రాజమౌళి దేశానికేమీ సేవ చేయట్లేదు: వానరసేన హెచ్చరిక

'వారణాసి' సినిమా ఈవెంట్ లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఒక మతపరమైన, సామాజిక చర్చకు దారితీశాయి.;

Update: 2025-11-20 03:16 GMT

'వారణాసి' సినిమా ఈవెంట్ లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఒక మతపరమైన, సామాజిక చర్చకు దారితీశాయి. నాకు దేవుడంటే నమ్మకం లేదు అంటూని, హనుమాన్ పై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఆయన అన్న మాటలపై హిందూ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రీయ వానరసేన సభ్యులు రాజమౌళిపై విరుచుకుపడ్డారు. ఆయన తీసే సినిమాలు గొప్పవి కావొచ్చు, కానీ ఆయన భావజాలం మాత్రం హిందూ సమాజానికి వ్యతిరేకంగా ఉందని వారు ఆరోపిస్తున్నారు.

వానరసేన సభ్యులు మాట్లాడుతూ, "రాజమౌళి పెద్ద డైరెక్టర్ కావొచ్చు, హై బడ్జెట్ సినిమాలు తీయొచ్చు. అంతమాత్రాన ఆయన దేశానికి సేవ చేస్తున్నట్లు కాదు. కలెక్షన్ల విషయంలో విషయంలో ఆయన పెద్దవాడు కావొచ్చు, కానీ మాకు ఆదర్శప్రాయుడు మాత్రం కాదు. మాకు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శంకరాచార్యులు ఆదర్శం తప్ప సినిమా వాళ్లు కాదు" అని స్పష్టం చేశారు.

ముఖ్యంగా రాజమౌళి గత సినిమాల్లో హిందూత్వాన్ని వాడుకుని డబ్బు సంపాదించారని వారు విమర్శించారు. "బాహుబలిలో శివలింగాన్ని ఎత్తుకెళ్లే సీన్ పెట్టి కోట్లు సంపాదించారు. అప్పుడు శివుడు గుర్తుకురాలేదా? బాహుబలి 1 లో 'ఇరుక్కుపో' అనే పాటలో ముస్లిం వేషధారణలో డాన్స్ చేయించడం ద్వారా హిందూ సంప్రదాయాన్ని కించపరిచారు" అని వారు ఘాటుగా ప్రశ్నించారు. వేదాతి దేవుడైన ఇంద్రుడిని యానిమేషన్ సిరీస్ లో నెగిటివ్ షేడ్ లో చూపించడం కూడా సరికాదన్నారు.

హిందుత్వం బలపడిన తర్వాతే దాన్ని క్యాష్ చేసుకోవడానికి రాజమౌళి పురాణాల వైపు వచ్చారని వారు ఆరోపించారు. సినిమా మొదట్లో హిందూత్వం గురించి, దేవుళ్ల గురించి మాట్లాడటం, తీరా సినిమా రిలీజ్ అయ్యాక ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. రాజమౌళిని గొప్ప అని సంబోధించడం మానేయాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు.

"మీరు సినిమాలు తీసి డబ్బు సంపాదించుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మా ధర్మాన్ని, మా దేవుళ్లను కించపరిచేలా మాట్లాడితే మాత్రం సహించేది లేదు" అని వానరసేన సభ్యులు హెచ్చరించారు. రాజమౌళి వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Tags:    

Similar News