స్టార్ అవ్వాలనే సంకల్పంతో కష్టపడి పైకొచ్చిన రియల్ హీరో రవితేజ.. మన ప.గో జిల్లా హీరోలదే హవా!
నేను ఎమ్మెల్యేగా ఉండగా, రవి తేజ ఇక్కడికి సూపర్ హీరోగా రావడం ఈ వేదికను షేర్ చేసుకోవడం మెమరబుల్ గా ఉంది..అని అన్నారు ఎమ్మెల్యే రఘు రామ.
స్టార్ అవ్వాలనే సంకల్పంతో కష్టపడి పైకొచ్చిన రియల్ హీరో రవితేజ.. స్టెప్ బై స్టెప్ ఎదిగి పెద్ద హీరో అయ్యారు. చిన్నప్పుడు కలిసి పెరిగాము. నేను ఎమ్మెల్యేగా ఉండగా, రవి తేజ ఇక్కడికి సూపర్ హీరోగా రావడం ఈ వేదికను షేర్ చేసుకోవడం మెమరబుల్ గా ఉంది..అని అన్నారు ఎమ్మెల్యే రఘు రామ.
భీమవరంలో ఘనంగా జరిగిన రవితేజ `ఇరుముడి` చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు పాల్గొని ఆసక్తికర ప్రసంగం చేశారు. ఈ వేదికపై మాస్ మహారాజ రవితేజతో తన స్నేహం.. చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. రవితేజ తన సొంత కజిన్ అని వెల్లడించిన ఆయన.. విజయవాడలో తామంతా కలిసి పెరిగిన రోజులను గుర్తు చేసుకున్నారు. కెరీర్ ప్రారంభంలో `డిస్కో డాన్సర్` సినిమా వచ్చిన కొత్తలో రవితేజ బాలీవుడ్ స్టార్ మిథున్ చక్రవర్తి కంటే అద్భుతంగా డ్యాన్స్ చేసేవాడని కొనియాడారు.
సినీ పరిశ్రమలో రవితేజ ఎదిగిన తీరు ప్రతి ఒక్కరికీ ఆదర్శమని రఘురామకృష్ణంరాజు అన్నారు. ఎవరి సహాయం తీసుకోకుండా..ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా కేవలం తన సొంత కష్టం, బలమైన సంకల్పంతోనే రవితేజ స్టార్‌గా ఎదిగారని చెప్పారు. చిన్ననాటి నుంచి స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఈరోజు `మాస్ మహారాజు`గా నిలబడటం నిజమైన హీరో లక్షణమని ప్రశంసించారు. ఒకే ప్రాంతంలో పెరిగిన తామిద్దరిలో ఒకరు ఎమ్మెల్యేగా, మరొకరు సూపర్‌స్టార్‌గా ఒకే వేదికను పంచుకోవడం తనకు ఎంతో థ్రిల్లింగ్ - మెమరబుల్ మూమెంట్ అని సంతోషం వ్యక్తం చేశారు.
ఇదే సందర్భంలో టాలీవుడ్‌లో పశ్చిమ గోదావరి జిల్లా నటుల హవా గురించి ఆయన గర్వంగా మాట్లాడారు. ఒకప్పుడు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచే ఎక్కువమంది సినీ దిగ్గజాలు వచ్చారని చెప్పుకునేవారని.. కానీ ప్రస్తుతం టాలీవుడ్ ని ఏలుతున్న సగం మందికి పైగా దిగ్గజ హీరోలు తమ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారేనని అన్నారు. రవితేజతో పాటు ప్రభాస్, పవన్ కళ్యాణ్, చిరంజీవి, కృష్ణంరాజు, అల్లు అర్జున్ వంటి అగ్ర కథానాయకులందరూ తమ ప్రాంతానికి చెందినవారు కావడం జిల్లా ప్రజలందరికీ ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు.
ఇక `ఇరుముడి` సినిమా గురించి మాట్లాడుతూ.. మొదట టైటిల్ వినగానే ఇదొక భక్తిరస చిత్రం అని భావించానని.. కానీ టీజర్ చూశాక ఇది పక్కా యాక్షన్ ఓరియెంటెడ్ అని అర్థమైందని చెప్పారు. ఈ చిత్ర నిర్మాతలైన మైత్రి మూవీస్ నవీన్ - రవి తమకు ఎంతో ఆప్తులని తెలిపారు. క్లాస్ సినిమాలను తెరకెక్కించే దర్శకుడితో మాస్ మహారాజు రవితేజ జతకట్టడం చాలా ఆసక్తికరంగా ఉందని.. ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
చివరగా చిత్ర యూనిట్ మొత్తానికి రఘురామకృష్ణంరాజు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్లు ప్రియా, నక్షత్రలతో పాటు సాంకేతిక నిపుణులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. రవి.. నువ్వు ఈ సినిమాతో మరో పెద్ద హిట్ కొట్టావు! అని తన చిన్న నాటి స్నేహితుడు రవితేజను ఉద్దేశించి ఉత్సాహంగా ముగించారు. భీమవరంలో ఈ ఈవెంట్ అభిమానుల కోలాహలం నడుమ ఎంతో ఉత్సాహంగా జరిగింది. ఈ వేడుకలో దర్శకుడు శివనిర్వాణ, హీరోయిన్ ప్రియా భవానీ శంకర్, మైత్రి రవి తదితరులు పాల్గొన్నారు.