ప్రమోషన్ల రేసులో రాజమౌళి వెనకబడ్డారా?
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సినిమా రిలీజ్ అవుతుందంటే? కేవలం వెండితెరపైనే కాదు. ప్రమోషన్ల విషయంలోనూ ఓ కొత్త విప్లవం కనిపిస్తుంది.;
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సినిమా రిలీజ్ అవుతుందంటే? కేవలం వెండితెరపైనే కాదు. ప్రమోషన్ల విషయంలోనూ ఓ కొత్త విప్లవం కనిపిస్తుంది. `బాహుబలి`, `ఆర్ఆర్ఆర్`చిత్రాలతో భారతీయ సినిమా మార్కెటింగ్ స్థాయిని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన ఘనత ఆయనది. అయితే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ తో ఆయన తెరకెక్కిస్తోన్న భారీ అడ్వెంచర్ డ్రామా `వారణాసి`కి సంబంధించి ప్రమోషన్ల వేగం నెమ్మదించిందా? అనే అనుమానాలు సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇతర భారీ చిత్రాలు గ్లోబల్ ప్రమోషన్లతో దూసుకుపోతుంటే రాజమౌళి ఇంకా మౌనంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
బాలీవుడ్ డ్రీమ్ ప్రాజెక్ట్ `రామాయణం` ఇప్పటికే ప్రమోషన్ల రేసులో ఒక అడుగు ముందుకేసింది. జూలైలో అమెరికాలో జరగబోయే ప్రతిష్టాత్మక కామికాన్ ఈవెంట్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసి ప్రపంచవ్యాప్తంగా హైప్ క్రియేట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ బాలీవుడ్ ఇంతలా దూకుడు ప్రదర్శిస్తుంటే? అంతర్జాతీయ గుర్తింపు ఉన్న రాజమౌళి వారణాసి ప్రాజెక్ట్ గురించి కనీసం చిన్న అప్‌డేట్ కూడా ఇవ్వకపోవడం వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
నిజానికి రాజమౌళి ప్రమోషన్ల శైలి చాలా భిన్నంగా ఉంటుంది. ఆయన ఏదైనా అప్‌డేట్ ఇచ్చారంటే అది సోషల్ మీడియాను షేక్ చేయడమే కాదు బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించేలా ఉంటుంది. `వారణాసి` చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానుంది. విడుదలకు ఇంకా తగినంత సమయం ఉండటంతో ఇప్పుడే హడావిడి చేసి అంచనాలను అతిగా పెంచడం కంటే సరైన సమయంలో ఒకేసారి మెగా అప్‌డేట్ తో ప్రేక్షకుల ముందుకు రావాలని భావిస్తుండొచ్చు. మరో కోణంలో చూస్తే ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ , సాంకేతిక పరంగా రాజమౌళి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు.
సినిమా కంటెంట్ పట్ల పూర్తి స్పష్టత వచ్చిన తర్వాతే ప్రమోషన్లొకి దిగడం ఆయన అలవాటు. `రామాయణం` వంటి చిత్రాలు ప్రారంభంలోనే భారీ ప్రమోషన్లు మొదలుపెట్టినప్పటికీ రాజమౌళికి తన సినిమాపై ఉన్న నమ్మకం, మహేష్ కున్న క్రేజ్ ఖచ్చితంగా సరైన సమయంలో సినిమాను వార్తల్లో నిలుపుతాయన్నది ఆయన వ్యూహం కావొచ్చు.
ప్రమోషన్ల రేసులో వెనకబడటం అంటే ఓడిపోవడం కాదు. తన అస్త్రాన్ని పదును పెట్టుకోవడానికి తీసుకునే విరామంగా ఎందుకు చూడకూడదు. గ్లోబల్ రేంజ్‌లో సినిమాను విడుదల చేయాలనుకున్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్‌ను రాజమౌళి నిశితంగా గమనిస్తుంటారు.
ఇతర భారీ చిత్రాల హడావిడి తగ్గినప్పుడు లేదా ఒక ప్రత్యేక సందర్భంలో `వారణాసి` గర్జన మొదలయ్యే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు ఆయన మౌనం సినిమాపై మరింత ఉత్కంఠను పెంచుతుందనడంలో సందేహం లేదు. రాజమౌళి తన పనుల ద్వారానే సమాధానం చెబుతుంటారు. `వారణాసి` నుండి వచ్చే మొదటి టీజర్ లేదా గ్లింప్స్ అన్ని రికార్డులను తిరగరాసేలా ఉంటుందని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. జూలైలో `రామాయణం` సృష్టించే హడావిడిని తట్టుకుని అంతకంటే రెట్టింపు వేగంతో రాజమౌళి తన ప్రమోషన్ల ప్రయాణాన్ని ఎప్పుడు మొదలుపెడతారో చూడాలి. ఆయన ప్రమోషన్ల రేసులో వెనకబడలేదు. కేవలం తనదైన సమయం కోసం వేచి చూస్తున్నారంతే.