ది గర్ల్ ఫ్రెండ్ నిజ సంఘటన.. 13 ఏళ్ల క్రితమే మొదలు..

రాహుల్ రవీంద్రన్.. సినీ నటుడిగా తెలుగు, తమిళ్ , ఇంగ్లీష్ సినిమాలలో నటించి తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్న ఈయన దర్శకుడిగా కూడా మంచి పేరు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.;

Update: 2025-10-25 11:25 GMT

రాహుల్ రవీంద్రన్.. సినీ నటుడిగా తెలుగు, తమిళ్ , ఇంగ్లీష్ సినిమాలలో నటించి తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్న ఈయన దర్శకుడిగా కూడా మంచి పేరు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అలాంటి ఈయన దర్శకత్వంలో రాబోతున్న మరో చిత్రం 'ది గర్ల్ ఫ్రెండ్'. గీత ఆర్ట్స్ బ్యానర్ అధినేత అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మిక లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి కీలకపాత్ర పోషిస్తున్నారు. వీరితోపాటు రావు రమేష్ రష్మిక తండ్రి పాత్రలో నటిస్తుండగా.. అను ఇమ్మానుయేల్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కూడా ఇందులో నటుడిగా కొన్ని నిమిషాలు కనిపించబోతున్నట్లు ట్రైలర్ లో చూపించారు.

విషయంలోకి వెళ్తే.. నవంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా అక్టోబర్ 25న ఈ చిత్రం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు చిత్ర బృందం. ట్రైలర్ రిలీజ్ అనంతరం ఈ సినిమా గురించి ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించిన రష్మిక గురించి ప్రతి ఒక్కరూ కీలక కామెంట్లు చేశారు. అందులో భాగంగానే ఈ సినిమా స్టోరీ ఎలా మొదలైంది? అసలు ఈ సినిమా కథకు పునాది ఎక్కడ పడింది? అంటూ తదితర విషయాలను డైరెక్టర్ రాహుల్ పంచుకున్నారు.

రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ.. "ట్రెండింగ్ లో ఉన్న అంశాలను తెరకెక్కించాలి అనే ఆలోచనను పక్కన పెట్టి ఒక మంచి కథతో నేను మీ ముందుకు వచ్చాను. సాధారణంగా రిలేషన్ లో ఉన్న వారు ఎవరైనా సరే ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. నిజ జీవితాలకు దగ్గరగా ఉంటుంది. నా టీం సపోర్ట్ వల్లే ఈ సినిమాను ఈరోజు నేను మీ ముందుకు తీసుకురాగలుగుతున్నాను. దీక్షిత్ - రష్మిక గురించి చాలా చెప్పాలి. ఏ దర్శకులకైనా ఇలాంటి నటీనటులు దొరకడం అనేది ఒక అదృష్టం.

వారు తమ పాత్రలకు జీవం పోసారు. నిజానికి 13 ఏళ్ల నుంచి నేను ఈ కథ గురించి ఆలోచిస్తున్నాను. నేను హాస్టల్లో ఉన్నప్పుడు జరిగిన ఒక చిన్న సంఘటన ఈ సినిమాకు పునాది వేసింది. గత ఐదు సంవత్సరాల క్రితమే దానిని స్క్రీన్ ప్లే గా రాసుకున్నాను. ఇన్ని రోజులకు ఈ చిత్రం మీ ముందుకు వచ్చింది" అంటూ రాహుల్ తెలిపారు. మొత్తానికి అయితే రాహుల్ రవీంద్రన్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి 13 ఏళ్ల క్రితం మొదలైన ఈ కథ ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.

Tags:    

Similar News