చిన్న చిన్న పాత్రలు చేస్తూ రెండేళ్లలో నా అంత స్టార్ అయ్యాడు! రజనీ గుట్టు విప్పిన కమల్!
సూపర్ స్టార్ రజనీకాంత్ 173వ చిత్రంగా తెరకెక్కుతున్న `ధర్మన్- ది డెడ్లీ డాక్టర్` చిత్ర టైటిల్ - ఫస్ట్‌లుక్ పోస్టర్ లాంచ్ ఈవెంట్ చెన్నైలో ఘనంగా జరిగింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ 173వ చిత్రంగా తెరకెక్కుతున్న `ధర్మన్- ది డెడ్లీ డాక్టర్` చిత్ర టైటిల్ - ఫస్ట్‌లుక్ పోస్టర్ లాంచ్ ఈవెంట్ చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ వేదికపై చిత్ర నిర్మాత, ఉలగనాయగన్ కమల్ హాసన్ చేసిన ప్రసంగం.. దానికి రజనీకాంత్ ఇచ్చిన రియాక్షన్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ.. ``నేను ఈ సినిమాకు కేవలం పేరుకే నిర్మాతను. సాధారణంగా ఒక నిర్మాత సినిమా ప్రక్రియ అంతటా ఎంతో ఉత్సాహంగా.. అప్రమత్తంగా ఉంటారు. కానీ ఇక్కడ రివర్స్ అయింది. సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ సినిమా టెన్షన్‌ను నిరంతరం తన భుజాలపై వేసుకుని నడిపించారు. ఆయనతో కలిసి పనిచేయడం నాకెంతో సంతోషంగా ఉంది. ఇది మా 40 ఏళ్ల కల నిజమవడం లాంటిది. ఇప్పుడు మేమిద్దరం కలిసి రెండు సినిమాల్లో పని చేయబోతున్నాం`` అంటూ ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు.
తమ మధ్య ఉన్న దశాబ్దాల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కమల్ హాసన్ వేదికపై భావోద్వేగానికి లోనయ్యారు. ``మా ఇద్దరి మధ్య 50 ఏళ్ల సుదీర్ఘ స్నేహం ఉంది. కెరీర్ ప్రారంభంలో రజనీకాంత్ చాలా చిన్న చిన్న పాత్రలు వేసేవారు. కానీ కేవలం ఒకటి రెండు ఏళ్లలోనే ఆయన నాతో సమానమైన స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఒకసారి మేమిద్దరం ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్నప్పుడు.. ఇకపై కలిసి నటించకూడదని ఒక నిర్ణయానికి వచ్చాం. భవిష్యత్తులో ఎప్పుడైనా మనలో ఒకరం నిర్మాతగా మారి కలిసి ఒక సినిమా చేద్దామని అనుకున్నాం. కానీ ఆ మాట అనుకుని 40 ఏళ్లు గడిచిపోయాయి. మూడేళ్ల క్రితం మళ్లీ ఇదే ఆలోచనను తెరపైకి తెచ్చి.. సరైన కథ కోసం వెతకడం ప్రారంభించాం. ఇప్పటికి ఆ సమయం కుదిరింది. ఇప్పుడు మేం కలిసి రెండు సినిమాలు చేస్తున్నాం`` అని కమల్ హాసన్ వివరించారు.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను కమల్ హాసన్‌కు చెందిన `రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్` సంస్థ నిర్మిస్తుండగా, టర్మెరిక్ మీడియా బ్యానర్‌పై ఆర్. మహేంద్రన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. `ఓ మై కడవులే` ఫేమ్ అశ్వత్ మరిముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ అశ్వత్ చేతికి రాకముందు పలువురు దర్శకులు మారిన విషయాన్ని వెల్లడించారు.
సినిమా టైటిల్ లాంచ్‌తో పాటు విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ కూడా దర్శకుడు చెప్పిన ఎలివేషన్లకు తగ్గట్టుగానే ఉంది. ఆపరేషన్ థియేటర్ బ్యాక్‌డ్రాప్‌లో రజనీకాంత్ చేతిలో సర్జికల్ బ్లేడ్ పట్టుకుని, కింద పడి ఉన్న ఒక రౌడీపై కాలు పెట్టి నిలబడిన తీరు పోస్టర్‌లోనే మాస్ పూనకాలు తెప్పించింది. మొత్తానికి కమల్ హాసన్ నిర్మాణంలో రజనీకాంత్ నటిస్తున్న ఈ `ధర్మన్` చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని ఈ ఈవెంట్‌తో అర్థమవుతోంది. దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు లెజెండ్స్ కలిసి చేస్తున్న ఈ ప్రయాణం కోసం సినీ లోకం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోంది.
అత్యంత స్టైలిష్ డెడ్లీ డాక్టర్ స్టోరి:
ఈ చిత్రంలో రజనీకాంత్ పోషిస్తున్న డాక్టర్ పాత్ర ఎలా ఉండబోతుందో దర్శకుడు అశ్వత్ మరిముత్తు ఈ వేదికపై ఆసక్తికరమైన హింట్స్ ఇచ్చారు. ఈ `ధర్మన్` కథ ఐదు రూపాయల డాక్టర్ గురించి కాదు. అత్యంత స్టైలిష్‌గా, డెడ్లీగా ఉండే డాక్టర్ కథ ఇది. ఈ సినిమా రజనీకాంత్ బ్లాక్‌బస్టర్ హిట్స్ అయిన పడయప్ప (నరసింహా).. కమల్ `వేట్టైయాడు విలైయాడు` చిత్రాల మిశ్రమంగా ఉండబోతోంది. కుటుంబ ప్రేక్షకులందరూ అమితంగా ఇష్టపడే ఒక ఎంటర్‌టైనింగ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని మలుస్తున్నాం అని అశ్వత్ మరిముత్తు ధీమా వ్యక్తం చేశారు. అతడి మాటలతో రజనీకాంత్ ఈ సినిమాలో డాక్టర్‌గా నటిస్తున్నారని ఖరారైంది.
ఆసక్తికరంగా ఒక బస్ కండక్టర్ స్థాయి నుంచి సూపర్ స్టార్ అయ్యే వరకూ అసాధారణ జర్నీ సాగించిన రజనీకాంత్ చాలా చిన్న చిన్న పాత్రలలో నటించేప్పుడు కమల్ హాసన్ అప్పటికే పెద్ద స్టార్. అయితే కమల్ హాసన్ స్థాయి స్టార్ డమ్ ని అందుకోవడానికి రజనీకాంత్ కి కేవలం రెండేళ్లే పట్టిందనే నిజం ఇన్నేళ్ల తర్వాత ఈ ప్రెస్ మీట్ లో రివీలైంది.