ఆయనకు 'పుష్ప', నాకు 'అడవి రాముడు'...!
అదే కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావుతో పాటు పుష్ప దర్శకుడు సుకుమార్, కిస్సిక్ ఐటెం సాంగ్ బ్యూటీ శ్రీలీల సైతం పాల్గొన్నారు.;

అమెరికాలోని తెలుగు సంఘాల వారు నిర్వహించే కార్యక్రమాల్లో టాలీవుడ్ నుంచి ప్రముఖులు హాజరు కావడం మనం ప్రతి ఏడాది చూస్తూనే ఉంటాం. అయితే అల్లు అర్జున్ స్థాయి హీరోలు అరుదుగా హాజరు అవుతూ ఉంటారు. ఈసారి అమెరికాలో జరిగిన నాట్స్ ఈవెంట్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాల్గొన్నాడు. ఆయన పుష్ప 2 విడుదల తర్వాత అరుదుగా మాత్రమే ఇలాంటి కార్యక్రమాల్లో కనిపిస్తున్నాడు. నాట్స్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఆయన ప్రజెన్స్‌తో ఈవెంట్ సూపర్ హిట్ అయిందని నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. నాట్స్ ఉత్సవంలో స్థానిక తెలుగు వారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు, అల్లు అర్జున్‌ను చూసేందుకు ఎగబడ్డారు.
అదే కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావుతో పాటు పుష్ప దర్శకుడు సుకుమార్, కిస్సిక్ ఐటెం సాంగ్ బ్యూటీ శ్రీలీల సైతం పాల్గొన్నారు. రాఘవేంద్ర రావు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన గతంలో మైక్ పట్టుకుని తన సినిమాల గురించి మాట్లాడిన దాఖలాలు లేవు, మొహమాటంతో తన సినిమాల ప్రమోషన్‌లోనూ మాట్లాడేవాడు కాదు. కానీ ఇప్పుడు మాత్రం స్టేజ్ ఎక్కితే అనర్గలంగా మాట్లాడేస్తూ అందరినీ కట్టి పడేస్తున్నాడు. నాట్స్ ఈవెంట్‌లో రాఘవేంద్ర రావు మాట్లాడుతూ తనకు సుకుమార్ పై ఉన్న అభిమానంను చెప్పకనే చెప్పాడు. సుకుమార్ తో తనను తాను పోల్చుకుంటూ రాఘవేంద్ర రావు అక్కడ మాట్లాడారు.
రాఘవేంద్రరావు మాట్లాడుతూ... సుకుమార్ ను చూస్తే చాలా విషయాల్లో అతడిని నాకు పోలికలు కనిపిస్తూ ఉంటాయి. మా ఇద్దరికీ గడ్డం ఉంటుంది, ఇద్దరం కూడా అడవిని నమ్ముకుని చేసిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. పుష్ప సినిమాతో సుకుమార్‌కి సూపర్ హిట్ దక్కగా, నాకు అడవి రాముడు సినిమాతో సూపర్ హిట్ దక్కిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇంకా చాలా విషయాల్లో సుకుమార్ తనకు నచ్చుతాడని, తాము ఇద్దరం చాలా విషయాల్లో ఒకే విధంగా ఆలోచించడంతో పాటు, ఇద్దరి మధ్య చాలా విషయాల్లో పోలికలు ఉంటాయని, తాను పరిచయం చేసిన అల్లు అర్జున్, శ్రీలీల ఇక్కడకి రావడం, వారితో నేను ఉండటం చాలా సంతోషంగా ఉందని రాఘవేంద్ర రావు అన్నారు. రాఘవేంద్ర రావు వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సుకుమార్ గురించి రాఘవేంద్ర రావు చేసిన వ్యాఖ్యలు ఆయన సింప్లిసిటీని చూపిస్తున్నాయి. వంద చిత్రాలకు పైగా దర్శకత్వం వహించి, తెలుగు సినిమా చరిత్రలో నిలిచి పోయే సినిమాలు అందించిన రాఘవేంద్ర రావు చాలా సింపుల్‌గా సుకుమార్ తో తనను తాను పోల్చుకోవడం చాలా గొప్ప విషయం. సుకుమార్‌కి దర్శకేంద్రుడు ఇచ్చిన గౌరవంగా దీన్ని భావించాల్సిన అవసరం ఉందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సుకుమార్ మాట్లాడుతూ రాఘవేంద్ర రావు వ్యాఖ్యలకు సంతోషం వ్యక్తం చేశారు. ఇక అమెరికా తెలుగు ప్రేక్షకులకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు. తన 1 నేనొక్కడినే సినిమా యూఎస్‌లో హిట్ కావడం వల్లే టాలీవుడ్‌లో ఆ తర్వాత నిలదొక్కుకోగలిగాను అన్నాడు. యూఎస్‌లో తెలుగు వారు ఈ స్థాయిలో ఉండటం చూస్తుంటే హైదరాబాద్‌లో ఉన్నట్లు అనిపిస్తుందని అల్లు అర్జున్ అన్నాడు. తనపై చూపుతున్న అభిమానంకు బన్నీ యూఎస్ తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశాడు.