తెలుగు వారు దత్తత తీసుకున్న హీరో సూర్య!
ఇటీవల కొన్ని పరాజయాలు అతడికి ఇబ్బందిగా మారినా కానీ, ఇప్పుడు అన్నిటి నుంచి బయటపడుతున్నాడు.;
తమిళ స్టార్ హీరో సూర్యకు టాలీవుడ్ లోను గొప్ప క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. గజిని, ఆరు, సూర్య సన్నాఫ్ కృష్ణన్, సింగం, సింగం 2, రక్తచరిత్ర, వాడు వీడు, జై భీమ్, ఆకాశం నీ హద్దుగా.. ఇలాంటి ఎన్నో క్రేజీ చిత్రాలతో సూర్య తెలుగు నాట కూడా గొప్ప ఆదరణ పొందాడు. కెరీర్ లో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలతో సూర్య తన ఉనికిని చాటుకున్నాడు.
ఇటీవల కొన్ని పరాజయాలు అతడికి ఇబ్బందిగా మారినా కానీ, ఇప్పుడు అన్నిటి నుంచి బయటపడుతున్నాడు. అతడు తెలుగు దర్శకులతోను పని చేస్తూ, తెలుగు వారికి అత్యంత ప్రాధాన్యతనివ్వడం చర్చగా మారింది. దశాబ్ధాలుగా తన అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న సూర్య, ఇప్పుడు నేరుగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంలో నటిస్తున్నాడు.
ఇక జయాపజయాలతో సంబంధం లేకుండా అతడు టాలీవుడ్ లో అభిమానం చూరగొంటున్నాడనడానికి నిన్నటి మాస్ జాతర ఈవెంట్ ఒక పెద్ద లైవ్ ఎగ్జాంపుల్. ఈ వేదికపై సూర్య ప్రసంగిస్తుంటే ఫ్యాన్స్ విజిల్స్ తో జోష్ చూపించారు. రవితేజపై ప్రశంసలు కురిపిస్తున్న సూర్యను మాస్ రాజా ఫ్యాన్స్ వోన్ చేసుకున్నారు. అదే వేదికపై నటకిరీటి, సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ నేరుగా సూర్యకు తెలుగు ప్రేక్షకులలో ఉన్న అభిమానాన్ని హైలైట్ చేస్తూ మాట్లాడారు. సూర్యను ఆయన నాన్నగారి రోజుల నుంచి చూస్తున్నానని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
అయితే రాజేంద్ర ప్రసాద్ సూర్యను `అడాప్టెడ్ తెలుగు హీరో` అంటూ కీర్తించినప్పుడు ఫ్యాన్స్ విజిల్స్ తో హుషారెత్తించారు. ఒక నిమిషం పాటు రాజేంద్ర ప్రసాద్ తన స్పీచ్ ని కొనసాగించేందుకు ఇబ్బందిపడ్డారు. ఊహించని రీతిలో ఫ్యాన్స్ కేకలు, విజిల్స్ ని రాజేంద్రుడు నిశితంగా గమనిస్తూ ఉండిపోయారు. ప్రస్తుతం ఈ దృశ్యానికి సంబంధించిన క్లిప్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. తెలుగు ప్రేక్షకుల సంస్కారం గురించి రాజేంద్రప్రసాద్ ప్రస్థావిస్తూ,... అది అది మన సంస్కారం..! అంటూ తనదైన ట్రేడ్ మార్క్ ఎక్స్ ప్రెషన్ తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఇరుగు పొరుగు హీరోల్లో ప్రతిభావంతులను తెలుగు ప్రేక్షకులు ఎంతగా నెత్తిన పెట్టుకుంటారో ఈ వేదిక వద్ద స్పందనలు చూపించాయి. తనను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానులకు మనస్ఫూర్తిగా నమస్కారం చేసేందుకు సూర్య వేదిక వద్ద లేచి నిలబడ్డారు. అభిమానులకు అభివాదం చేసారు.