పవన్ కళ్యాణ్ బ్యూటీకి గ్లోబల్ రేంజ్.. ఆ దేశ పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్ గా బాధ్యతలు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోయిన్ గా తనకంటూ మరింత పేరు సొంతం చేసుకున్న ప్రియాంక మోహన్ కి తాజాగా గ్లోబల్ స్థాయి గుర్తింపు లభించింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోయిన్ గా తనకంటూ మరింత పేరు సొంతం చేసుకున్న ప్రియాంక మోహన్ కి తాజాగా గ్లోబల్ స్థాయి గుర్తింపు లభించింది. ఆ దేశ పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఆమె బాధ్యతలు స్వీకరించింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకోవడంతో సినీ సెలబ్రిటీలు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
దక్షిణ కొరియా పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రియాంక మోహన్ ఎంపికయ్యారు. కొరియా టూరిజం ఆర్గనైజేషన్ ఈమెను గౌరవ రాయబారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.సోమవారం సియోల్ లో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో ప్రియాంక మోహన్ ఈ బాధ్యతలను స్వీకరించారు. కొరియా పర్యాటక శాఖ ప్రెసిడెంట్ పార్క్ సుంగ్ - హ్యూక్ చేతుల మీదుగా ఆమె ఈ నియామక పత్రాన్ని అందుకున్నారు. ఇక రెండు దేశాల (ఇండియా - కొరియా ) మధ్య పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించడంలో ప్రియాంక నియామకం కీలక పాత్ర పోషిస్తుందని కొరియా టూరిజం ఆర్గనైజేషన్ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ గౌరవ అధికారాన్ని స్వీకరించిన తర్వాత ప్రియాంక దీనిపై స్పందిస్తూ.. "ఈ అరుదైన గౌరవం లభించడం పట్ల కొరియా ప్రభుత్వానికి, కొరియా టూరిజం ఆర్గనైజేషన్ కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కొరియన్ సంస్కృతి, అక్కడి సంప్రదాయాలు నన్ను ఎప్పుడూ కూడా ఆకట్టుకుంటూనే ఉంటాయి. ముఖ్యంగా భారతీయ ప్రేక్షకులకు కొరియన్ సంస్కృతిని మరింత దగ్గర చేయడానికి నా వంతు కృషి నేను చేస్తాను" అంటూ తన అభిప్రాయాన్ని పంచుకుంది. పైగా ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది.
ప్రియాంక కొరియా టూరిజం ఆర్గనైజేషన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా నియమితురాలు అవడంతో అసలు సౌత్ బ్యూటీకి ఆ దేశంలో ఇలాంటి గౌరవమైన అధికారం లభించడమేంటి అంటూ కొంతమంది నెటిజన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగా.. అసలు విషయంలోకి వెళ్తే నెట్ ఫ్లిక్స్ లో విడుదలై ఇండో కొరియన్ వెబ్ ఫిలిం మేడ్ ఇన్ కొరియా చిత్రంలో ప్రియాంక ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో కొరియన్ ఆడియన్స్ కి కూడా ఈమె దగ్గరయింది.. ఇకపోతే ఈ సినిమాతో పాటు ఓజీ , డాన్, డాక్టర్ , నాని గ్యాంగ్ లీడర్ వంటి చిత్రాలతో ఈమెకు ఉన్న భారీ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని కొరియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరి ఈ గౌరవ పదవిలో ప్రియాంక తనను తాను ప్రూవ్ చేసుకొని.. అక్కడి రంగానికి ఆదాయాన్ని ఏ విధంగా తెచ్చిపెడుతుందో చూడాలి.
ఇకపోతే ఈ స్థానంలో గతంలో హాలీవుడ్ కొరియన్ స్టార్ నటుడు పార్క్ బో - గమ్ వంటి ప్రముఖులు కొరియా పర్యాటక రంగానికి ప్రాతినిధ్యం వహించగా.. ఇప్పుడు ఆ స్థానంలోకి ప్రియాంక మోహన్ చేరారు.