జోరు పెంచిన రాశి ఖన్నా.. మళ్లీ ఆ స్టార్ స్టేటస్ లభిస్తుందా?
టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస సినిమాలతో సందడి చేసిన రాశి ఖన్నా, ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరు పెంచేందుకు సిద్ధమైంది.;
టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస సినిమాలతో సందడి చేసిన రాశి ఖన్నా, ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరు పెంచేందుకు సిద్ధమైంది. పవన్ కల్యాణ్ సరసన నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' ఈ నెల 19న విడుదల కానుండటంతో ఆమె ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఈ సినిమాపై రాశి ఎన్నో ఆశలు పెట్టుకుంది. పవన్‌తో నటించాలన్న తన కల నెరవేరడమే కాకుండా, ఈ సినిమా తన కెరీర్‌ను మళ్లీ స్టార్ స్టేటస్ వైపు తీసుకెళ్తుందని ఆమె నమ్ముతోంది. ఆ వివరాలు చూద్దాం..
కథ వినకుండానే ఓకే చెప్పిన సినిమా:
నటిగా ఏ సినిమాకైనా కథ వినడం రాశి ఖన్నాకు అలవాటు. కానీ 'ఉస్తాద్ భగత్ సింగ్' విషయంలో మాత్రం ఆమె రూల్ మార్చుకుంది. పవన్ కల్యాణ్ సినిమా అనగానే మరో ఆలోచన లేకుండా వెంటనే ఓకే చెప్పేసిందట.సోమవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో తన సినీ ప్రయాణం మొదలైనప్పటి నుండి ఆయన స్టార్‌డమ్ గురించి విన్నానని, ఒక్కసారైనా ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని అనుకున్నట్లు రాశి చెప్పుకొచ్చింది. దర్శకుడు హరీశ్ శంకర్ ముందే చెప్పినట్లుగా, పవన్ షెడ్యూల్స్ కోసం డేట్స్ సర్దుబాటు చేస్తూ కొన్నిసార్లు 24 గంటల షిఫ్టులు కూడా పని చేశానని ఆ మర్చిపోలేని అనుభవాలను గుర్తుచేసుకుంది.
వింటేజ్ పవనిజం.. మాస్ పాటలు:
ఈ సినిమాలో రాశి ఖన్నా 'శ్లోక' అనే మోడ్రన్ అమ్మాయి పాత్రలో కనిపిస్తోంది. ఇది కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదని, మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కథ అని ఆమె వెల్లడించింది.ఇక ముఖ్యంగా పవన్ కల్యాణ్‌ను పాత 'గబ్బర్ సింగ్' తరహాలో వింటేజ్ లుక్‌లో చూస్తారని, అభిమానులకు అది పెద్ద విందు అని హింట్ ఇచ్చింది. ఇందులో పవన్‌తో కలిసి ఒక ఊపు ఊపే మాస్ సాంగ్‌లో కూడా రాశి మెరిసింది. ఈ చిత్రం తనకి టాలీవుడ్‌లో మళ్లీ ఒక బిగ్ బ్రేక్ ఇస్తుందనే నమ్మకంతో రాశి ఉంది.
మహేష్ బాబుపై మనసు పడ్డ రాశి:
ఇక ఇంటర్వ్యూలో భాగంగా మరో ఆసక్తికరమైన విషయాన్ని రాశి వెల్లడించింది. పవన్ కల్యాణ్ తర్వాత కథ వినకుండా సినిమా చేసే ఛాన్స్ ఎవరికి ఇస్తారని అడగ్గా, ఏమాత్రం తడబడకుండా 'మహేష్ బాబు' పేరు చెప్పింది. మహేష్ బాబు సరసన ఒక స్టైలిష్ యాక్షన్ సినిమాలో నటించాలని తనకి చాలా కోరికగా ఉందని తన మనసులో మాట బయటపెట్టింది.ఇక పవన్ కల్యాణ్ తర్వాత ఆ స్పెషల్ ప్లేస్‌ను మహేష్ బాబుకే కేటాయించినట్లు క్లియర్ చేసేసింది. భవిష్యత్తులో ఈ క్రేజీ కాంబినేషన్ కుదిరితే రాశి ఆనందానికి అవధులు ఉండవు.
ప్రస్తుతం రాశి ఖన్నా చేతిలో తమిళం, హిందీ ప్రాజెక్టులతో పాటు ఓటీటీ సిరీస్‌లు కూడా ఉన్నాయి. కానీ తెలుగులో మళ్లీ తన హవా కొనసాగించాలంటే 'ఉస్తాద్ భగత్ సింగ్' హిట్ అవ్వడం ఆమెకు చాలా కీలకం. పవన్ కల్యాణ్ సినిమా అంటే ఉండే క్రేజ్ ఆమెకు ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు. ఇక మరి ఈ సినిమాతో రాశి ఖన్నా మళ్లీ టాలీవుడ్ టాప్ లీగ్‌లోకి చేరుతుందో లేదో తెలియాలంటే ఈ నెల 19 వరకు ఆగాల్సిందే.