దేశంలో అంతా బావుంటే దుబాయ్‌లో ఎందుకు నివశిస్తున్నారు? మ్యాడీ-ఒబెరాయ్ జవాబు ఇచ్చారు కదా!
నటులు వివేక్ ఒబెరాయ్, ఆర్. మాధవన్‌లపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ థాక్రా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
నటులు వివేక్ ఒబెరాయ్, ఆర్. మాధవన్‌లపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ థాక్రా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో `అంతా అద్భుతంగా మార్చేసిందని` పొగిడే ఈ నటులు... భారత్‌లోనే ఉండకుండా దుబాయ్‌లో ఎందుకు స్థిరపడ్డారని ఆయన సూటిగా ప్రశ్నించారు. ముంబైలో మహారాష్ట్ర నవనిర్మాణ విద్యార్థి సేన (ఎం.ఎన్.వి.ఎస్) 20వ వార్షికోత్సవ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడిన రాజ్ థాక్రా.. దేశంలో సుమారు వేలాది మంది పారిశ్రామికవేత్తలు తమ వ్యాపారాలను సర్దుకుని దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారని ఆరోపించారు. 2019లో పిఎం మోదీ బయోపిక్‌లో నటిస్తూ మోదీ పాత్రను పోషించిన వివేక్ ఒబెరాయ్ దుబాయ్‌లో నివసిస్తున్నారు. అలాగే ప్రధానిని ప్రశంసించే ఆర్. మాధవన్ ఎక్కడ ఉంటున్నారు? ఆయన కూడా దుబాయ్‌లోనే ఉంటున్నారు. నిజంగానే మీకు భారత్ అంటే అంత ప్రేమ ఉంటే...మోదీ పాలనలో దేశం అభివృద్ధి చెందుతోందని మీరు నమ్మితే మీ కుటుంబాలతో విదేశాల్లో ఎందుకు ఉంటున్నారు? అని థాక్రే నిలదీశారు. వీరు ఇక్కడకు వచ్చి ప్రభుత్వ మద్దతు ఉన్న ధురంధర్ లాంటి సినిమాల్లో నటించి... తిరిగి దుబాయ్ వెళ్ళిపోతారని ఆయన విమర్శించారు.
అయితే ఈ విమర్శలపై గతంలో నటులు ఇచ్చిన వివరణలను పరిశీలిస్తే.. ఆర్. మాధవన్ కోవిడ్ సమయం నుండి తన కుమారుడి స్విమ్మింగ్ కెరీర్ శిక్షణ కోసం దుబాయ్‌కి మారినట్లు పేర్కొనగా.. వివేక్ ఒబెరాయ్ అక్కడ సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించడం కోసం దుబాయ్ వెళ్లినట్లు తెలిపారు.
ఇక ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రతిపక్షాల నిరసనల్లో ప్రధాని మోదీపై ఉపయోగించిన భాషను రాజ్ థాక్రా తప్పుపట్టారు. అలాంటి తప్పుదోవ పట్టిన పిల్లలను క్షమించి సరైన మార్గంలో నడిపించాలి! అని ప్రధాని చేసిన వ్యాఖ్యతో తాను ఏకీభవిస్తున్నానని చెబుతూనే.. అంతటి దిగజారిన భాషను ఎవరూ ఉపయోగించకూడదని కానీ ఈ విషయాన్ని ప్రధాని ముందుగా తన సొంత పార్టీ నాయకులకు చెప్పాలని ఎద్దేవా చేశారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ నుంచి థాక్రే కుటుంబం వరకు బిజెపి ట్రోలర్లు అందరినీ టార్గెట్ చేశారని విమర్శించారు.
సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్ భయంతోనే చాలామంది నటులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం లేదని థాక్రే అభిప్రాయపడ్డారు. అనుచిత భాషను ఉపయోగించకుండా ముందుగా బిజెపి ట్రోల్ టీమ్‌లను ఆపాలి. మీరేం విత్తుతారో దాన్నే కోస్తారు అని వ్యాఖ్యానించారు. అలాగే నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారం నిరసనలకు ఒక తక్షణ కారణం మాత్రమేనని... ప్రజల్లో ఇన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన అసంతృప్తికి ఈ నిరసనలే నిదర్శనమని రాజ్ థాక్రే స్పష్టం చేశారు.