మాకు డ్ర‌గ్ టెస్టులు, మీకు లైడిటెక్ట‌ర్ టెస్టులు: రాహుల్ రామ‌కృష్ణ

టాలీవుడ్ యాక్టర్ రాహుల్ రామకృష్ణ తాజాగా ఓ పొలిటికల్ లీడర్ కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారారు.;

Update: 2026-04-01 06:19 GMT

టాలీవుడ్ యాక్టర్ రాహుల్ రామకృష్ణ తాజాగా ఓ పొలిటికల్ లీడర్ కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారారు. డ్రగ్స్ టెస్టులపై సినీ పరిశ్రమను ఉద్దేశిస్తూ చేసిన సూచనల నేపథ్యంలో ఆయన పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమైంది. రాహుల్ రామకృష్ణ కామెంట్స్ కూడా తెగ వైరల్ అవుతున్నాయి. అసలేం జరిగిందంటే..

ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలంగాణలో డ్రగ్స్ నియంత్రణపై మీడియా సమావేశంలో మాట్లాడారు. డ్రగ్స్ వ్యవహారంలో సినిమా ఇండస్ట్రీ పేరు తరచూ వినిపిస్తోందని, అందుకే హీరోలు, హీరోయిన్లు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అభిమానులు తమ ఫేవరెట్ నటీనటులను ఆదర్శంగా తీసుకుంటారని పేర్కొంటూ.. డ్రగ్స్‌ కు వ్యతిరేకంగా అవగాహన కల్పించడంలో సినీ ప్రముఖులు ముందుండాలని పిలుపునిచ్చారు.

ఈ క్రమంలో ఆయన సినిమా నటులు ప్రతి 90 రోజులకు ఒకసారి డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలని సూచించారు. అలాంటి పరీక్షల ద్వారా సమాజంలో మంచి సందేశం వెళ్తుందని, ఫ్యాన్స్ కూడా ప్రభావితమవుతారని అన్నారు. అవసరమైతే డ్రగ్స్ టెస్టులు చేయించుకున్న వారి సినిమాల విడుదలకు అనుమతి ఇవ్వాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

డ్రగ్స్ గుర్తింపులో కూడా ఎమ్మెల్యే కొన్ని విషయాలు వెల్లడించారు. యూరిన్ టెస్ట్ ద్వారా అయితే కేవలం 14 రోజుల వరకు మాత్రమే డ్రగ్స్ వినియోగం గుర్తించగలమని, అయితే వెంట్రుకల ద్వారా చేసే పరీక్షలతో 90 రోజుల వరకు వినియోగాన్ని గుర్తించవచ్చని చెప్పారు. అందుకే హెయిర్ టెస్టింగ్ విధానాన్ని అనుసరించాలని సూచించారు. సినిమా రంగంపై వస్తున్న ఆరోపణలు అడ్డుకట్ట వేయాలంటే కఠిన చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు.

అయితే ఆ వ్యాఖ్యలపై సినీ నటుడు రాహుల్ రామకృష్ణ తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన వ్యంగ్యంగా స్పందిస్తూ.. "హీరో కాకపోయినా నేను మాత్రం రెడీ. వెంటనే జీఓ జారీ చేస్తే అందరూ కలిసి చేద్దాం. మేము డ్రగ్ టెస్టులు చేస్తాం.. మీరు లై డిటెక్టర్ టెస్టులు చేయించుకోండి. ప్రతి ఆదివారం ఆ కార్యక్రమం పెట్టుకుందాం. అప్పుడు మీ మాట, మా మాట నమ్మి ప్రజలు అభివృద్ధి చెందుతారు" అంటూ కౌంటర్ ఇచ్చారు.

అదే పోస్టులో ఆయన మినోక్సిడిల్ డ్రగ్ ఎందుకు గుర్తొస్తుందో అంటూ మరోసారి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఆయన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొందరు ఆయనకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు విమర్శిస్తున్నారు. సినీ పరిశ్రమపై డ్రగ్స్ ఆరోపణలు ఉన్నాయనే అభిప్రాయాన్ని కొందరు సమర్థిస్తుండగా, మరికొందరు మాత్రం సినిమా రంగాన్ని టార్గెట్ చేయడం సరైనది కాదని అంటున్నారు. మొత్తానికి, డ్రగ్స్ టెస్టుల అంశం ఇప్పుడు రాజకీయాలు – సినీ పరిశ్రమ మధ్య చర్చనీయాంశంగా మారింది.



Tags:    

Similar News