ఆ తప్పులు చేయకపోతే మళ్లీ ట్రాక్ ఎక్కేస్తాడు!
దీంతో పూరి స్టార్‌డమ్ మసకబారింది. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్‌లని అందించిన దర్శకుడు ఇప్పుడు దర్శకుడిగా తన ట్రాక్ రికార్డుని కాపాడుకుని మళ్ళీ ట్రాక్‌లోకి రావడానికి ఫైట్ చేయాల్సిన పరిస్థితికొచ్చాడు.;
పూరి జగన్నాథ్.. టాలీవుడ్ ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్స్ అందించిన దర్శకుడు. `పోకిరి` మూవీతో ఇండస్ట్రీ హిట్‌ని సొంతం చేసుకోవడమే కాకుండా తెలుగు సినిమా బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించి అందరిని షాక్‌కు గురి చేశారు. అంత వరకు ఓ స్టార్ హీరో సినిమా రూ.70కోట్ల వరకు కలెక్ట్ చేస్తుందని ఎవరూ గుర్తించలేదు.. ఎవరూ ఊహించలేదు కూడా. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. హీరో క్యారెక్టరైజేషన్, మేనరిజమ్‌కు ఓ స్టైల్‌ని క్రియేట్ చేసిన పూరి ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు.
హీరో అంటే రాముడు మంచి బాలుడు అనే కాన్సెప్ట్ నుంచి తెలుగు సినిమాల్లో హీరో అంటే పోకిరి, దేశ ముదురు, ఇడియట్ అనే యాంగిల్‌ని పరిచయం చేశాడు. వరుస బ్లాక్ బస్టర్ హిట్‌లని అందించి హీరోల కెరీర్‌లో తిరుగులేని ల్యాండ్ మార్క్ హిట్‌లని అందించిన దర్శకుడిగా ప్రత్యేకతను చాటుకున్నారు. హీరో క్యారెక్టరైజేషన్, తన టేకింగ్, నరేషన్ నచ్చి స్టార్ హీరోలు సైతం ఒక్కసారైనా పూరితో సినిమా చేయాలనే స్థాయికి వెళ్లారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. వరుస ఫ్లాపులు పలకరించాయి.
దీంతో పూరి స్టార్‌డమ్ మసకబారింది. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్‌లని అందించిన దర్శకుడు ఇప్పుడు దర్శకుడిగా తన ట్రాక్ రికార్డుని కాపాడుకుని మళ్ళీ ట్రాక్‌లోకి రావడానికి ఫైట్ చేయాల్సిన పరిస్థితికొచ్చాడు. ఇటీవల పూరి చేసిన సినిమాల్లో `ఇస్మార్ట్ శంకర్` తప్ప మరేదీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. విజయ్ దేవరకొండతో చేసిన `లైగర్`, రామ్‌తో చేసిన `డబుల్ ఇస్మార్ట్` బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌లుగా నిలిచి పూరికి షాక్ ఇచ్చాయి. ఒక దశలో ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లకు మేకింగ్, టేకింగ్ విషయంలో రోల్ మోడల్‌గా నిలిచిన పూరి ఇప్పుడు సక్సెస్ కోసం కష్టపడాల్సి వస్తోంది.
రెండేళ్ల విరామం తరువాత పూరి జగన్నాథ్ ఓ క్రేజీ మూవీకి శ్రీకారం చుట్టాడు. తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరో. టబు, సంయుక్త మీనన్, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముందు నుంచి ఈ మూవీకి `స్లమ్ డాగ్` అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఫైనల్‌గా శుక్రవారం అదే టైటిల్‌ని కన్ఫర్మ్ చేస్తూ పూరి టీమ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేసింది. `33 టెంపుల్ రోడ్ అని ఉపశీర్షిక`. ఇందులో విజయ్ సేతుపతి బిచ్చగాడిగా కనిపించబోతున్నాడు. ఫస్ట్ లుక్‌లోనూ అదే చూపించారు. అయితే చేతిలో కర్తమోడుతున్న కత్తితో విజయ్ సేతుపతి కనిపిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది.
అయితే పూరి రోటీన్ ఫార్ములా హీరో క్యారెక్టరైజేషన్...రొటిన్ టేకింగ్.. బోరింగ్ నరేషన్ తో ఈ కథను కూడా నడిపిస్తే హిట్టు కొట్టడం కష్టం. జెన్ జీ టైమ్‌లో తన పాత ఫార్మాట్ ని ఫాలో అవుతూ సినిమా చేస్తే పూరి మళ్లీ ట్రాక్‌లోకి రావడం కష్టం. తన పంథాని పక్కన పెట్టి..మారిన ట్రెండ్‌కు అనుగుణంగా సరికొత్తగా హీరో క్యారెక్టరైజేషన్‌ని, రొటీన్‌కు భిన్నంగా టేకింగ్‌ని, ఎక్కడా బోర్ కొట్టని విధంగా కథ సాగేలా నరేషన్‌ని కొనసాగిస్తే పూరి సక్సెస్‌కు ఎలాంటి బ్రేక్‌లు ఉండవు.. స్పీడు బ్రేకర్లు ఉండవు. ఇంత వరకు చేసిన రొటీన్ మిస్టేక్స్ చేయకపోతే `స్లమ్ డాగ్`తో పూరి సక్సెస్ ట్రాక్ ఎక్కేస్తాడు. లేదూ పాత ఫార్ములానే వాడేస్తానంటే ఇక హిట్టు మాట మర్చిపోవాల్సిందే అనే కామెంట్‌లు సర్వత్రా వినిపిస్తున్నాయి.