రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్.. ఆ పార్టీలోకి ఆ రోజే చేరిక!
అంతేకాదు ఒక్కో అడుగు ముందుకు వేస్తూ.. తన రాజకీయ ప్రస్తానాన్ని మరింత పదిలం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. ఎన్నికల్లో పోటీ చేసిన తొలి ప్రయత్నంలోనే తమిళనాడుకు ఏకంగా ముఖ్యమంత్రిగా అవతరించి అందరి దృష్టిని ఆకర్షించారు ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి. సీఎంగా అధిష్టించిన తరువాత తమిళనాడులో పలు రంగాలలో వివిధ రకాల మార్పులను ఆయన తీసుకొస్తున్నారనే విషయం స్పష్టం అవుతోంది . ఈ మేరకు ఇటీవల కార్పొరేట్ స్కూల్ లపై ఫోకస్ పెట్టిన ఆయన.. ఇకపై బహిరంగంగా స్కూల్ నోటిఫికేషన్ బోర్డులో ఫీజు వివరాలను పొందుపరచాలని ఆదేశాలు జారీ చేశారు.
అంతేకాదు ఒక్కో అడుగు ముందుకు వేస్తూ.. తన రాజకీయ ప్రస్తానాన్ని మరింత పదిలం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరొకవైపు ఈయన రెండు స్థానాలలో ఎమ్మెల్యేగా పోటీ చేయగా.. రెండు స్థానాలలో అత్యధిక మెజారిటీతో గెలిచారు. అయితే ఈ రెండు స్థానాలలో ఒక స్థానానికి రాజీనామా చేసి త్వరలో జరగబోయే ఉప ఎన్నికలలో ఆస్థానం నుండి త్రిషని ఎన్నికలలోకి దించబోతున్నారనే వార్తలు గట్టిగా వినిపించాయి.
కానీ ఇప్పుడు ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని చెప్పాలి. తాజాగా ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్, డాన్సర్ రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ గురించి వస్తున్న వార్తలు అలాగే ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో అంచనాలు పెంచేస్తున్నాయి. ఇక ఆయన చేసిన కామెంట్లను బట్టి చూస్తే విజయ్ రాజకీయ వ్యూహం ఎవరికి అంతు చిక్కకుండా మారిపోయింది.
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ కోలీవుడ్ స్టార్ నటుడిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రాఘవ లారెన్స్.. సీఎం విజయ్ రాజీనామాతో ఖాళీ అయిన తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీవీకే తరఫున పోటీ చేయనున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ రూమర్లపై రాఘవ లారెన్స్ స్పందించారు. రాఘవ లారెన్స్ మాట్లాడుతూ.." ముఖ్యంగా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో నేను రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాను అంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నికల్లో నేను పోటీ చేస్తాననే వార్త గత కొన్ని రోజులుగా మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ చేస్తోంది.
నా మీడియా మిత్రులందరికీ కూడా ఈ విషయంపై అసలు నిజం తెలుసుకోవడానికి నాకు నిరంతరం కాల్స్ చేస్తూనే ఉన్నారు. అలాగే నన్ను వ్యక్తిగతంగా కలవాలని కోరుతున్నారు. ఈ వార్తలన్నీ ఒక దశకు చేరుకోవడంతో నేనే స్వయంగా స్పందించి.. వివరణ ఇవ్వడం మంచిదని భావించి ఇప్పుడు మీ ముందుకు వస్తున్నాను. ప్రస్తుతం నేను బెంజ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాను. ఈ సినిమా షెడ్యూల్ జూన్ 10వ తేదీన ముగుస్తుంది. అనంతరం మా అమ్మ ఆశీస్సులతో నా జీవితంలో తీసుకోబోయే అత్యంత కీలకమైన నిర్ణయాన్ని జూన్ 11న గురువారం ఉదయం 9:30 గంటలకు ప్రకటిస్తాను" అంటూ వెల్లడించారు.
రాఘవ లారెన్స్ ఎక్స్ వేదికగా విడుదల చేసిన ఈ నోట్ చివరిలో #Mattram (మార్పు), #Serviceisgod (సేవే దైవం) అని హ్యాష్ ట్యాగ్ లను ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. నిజానికి లారెన్స్ నటుడు మాత్రమే కాదు సమాజ సేవకు ప్రాధాన్యత నిచ్చే వ్యక్తి. అలాంటి ఆయన ఇప్పుడు ఇలాంటి హ్యాష్ ట్యాగ్ షేర్ చేయడంతో ఆయన పెట్టే ఆ మార్పు ప్రకటన కచ్చితంగా రాజకీయ ప్రవేశానికి సంబంధించింది అయి ఉంటుంది అంటూ అటు రాజకీయ వర్గాలతో పాటు సినిమా వర్గాలలో కూడా చర్చనీయాంశంగా మారింది. మరి జూన్ 11న తల్లి ఆశీస్సులతో ప్రకటించే ఆ బిగ్ అప్డేట్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.