కుబేర హ్యాంగోవర్‌లో స్లమ్ డాగ్.. పూరి ఏం దాచాడు?

విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న‌ స్లమ్ డాగ్ టీజర్ రిలీజైన తర్వాత సినీ వర్గాల్లో ఒకే చర్చ నడుస్తోంది.

Update: 2026-06-09 07:25 GMT

డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్ ఎప్పుడూ తన కథల్లో సమాజం పట్టించుకోని వ్యక్తులను సెంట‌ర్ లో పెట్టి కొత్త కోణాలు చూపించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఈసారి ఆయన ఎంచుకున్న నేపథ్యం మాత్రం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న‌ స్లమ్ డాగ్ టీజర్ రిలీజైన తర్వాత సినీ వర్గాల్లో ఒకే చర్చ నడుస్తోంది.

స్ల‌మ్ డాగ్ కూడా ధ‌నుష్ న‌టించిన కుబేర తరహా కథేనా? అన్న ప్రశ్న సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. దానికి కారణం లేక‌పోలేదు. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కుబేరలో ధనుష్ బిచ్చగాడి పాత్రలో కనిపించగా, బిచ్చగాళ్లను బినామీలుగా ఉపయోగిస్తూ జరిగే భారీ ఆర్థిక స్కామ్‌ను శేఖర్ కమ్ముల తెరపై ఆవిష్కరించారు. ఇప్పుడు పూరీ కూడా స్ల‌మ్ డాగ్‌ను బిచ్చగాళ్ల కథ అని స్వయంగా చెప్పడంతో పాటూ, టీజ‌ర్ లో కూడా చూశాక‌ ప్రేక్షకుల మనసులో సహజంగానే కుబేర తో పోలికలు మొదలయ్యాయి.

అయితే ఇక్కడే ఒక కీలకమైన ప్రశ్న తలెత్తుతోంది. కేవలం బిచ్చగాళ్ల నేపథ్యం ఉండడం వల్ల రెండు సినిమాలను ఒకే త‌ర‌హా సినిమాల‌నుకోవ‌చ్చా? పూరీ గత సినిమాల‌ను పరిశీలిస్తే, ఆయన కథల్లో ఎప్పుడూ ఒక అసాధారణ ప్రపంచం, దానికి సంబంధించిన ప్రత్యేక తత్వం కనిపిస్తుంటుంది. ఇడియట్లో రౌడీ ల‌వ‌ర్, పోకిరిలో అండర్‌కవర్ పోలీసాఫీస‌ర్, బిజినెస్‌మ్యాన్‌లో మాఫియా డాన్.. ఇలా ప్రతి కథలో ఒక విభిన్న కోణాన్ని చూపించారు. ఇప్పుడు స్లమ్ డాగ్‌లో బిచ్చగాళ్ల ప్రపంచాన్ని ఎంచుకోవడం కూడా అలాంటి ప్రయోగంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా మాస్ కమర్షియల్ ఫార్ములాపైనే ఎక్కువగా దృష్టి పెట్టిన పూరీ, ఈసారి రఫ్ అండ్ రియలిస్టిక్ బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. సమాజం ప్రతిరోజూ చూసినా పట్టించుకోని వ్య‌క్తుల జీవితాలను కథగా మలచడం ద్వారా పూరీ కొత్త దారిలో నడుస్తున్నార‌నే భావన కలుగుతోంది.

ఇక టీజర్ విషయానికి వస్తే, పూరీ కావాలనే అందులో అసలు కథను దాచిపెట్టినట్టు అనిపిస్తోంది. బిచ్చగాళ్ల నేపథ్యం గురించి క్లారిటీ ఇచ్చినప్పటికీ, అసలు సంఘర్షణ ఏమిటి? విజయ్ సేతుపతి పాత్ర ప్రయాణం ఎటు సాగుతుంది? టబు, సంయుక్త పాత్రలకు కథలో ఎంత ప్రాధాన్యం ఉంది? వంటి అంశాలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇదే ఇప్పుడు సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. కుబేరలో బిచ్చగాళ్ల చుట్టూ తిరిగే ఆర్థిక కుట్ర ప్రధాన అంశంగా ఉంటే, స్లమ్ డాగ్లో అలాంటి సామాజిక లేదా రాజకీయ కోణం ఉందా? లేక పూర్తిగా ఎమోష‌న్స్ తోనే ఈ సినిమాను పూరీ తెర‌కెక్కించారా? అనే సందేహాలు ప్రేక్షకుల్లో కనిపిస్తున్నాయి.

మరోవైపు విజయ్ సేతుపతి లాంటి నటుడిని ఎంపిక చేయడం కూడా సినిమా వెనుక ఏదో బలమైన కథ ఉందనే సంకేతాలను ఇస్తోంది. మొత్తానికి టీజర్ చూసిన తర్వాత స్లమ్ డాగ్‌ను కేవలం మరో బిచ్చగాడి కథగా చూడటం కష్టమే. కుబేరతో పోలికలు సహజంగానే వచ్చినప్పటికీ, పూరీ దాచిన అసలు ట్విస్ట్ ఏమిటన్నదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశంగా మారింది. ట్రైలర్ తో అయినా ఆ ప్రశ్నకు పూరీ స‌మాధాన‌మిస్తారేమో చూడాలి మ‌రి.


Full View


Tags:    

Similar News