18ఏళ్ల చిన్న నటి తో ప్రేమ.. టాలీవుడ్ 'స్టైలిష్ విలన్' లవ్ స్టోరీ ఇంట్రెస్టింగ్!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టైలిష్ విలన్ అనగానే చాలా మందికి వెంటనే గుర్తుకొచ్చే పేరు రాహుల్ దేవ్.;
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టైలిష్ విలన్ అనగానే చాలా మందికి వెంటనే గుర్తుకొచ్చే పేరు రాహుల్ దేవ్. హిందీతో పాటు తెలుగు సినిమాల్లో తనదైన విలనిజంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంతో మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఆయన లవ్ స్టోరీ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
1968 సెప్టెంబర్ 27న ఢిల్లీలో జన్మించిన రాహుల్ దేవ్, మంచి క్రమశిక్షణతో కూడిన కుటుంబంలో పెరిగారు. ఆయన తండ్రి పోలీస్ శాఖలో జాబ్ చేయడంతో చిన్ననాటి నుంచే స్ట్రిక్ట్ అబ్జర్వేషన్ మధ్య పెరిగారు. యాక్టింగ్ పై ఆసక్తితో సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన, 2000లో వచ్చిన ఛాంపియన్ సినిమాతో బాలీవుడ్ లో అరంగేట్రం చేశారు. తొలి చిత్రంతోనే ఉత్తమ విలన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత హిందీతో పాటు తెలుగు సినిమాల్లోనూ రాహుల్ దేవ్ తనదైన ముద్ర వేశారు.
సింహాద్రిలో బాలా నాయర్ పాత్ర ఆయన కెరీర్ లో మైలురాయిగా నిలిచింది. అలాగే ఆంధ్రావాలా, మున్నా, జై చిరంజీవ, టక్కరి దొంగ వంటి చిత్రాల్లో తన స్టైలిష్ విలనిజంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఫిట్ నెస్ విషయంలోనూ ఆయన ప్రత్యేకం. 57 ఏళ్ల వయసులో కూడా సిక్స్ ప్యాక్ తో యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. అయితే ఆయన జీవితం అంత సాఫీగా సాగలేదు. 2009లో ఆయన భార్య రీనా దేవ్ క్యాన్సర్ తో మరణించడం ఆయనను తీవ్రంగా కలిచివేసింది. ఆ సమయంలో సినిమాలకు కొంతకాలం దూరంగా ఉండి, తన కుమారుడిని ఒంటరిగా పెంచడం ఆయనకు పెద్ద సవాలుగా మారింది. ఒక తండ్రిగా బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత మళ్లీ కెరీర్ పై దృష్టి పెట్టారు.
ఆ సమయంలో ఆయన జీవితంలోకి నటి, మోడల్ ముగ్ధా గాడ్సే వచ్చారు. 2013లో ఒక పరిచయం ద్వారా మొదలైన వారి స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. ముఖ్యంగా వీరిద్దరి మధ్య 18 ఏళ్ల వయసు తేడా ఉండటం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయినప్పటికీ, ఆ జంట తమ రిలేషన్ ను స్ట్రాంగ్ గా కొనసాగిస్తూ వస్తున్నారు. ముగ్ధా గాడ్సే మిస్ ఇండియా 2004 సెమీ ఫైనలిస్ట్ గా నిలిచిన తర్వాత మోడలింగ్ ద్వారా గుర్తింపు పొందారు.
తర్వాత బాలీవుడ్ లో కూడా పలు చిత్రాల్లో నటించారు. ఫిట్ నెస్, యోగా, ఆధ్యాత్మికతపై ఇద్దరికీ ఉన్న ఆసక్తి వీరిని మరింత దగ్గర చేసింది. గత కొన్నేళ్లుగా ఆ జంట సహజీవనం చేస్తూ తమ బంధాన్ని నిలబెట్టుకుంటున్నారు. వయసు తేడాపై సోషల్ మీడియాలో తరచూ ట్రోల్స్ వచ్చినప్పటికీ, రాహుల్ దేవ్ మాత్రం ప్రేమకు వయసుతో సంబంధం లేదంటూ రెస్పాండ్ అవుతుంటారు.
ఇక ప్రొఫెషన్ పరంగా కూడా రాహుల్ దేవ్ ఆగలేదు. తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన, ప్రస్తుతం ఓటీటీల్లో కూడా సత్తా చాటుతున్నారు. ది ఎంపైర్, పాయిజన్ వంటి వెబ్ సిరీసుల్లో తన యాక్టింగ్ తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సిల్వర్ స్క్రీన్ పై భయపెట్టే విలన్ గా కనిపించే రాహుల్ దేవ్, నిజ జీవితంలో మంచి తండ్రిగా, క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా, ప్రేమకు కొత్త అర్థం ఇచ్చే వ్యక్తిగా నిలుస్తున్నారు. ఆయన లవ్ స్టోరీ కూడా అదే విషయం మరోసారి రుజువు చేస్తోంది.