాశానికి తాను న్యాయం చేయగలనా లేదా అని ఆలోచించడం చాలా ముఖ్యం. `అరుణాచలం` తీసిన సమయంలో ఉన్న పరిస్థితులు వేరు. ప్రస్తుత పాన్ ఇండియా ట్రెండ్ వేరు. ఇప్పుడు చిన్న పొరపాటు జరిగినా సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు దర్శకుడి కెరీర్‌నే దెబ్బతీస్తాయి. రజనీకాంత్ కమర్షియల్ యాంగిల్, కమల్ హాసన్ టెక్నికల్ స్టాండర్డ్స్.. ఈ రెండింటినీ ఏకకాలంలో మేనేజ్ చేయడం అంటే విపరీతమైన మానసిక ఒత్తిడితో కూడుకున్న పనే. అందుకే ఆ ఒత్తిడికి లోనై తప్పుడు సినిమా తీయడం కంటే? గౌరవంగా తప్పుకోవడమే ఉత్తమమని సుందర్ భావించి ఉండొచ్చు.
సుందర్ ఇలా వైదొలగడం వృత్తిపరమైన నిజాయితీకి నిదర్శనమని కొందరు ప్రశంసిస్తున్నారు. అగ్ర దర్శకులు కూడా ఒక్కోసారి భారీ అంచనాల మధ్య తడబడుతుంటారు. రజనీ-కమల్ కాంబినేషన్ అంటే అది కేవలం ఒక సినిమా కాదు. అదొక బాధ్యత. ఆ బాధ్యతను మోయలేనని ముందే చెప్పడం వల్ల ప్రాజెక్ట్ దెబ్బతినకుండా ఉంటుంది. కంఫర్ట్ జోన్‌లో ఉంటూ ప్రేక్షకులకు నచ్చే సినిమాలు అందించడమే సుందర్ కు ఇష్టమని చెప్పకనే చెప్పారు.
చివరిగా రజనీ-కమల్ ప్రాజెక్ట్ నుండి సుందర్ సి తప్పుకోవడం అనేది ఓ సాహసోపేతమైన నిర్ణయం. ఇమేజ్ కోసం పాకులాడకుండా? మానసిక ప్రశాంతతకు -సినిమా శ్రేయస్సుకు సుందర్ ప్రాధాన్యత ఇచ్చారు. ఏదేమైనా? సుందర్ సి వెల్లడించిన కారణం దర్శకులకు ఓ కొత్త పాఠం లాంటిందే. అగ్ర హీరోల ప్రాజెక్ట్ అనగానే ఎగిరి గంతేయడం కాదు. దాని వెనుక ఉండే ఒత్తిడిని భరించే సత్తా ఉందో? లేదో? సరి చూసుకోవాలని సుందర్ ఎగ్జిట్ అనేది ఓ సూచిక లాంటింది.