షాకింగ్ ట్విస్ట్: 'కూలీ' స్టోరి ఇదేనా?
ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ని అతడు ఏ రేంజులో చూపిస్తాడో చూడాలన్న ఆసక్తి అందరిలోను ఉంది.;
ఖైది, విక్రమ్, లియో లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించాడు లోకేష్ కనగరాజ్. స్క్రీన్ ప్లే మాస్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. గ్రిప్పింగ్ నేరేషన్ తో సీట్ ఎడ్జ్ థ్రిల్లర్లను అందించే స్పెషలిస్టుగా దేశవ్యాప్తంగా పాపులరయ్యాడు. అందుకే ఇప్పుడు అతడి నుంచి వస్తున్న 'కూలీ' గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ని అతడు ఏ రేంజులో చూపిస్తాడో చూడాలన్న ఆసక్తి అందరిలోను ఉంది. ఇక ఇదే చిత్రంలో నాగార్జున లాంటి పెద్ద స్టార్ నటిస్తుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
కూలీ కథాంశం గురించి ఇప్పటికే రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. ఎన్ని ఊహాగానాలు ఉన్నా, లోకేష్ కనగరాజ్ కానీ, అతడి టీమ్ కానీ 'కూలీ' కథాంశం ఏమిటన్నది లీక్ ఇవ్వలేదు. టీజర్ లో గడియారాలు, బంగారం వగైరా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో కొన్ని ఆన్ లైన్ టికెటింగ్ వెబ్ సైట్లు కథను వండే ప్రయత్నం చేసాయి. రజనీ, లోకేష్ కనగరాజ్ ఎలాంటి హింట్ ఇవ్వకుండానే కొన్ని వెబ్ సైట్లు కూలీ కథపై ఊహాజనిత కథనాలు అల్లాయి.
సూపర్‌స్టార్ రజనీకాంత్ కూలీ చిత్రంలో ఆసక్తికర పాత్రలో నటించారు. అతడు ప్రతీకారం కోసం ఎదురు చూసే ఏజ్డ్ స్మగ్లర్ దేవా పాత్రలో నటించాడు. యుక్తవయసులో బ్యాలెన్స్ ఉండిపోయిన పగ ప్రతీకారాలను లేట్ ఏజ్ లో దేవా ఎలా తీర్చుకున్నాడు? అన్నదే కూలీ కథాంశం. అయితే అతడి కంటూ గతంలో ఒక మాఫియా గ్యాంగ్ ఉంటుంది. దానిని వృద్ధుడు అయ్యాక తిరిగి పునరుద్ధరించాలనుకుంటాడు. అదే క్రమంలో గడియారాల స్మగ్లింగ్ తో అతడికి పనేంటి? అన్నది ఆసక్తికరంగా మారుతుంది. బంగారం స్మగ్లర్ గా కనిపిస్తూనే, గడియారాలను దొంగిలించి దానిలోని సాంకేతికతను దొంగిలించే వాడిగా అతడి పాత్ర మల్టిపుల్ షేడ్స్ తో రక్తి కట్టిస్తుంది.
లెటర్‌బాక్స్‌డ్ వివరాల ప్రకారం.. కూలీలో రజనీకాంత్ పాత్ర దేవా.. మాఫియా ముఠా లీడర్ అతడు. తన పాత ముఠాను తిరిగి రంగంలోకి దించాలని ఒక ప్రణాళికను రూపొందిస్తాడు. ''వృద్ధుడైన బంగారం స్మగ్లర్ తన పాత మాఫియా బృందాన్ని తిరిగి తెచ్చేందుకు పాతకాలపు బంగారు గడియారాలలో దాగి ఉన్న ఒక ప్రత్యేక సాంకేతికతను ఉపయోగిస్తాడు. ఆ ప్రత్యేక గడియారాన్ని దొంగిలించి తెస్తాడు. కానీ తన సామ్రాజ్యాన్ని తిరిగి పొందాలనే అతడి ఆశ చాలా పెద్దది. ప్రణాళిక కఠినమైనది. నేరం, దురాశ వంటి అంశాలు అతడిని ఎటు లాక్కెళ్లాయి? అన్నది తెరపైనే చూడాలి.
దేవా గత తప్పిదాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎందుకు కలిగింది? అన్నది తెరపైనే చూడాలని అమెరికాకు చెందిన 'ఫండగో' టికెటింగ్ వెబ్ సైట్ తన కథనంలో పేర్కొంది. దేవా యువకుడిగా ఉన్నప్పుడు కొందరితో వైరం ఏర్పడుతుంది. తన గత తప్పులు తెలుసుకుని సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తాడు. యవ్వనంలో ఘటనలకు ప్రతీకారం కోసం నిరంతర అన్వేషణ కొనసాగిస్తాడు. అతడి అల్లకల్లోలమైన ప్రతీకార జర్నీ కాంప్లికేషన్స్ తెర నిండుగా యాక్షన్ కి కారణమవుతాయి'' అని ఫండగో వెబ్ సైట్ పేర్కొంది. ఈ కథ వినేందుకు చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తోంది కదా! తెరపై లోకేష్ శైలి స్క్రీన్ ప్లే మరింత మాయాజాలం చేస్తుందని అంతా భావిస్తున్నారు. గడియారాలు, బంగారం సినిమా ప్రచార సామగ్రిలో ఎక్కువగా కనిపిస్తున్నాయి గనుక ఈ ఊహాగానాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.