ఫుట్‌పాథ్‌పై చొక్కాల‌మ్మాడు.. నేడు 100కోట్ల సామ్రాజ్యానికి అధిప‌తి!

బెంగుళూరు వీధుల్లో చొక్కాలు అమ్ముకునే స్థాయి నుండి రూ.100 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించే స్థాయికి చేరుకున్న న‌టుడు రాజా నాయక్ జీవిత ప్రయాణం నిజంగా ఒక సినిమాని తలపిస్తుంది.;

Update: 2026-01-21 17:30 GMT

బెంగుళూరు వీధుల్లో చొక్కాలు అమ్ముకునే స్థాయి నుండి రూ.100 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించే స్థాయికి చేరుకున్న న‌టుడు రాజా నాయక్ జీవిత ప్రయాణం నిజంగా ఒక సినిమాని తలపిస్తుంది. అమితాబ్ బచ్చన్ నటించిన 'త్రిశూల్' సినిమా అత‌డి జీవితాన్ని మలుపు తిప్పింది.

బెంగుళూరులోని ఒక దళిత నిరుపేద కుటుంబంలో జన్మించిన రాజా నాయక్, చిన్నతనంలో ఆకలి బాధ అంటే ఏమిటో చూశారు. తండ్రికి స్థిరమైన పని లేకపోవడంతో, ఫీజులు కట్టలేక 15 ఏళ్ల వయసులో 10వ తరగతి తర్వాత స్కూల్ మానేయాల్సి వచ్చింది.

17 ఏళ్ల వయసులో ఒకనాడు స్నేహితులతో కలిసి అమితాబ్ బచ్చన్ సినిమా 'త్రిశూల్' చూశారు. ఆ సినిమాలో జీవించ‌డానికి క‌నీసం ఏమీ లేని అమితాబ్ బచ్చన్ ఎంతో కష్టపడి పెద్ద రియల్ ఎస్టేట్ టైకూన్‌గా ఎలా ఎదిగారో చూసి రాజా నాయక్ ఎగ్జ‌యిట్ అయ్యాడు. అత‌డు చేయగలిగితే నేను ఎందుకు చేయలేను? అనే ఆలోచన ఆయనలో మొదలైంది. త్రిశూల్ లో క‌థానాయ‌కుడి పాత్ర త‌న‌లో స్ఫూర్తిని నింపింది. ఆ మూడు గంటల సినిమా ఆయనలో గెలుపుపై బలమైన ఆశను నింపింది.

సినిమా చూసిన తర్వాత తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ముంబై వెళ్లారు. కానీ అక్కడ ఏ పనీ దొరకకపోవడంతో వెనక్కి తిరిగి వచ్చారు. త‌ర్వాత తన తల్లి వద్ద కొంచెం డబ్బు అప్పు తీసుకుని తమిళనాడులోని తిరుప్పూర్ నుండి తక్కువ ధరకు షర్టులు కొని బెంగుళూరులోని ఎం.ఐ.సివో (ప్రస్తుత బాస్చ్ ఆఫీస్) గేట్ వద్ద ఫుట్‌పాత్‌పై అమ్మడం మొదలుపెట్టారు.

ఆ ఏరియాలో కంపెనీ ఉద్యోగులంతా నీలం లేదా తెలుపు రంగు షర్టులు వేసుకుంటారని గమనించి, అవే రంగుల షర్టులను అమ్మడం వల్ల మొదటి రోజే రూ.5,000 లాభం సంపాదించారు. ఒక చిన్న ఫుట్‌పాత్ వ్యాపారిగా మొదలైన రాజా నాయక్ క్రమంగా తన వ్యాపారాన్ని విస్తరించారు. 1991లో అక్షయ్ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో ప్యాకేజింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. త‌ర్వాత ఎం.సి.ఎస్‌ లాజిస్టిక్స్ పేరుతో అంతర్జాతీయ షిప్పింగ్ & రవాణా సంస్థను స్థాపించారు. జలా బేవరేజెస్ పేరుతో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ వ్యాపారంలోకి ప్రవేశించారు. హెల్త్ కేర్ లో ప‌ర్పుల్ హ్యాజ్, న్యూట్రిషన్ రంగంలో న్యూట్రి ప్లానెట్ వంటివి స్థాపించి విజయవంతమయ్యారు.

ప్రస్తుతం రాజా నాయ‌క్ వార్షిక టర్నోవర్ రూ.100 కోట్లకు పైగానే ఉంది. తాను చదువుకోలేకపోయినా పేద పిల్లల కోసం బెంగుళూరులో ఒక స్కూల్ నడుపుతున్నారు. దళిత ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (DICCI) కర్ణాటక అధ్యక్షుడిగా ఉంటూ వేలాది మంది యువ పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తినిస్తున్నారు. కష్టపడే తత్వం ఉంటే ఏదీ అసాధ్యం కాదు! అని నిరూపించిన రాజా నాయక్ కథ ప్రతి ఒక్కరికీ ఆదర్శం. సినిమాలు చూసి చెడిపోకు! అని కొడుకుల‌ను తిట్టే చాలామంది తండ్రులు కూడా రాజా నాయ‌క్ క‌థ‌ను తెలుసుకుంటే క‌నువిప్పు.

Tags:    

Similar News