రాజమౌళి విజన్‌కు ప్రభాస్ త్యాగం!

భారతీయ చలనచిత్ర పరిశ్రమ ముఖచిత్రాన్ని మార్చేసి.. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టిన ఘనత `బాహుబలి` చిత్రానిదే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Update: 2026-09-10 10:30 GMT

భారతీయ చలనచిత్ర పరిశ్రమ ముఖచిత్రాన్ని మార్చేసి.. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టిన ఘనత `బాహుబలి` చిత్రానిదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ ప్రాంచైజీ వెనుక దర్శకుడు రాజమౌళి అద్భుతమైన విజన్ ఎంత ఉందో? రెబల్ స్టార్ ప్రభాస్ చేసిన త్యాగం కూడా అంతే ఉంది. రాజమౌళి కలల ప్రాజెక్ట్‌ను నమ్మి తన కెరీర్‌లో అత్యంత కీలకమైన మూడున్నరేళ్ల సమయాన్ని కేవలం ఒక్క సినిమాకే కేటాయించడం ప్రభాస్ అంకితభావానికి నిదర్శనం.

దక్షిణాదిలో స్టార్ హీరోగా అగ్రపథంలో దూసుకుపోతున్న సమయంలో ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకోవడం పెద్ద సాహసమనే చెప్పాలి. ఏ ఇతర సినిమాలకు సైన్ చేయకుండా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటూ కేవలం అమరేంద్ర బాహుబలి , మహేంద్ర బాహుబలి పాత్రల కోసమే తన కాలాన్ని, దేహాన్ని పూర్తిగా అంకితం చేశారు. రాజమౌళి ఊహించిన ఆకారానికి, శారీరక దృఢత్వానికి తగ్గట్టుగా రూపాంతరం చెంది నిరంతరం కష్టపడ్డారు.

ఈ అపూర్వమైన త్యాగంపై దర్శకుడు రాజమౌళి పలు సందర్భాల్లో ఎంతో భావోద్వేగంతో స్పందించారు. `బాహుబలి` చిత్రం ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే దానికి ప్రధాన కారణం ప్రభాస్. ఆయన చూపిన ఓపిక, నమ్మకం లేకపోతే ఈ ప్రాజెక్ట్ అసలు సాధ్యమయ్యేదే కాదు. ఒక అగ్ర కథానాయకుడు తన కెరీర్‌లో అంతటి కీలక సమయాన్ని ఒకే సినిమా కోసం కేటాయించడం సాధారణ విషయం కాదు` అని జక్కన్న మ‌రోసారి కొనియాడారు.

ప్రభాస్ నిబద్ధత గురించి రాజమౌళి మనసులోని భావాలను పంచుకున్నారు. `తన కెరీర్‌ను, బాక్సాఫీస్ లెక్కలను పక్కనబెట్టి నా విజన్‌ను గుడ్డిగా నమ్మాడు. మూడేళ్లకు పైగా ఇతర అవకాశాలను వదులుకుని కథలో జీవించాడు. ప్రభాస్ ఇచ్చిన అపారమైన మద్దతే నన్ను మరింత ధైర్యంగా.. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను చెక్కేలా చేసింది` అని కృతజ్ఞతను చాటుకున్నారు.

`బాహుబలి: ది బిగినింగ్`, `బాహుబలి 2: ది కన్‌క్లూజన్` రూపంలో వచ్చిన ఫలితం వీరిద్దరి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చింది. ఈ విజయం ప్రభాస్ ఇమేజ్‌ను ప్రపంచవ్యాప్త పాన్-ఇండియా స్టార్‌గా నిలబెట్టింది. రాజమౌళి విజన్, ప్రభాస్ త్యాగం కలిసి భారతీయ చలనచిత్ర చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించాయి.

నేటికీ టాలీవుడ్‌లోనే కాకుండా వినోద ప్రపంచంలో ఎక్కడ చర్చ వచ్చినా? `బాహుబలి` కోసం ప్రభాస్ కేటాయించిన సమయం, చూపిన అంకితభావం నటుడి ప్యాషన్‌కు ఉదాహరణగా నిలుస్తాయి. రాజమౌళి విజన్‌కు ప్రభాస్ అందించిన త్యాగమే వారిద్దరి మధ్య బలమైన బంధాన్ని ఏర్పరిచింది. భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి ఇద్ద‌రు క‌లిసి మ‌ళ్లీ సినిమా చేయాల‌ని అభిమానులు కోరుతున్నారు. వార‌ణాసి త‌ర్వాత రాజ‌మౌళి డార్లింగ్ తోనే ఓ సోలో సినిమా చేస్తే బాగుంటుంద‌ని కోరుతున్నారు. మ‌రి అది సాధ్య‌మ‌ వుతుందా? లేదా? అన్న‌ది రాజ‌మౌళి చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే జ‌క్క‌న్న క‌థ రెడీ అంటే? రంగంలోకి దిగ‌డానికి ప్ర‌భాస్ ఎల్ల‌వేళ‌లా సిద్దంగా ఉంటారు.

Tags:    

Similar News