75 ఏళ్లు వచ్చినా.. తలైవా.. నీకు తిరుగులేదు!

రజినీకాంత్ కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసినా, సూపర్ స్టార్ అనే ట్యాగ్ ను మాత్రం పదిలంగా కాపాడుకుంటూ వచ్చారు.;

Update: 2025-12-12 11:30 GMT

బస్ కండక్టర్ శివాజీ రావు గైక్వాడ్ నుంచి ఇండియన్ సినిమా సూపర్ స్టార్ రజినీకాంత్ గా ఎదిగిన ప్రస్థానం ఒక అద్భుతమైన నవల లాంటిది. నేడు ఆయన 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సాధారణంగా ఎవరైనా 60 ఏళ్లు దాటాక రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తారు, విశ్రాంతి కోరుకుంటారు. కానీ రజినీకాంత్ మాత్రం ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ ను శాసిస్తున్నారు. ఏడున్నర పదుల వయసులో ఆయన చూపిస్తున్న ఎనర్జీ చూసి ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోతోంది.

రజినీకాంత్ కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసినా, సూపర్ స్టార్ అనే ట్యాగ్ ను మాత్రం పదిలంగా కాపాడుకుంటూ వచ్చారు. దీనికి ప్రధాన కారణం ఆయన తనను తాను మార్చుకుంటూ వచ్చిన విధానం. ఒకప్పుడు స్టైల్, సిగరెట్ మేనరిజమ్స్ తో అలరించిన రజినీ, ఇప్పుడు వయసుకి తగ్గ పాత్రలు ఎంచుకుంటూనే మాస్ మసాలాను వదలడం లేదు. కేవలం హీరోగానే కాకుండా, స్క్రీన్ మీద ఒక పవర్ సెంటర్ లా కనిపించడమే రజినీకాంత్ సక్సెస్ సీక్రెట్.

ముఖ్యంగా ఆయన ప్రస్తుతం ఎంచుకుంటున్న సినిమాలు ఆయనలోని కసిని చూపిస్తున్నాయి. 'జైలర్' సినిమాతో తానెంత స్ట్రాంగ్ గా ఉన్నానో నిరూపించుకున్నారు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా 'జైలర్ 2' వస్తోంది. నెల్సన్ లాంటి న్యూ జనరేషన్ డైరెక్టర్ తో వర్క్ చేయడం ఆయన అప్డేటెడ్ మైండ్ సెట్ కు నిదర్శనం. అలాగే తన మిత్రుడు కమల్ హాసన్ నిర్మాణంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మరో విశేషం.

వీటన్నింటి కంటే ఆసక్తికరమైన విషయం 'నరసింహా' (పడయప్పా) సీక్వెల్. దశాబ్దాల క్రితం వచ్చిన ఆ సినిమా రజినీ కెరీర్ లో ఒక బిగ్ రికార్డ్. ఇప్పుడు దానికి సీక్వెల్ ప్రకటించడం అంటే ఫ్యాన్స్ కు పండగే. ఈ లైనప్ చూస్తుంటే ఆయన ఇప్పట్లో తగ్గేదేలే అనిపిస్తోంది. కొత్త కథలు, పాత క్లాసిక్ సీక్వెల్స్.. ఇలా రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ ఈ ఏజ్ లో కూడా బిజీగా ఉండటం ఒక్క రజినీకే చెల్లింది.

రజినీకాంత్ 75వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దగ్గరి నుంచి సినీ, రాజకీయ ప్రముఖులందరూ విషెస్ చెప్పడం ఆయన స్థాయిని తెలియజేస్తోంది. ఒక సామాన్య కండక్టర్ దేశం గర్వించే స్థాయికి ఎదగడం, 50 ఏళ్లుగా నంబర్ వన్ స్థానంలో కొనసాగడం అంటే మాటలు కాదు. స్టైల్, ఆ నవ్వు, ఆ నడక.. ఇవేవీ వయసుతో పాటే మారలేదు, ఇంకాస్త గ్రేస్ ను సంతరించుకున్నాయి.

మొత్తానికి రజినీకాంత్ కు వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అని మరోసారి రుజువైంది. శరీరం అలసిపోవచ్చు కానీ, ఆయనలోని నటుడు, ఎంటర్టైనర్ మాత్రం ఇంకా యవ్వనంలోనే ఉన్నాడు. రాబోయే 'జైలర్ 2', 'నరసింహా 2' సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర ఇంకెన్ని రికార్డులు తిరగరాస్తారో చూడాలి. ఏదేమైనా తలైవా.. నీకు తిరుగులేదు.

Tags:    

Similar News