ఫేక్ AI ట్రైలర్లు.. కోర్టు మెట్లెక్కిన నటుడు
AI టెక్నాలజీ వేగంగా విస్తరిస్తోన్న ప్రస్తుత కాలంలో సెలబ్రిటీల వ్యక్తిత్వ హక్కులకు సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పాలి.;
AI టెక్నాలజీ వేగంగా విస్తరిస్తోన్న ప్రస్తుత కాలంలో సెలబ్రిటీల వ్యక్తిత్వ హక్కులకు సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పాలి. సోషల్ మీడియాలో అనుమతి లేకుండా నటీనటుల ఫోటోలు, పేర్లు వాడుతూ ఫేక్ వీడియోలు, ట్రైలర్లు తయారు చేయడం పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే ఈ తరహా ఘటనలపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ జూనియర్ ఎన్టీఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోర్టును ఆశ్రయించగా, తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ చేరారు.
తన ముఖం, పేరు ఉపయోగించి డీప్‌ఫేక్ టెక్నాలజీతో తయారు చేసిన నకిలీ సినిమా ట్రైలర్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మాధవన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. లక్షలాది వ్యూస్ సాధిస్తున్న ఆ ఫేక్ కంటెంట్ తన ప్రతిష్ఠకు, వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తుందని ఆయన కోర్టుకు వివరించారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మాధవన్, తన పర్సనాలిటీ రైట్స్ కు రక్షణ కల్పించాలని కోరారు.
ప్రస్తుతం యూట్యూబ్‌లో షైతాన్ ఛాప్టర్ 2, కేసరి 3 వంటి పేర్లతో మాధవన్ నటించినట్లు కనిపించే ఫేక్ ట్రైలర్లు వైరల్ అవుతున్నాయి. అయితే ఇవన్నీ పూర్తిగా నకిలీ వీడియోలేనని, తాను అలాంటి సినిమాల్లో అసులు నటించలేదని మాధవన్ స్పష్టం చేశారు. తన అనుమతి లేకుండా ఫోటో, పేరు వాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు.
మాధవన్ పిటిషన్ ను విచారించిన ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నటుడి వ్యక్తిత్వ హక్కులు కాపాడుతూ ఉత్తర్వులు మంజూరు చేసింది. అంతేకాదు, ఫేక్ ట్రైలర్లు, అనధికారిక కంటెంట్ ను వెంటనే తొలగించాలని సంబంధిత వెబ్ సైట్లు, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లకు ఆదేశాలు ఇచ్చింది. అలాగే మాధవన్ పేరు, ఫోటోతో విక్రయిస్తున్న అనధికారిక మెటీరియల్ ను కూడా నిలిపివేయాలని స్పష్టం చేసింది.
ఇదే తరహాలో ఇటీవల చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ కూడా తమ ఫోటోలు, వీడియోలను వాణిజ్యపరంగా అనుమతి లేకుండా వాడుతున్నారంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వారి కేసుల్లో కూడా ఇటీవల కోర్టు సానుకూలంగా స్పందిస్తూ వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పించింది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా ఆదేశాలు జారీ చేసింది.
AI యుగంలో టెక్నాలజీ ప్రయోజనాలతో పాటు ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయని ఈ ఘటనలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. డీప్‌ఫేక్ వీడియోల వల్ల సెలబ్రిటీలతో పాటు సాధారణ ప్రజలు కూడా మోసపోయే అవకాశం ఉందని నిపుణులు ఇప్పుడు హెచ్చరిస్తున్నారు. అందుకే భవిష్యత్తులో మరిన్ని నటీనటులు, ప్రముఖులు తమ హక్కుల రక్షణ కోసం కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.