రాజమౌళితో అప్పుడు మిస్సయినా కానీ..!
ఎస్.ఎస్.రాజమౌళి టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోలందరితో కలిసి పని చేస్తున్నారు. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్లతో కలిసి పని చేసారు. వారందరినీ పాన్ ఇండియా స్టార్లుగా ఆవిష్కరించారు.;
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళితో కలిసి పని చేయాలని ఆశించని హీరోలు ఉంటారా? అంత పెద్ద దర్శకుడు అవకాశం కలపిస్తే ఎవరైనా దానిని వదులుకుంటారా? భారతదేశం నుంచి ఆస్కార్ విన్నింగ్ సినిమా తెరకెక్కించిన ఏకైక దర్శకుడు రాజమౌళి. ఈ అరుదైన ఘనత ఆయనకు మాత్రమే సాధ్యమైంది. ఆయన అవకాశం కల్పించాలే కానీ చిన్న పాత్రలో అయినా నటించేందుకు వెనకాడరు. అలాంటి క్రేజ్ రాజమౌళికి ఉంది.
ఎస్.ఎస్.రాజమౌళి టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోలందరితో కలిసి పని చేస్తున్నారు. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్లతో కలిసి పని చేసారు. వారందరినీ పాన్ ఇండియా స్టార్లుగా ఆవిష్కరించారు. ఇప్పుడు మహేష్ ని పాన్ వరల్డ్ కి పరిచయం చేయబోతున్నారు. ఆ తర్వాత ఆ ఒక్క ఛాన్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఉంది! అంటూ కొంతకాలంగా ప్రచారం సాగుతోంది.
అయితే కేవలం అల్లు అర్జున్‌కి మాత్రమే కాదు.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు కూడా జక్కన్నతో ఒక ఛాన్స్ ఉందని గుసగుస వినిపిస్తోంది. నిజానికి సౌతిండియాలో గొప్ప ఫాలోయింగ్ ఉన్న సూర్య చాలా కాలం క్రితమే రాజమౌళితో కలిసి పని చేయాల్సి ఉంది. అప్పట్లో రాజమౌళి ఓ రెండు స్క్రిప్టుల్ని కూడా సూర్యకు వినిపించారు. అందులో ఒకటి విక్రమార్కుడు కాగా రెండోది మగధీర. కానీ రకరకాల కారణాలతో సూర్య ఆ సినిమాల్లో నటించలేకపోయారు. సూర్యకు ఛాన్స్ మిస్సయిన తర్వాత `విక్రమార్కుడు` రవితేజకు వెళ్లింది. `మగధీర` స్క్రిప్టు రామ్ చరణ్ కి వెళ్లింది. ఆ ఇద్దరి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఒక రకంగా గేమ్ ఛేంజింగ్ ఆఫర్లు ఇవి. కానీ సూర్య మిస్ చేసుకున్నాడు.
ఈ రెండు సినిమాలు సూర్య చేసి ఉంటే అతడి స్టార్ డమ్ మరో రేంజులో ఉండేది! అంటూ విశ్లేషించుకున్నా కానీ, ఆ అవకాశం అప్పటికి లేదు. అది విధి.. దానిని ఎవరూ మార్చలేరు! కనీసం ఇప్పటికి అయినా రాజమౌళితో సూర్యకు అవకాశం వస్తుందా? అన్నది సస్పెన్స్ గా మారింది. ఆ రెండు అవకాశాల్ని వదులుకున్న తర్వాత సూర్య చాలా సార్లు రాజమౌళి సర్ తో కలిసి ఒక చిన్న పాత్రలో అయినా పని చేయాలని తాను కోరుకుంటున్నట్టు వ్యాఖ్యానించారు. నేడు భారతదేశంలోనే నంబర్ వన్ డైరెక్టర్ గా ఖ్యాతి ఘడించిన రాజమౌళి ఇప్పటికి అయినా సూర్యతో సినిమా చేస్తారా? లేదా! అన్నది వేచి చూడాలి. బహుశా మల్టీస్టారర్ ట్రెండ్ లో అల్లు అర్జున్- సూర్య లాంటి రేర్ కాంబినేషన్ తో సినిమా చేస్తే అది నిజంగా పాన్ ఇండియాలో సంచలనంగా మారుతుందనడంలో సందేహం లేదు. ఇద్దరు పవర్ ప్యాక్డ్ పెర్ఫామర్లు పోటీపడి నటిస్తుంటే, అలాంటి గొప్ప సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తే, అది వీక్షకులకు చాలా స్పెషల్ ట్రీట్ గా మారుతుంది.