ఫ్యాషన్ రాజధానిలో మెరిసిన ప్రియాంక, జెన్నీఫర్ లారెన్స్!
ఫ్యాషన్ ప్రపంచంలో తమదైన ముద్ర వేసిన ప్రియాంక, జెన్నీఫర్ లారెన్స్ పక్కపక్కనే నిలబడి ఫొటోలకు ఫోజులివ్వడం నెటిజన్లను అలరిస్తోంది.
గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా, హాలీవుడ్ అగ్ర నటి జెన్నీఫర్ లారెన్స్ పారిస్ నగరంలో సందడి చేశారు. ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ నిర్వహించిన ప్రతిష్టాత్మక ఫ్యాషన్ ఈవెంట్‌లో ఇద్దరు ఒకే వేదికపై సందడి చేసారు అంతే కాదుఇద్దరు ఎంతో ఆత్మీయంగా ముచ్చటించుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ కలిసిన సన్నివేశాలు, పంచుకున్న సంభాషణలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పారిస్ ఫ్యాషన్ ఈవెంట్‌కు హాజరైన ఇద్దరు భామలు సరికొత్త శైలి, అధునాతన దుస్తులతో అందరి దృష్టినీ ఆకర్షించారు.
ఫ్యాషన్ ప్రపంచంలో తమదైన ముద్ర వేసిన ప్రియాంక, జెన్నీఫర్ లారెన్స్ పక్కపక్కనే నిలబడి ఫొటోలకు ఫోజులివ్వడం నెటిజన్లను అలరిస్తోంది. వారిద్దరి గ్లామర్, కాన్ఫిడెన్స్ ఈవెంట్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని ఫ్యాషన్ ప్రియులు ప్రశంసిస్తున్నారు. ఈవెంట్ సందర్భంగా ఇద్దరు ఒకరినొకరు కలుసుకుని ఎంతో సరదాగా మాట్లాడుకున్నారు. చాలా కాలం తర్వాత కలిసిన స్నేహితుల్లా వారు నవ్వుతూ ముచ్చటించుకోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. గ్లోబల్ లెవెల్లో గుర్తింపు పొందిన ఇద్దరు నటీమణులు ఇలా ఎలాంటి అహంకారం లేకుండా ఎంతో ఆప్యాయంగా పలకరించుకోవడం అభిమానుల హృదయాలను గెలుచుకుంటుంది.
రెడ్ కార్పెట్ వద్ద జెన్నీఫర్ లారెన్స్‌తో ప్రియాంక చోప్రా జరిపిన చిన్న సంభాషణకు సంబంధించిన క్లిప్స్ ఎక్స్ ,ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు `ఈస్ట్ అండ్ వెస్ట్ పర్ఫెక్ట్ కాంబినేషన్` అంటూ కామెంట్లు పెడుతున్నారు. హాలీవుడ్, బాలీవుడ్ చిత్రసీమల అనుబంధానికి ఈ కలయిక ఒక వేడుకలా ఉందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ప్రియాంక చోప్రా అంతర్జాతీయ ఈవెంట్లలో నిరంతరం మెరుస్తూ గ్లోబల్ వేదికలపై భారతదేశ ప్రాతినిధ్యాన్ని ఘనంగా చాటుతున్నారు.
ఆస్కార్ విజేత అయిన జెన్నీఫర్ లారెన్స్ కూడా సహజసిద్ధమైన నటన, శైలితో ఆకట్టుకుంటున్నారు. అలాంటి ఇద్దరు అగ్ర తారలు ఒకే వేదికను పంచుకోవడం ఫ్యాషన్ ప్రపంచంలోనే కాక చలనచిత్ర రంగానికి కూడా ప్రత్యేక మైలురాయిగా మారింది. వీడియో వైరల్ అవ్వడంతో ఇద్దరు కలిసి భవిష్యత్తులో హాలీవుడ్ ప్రాజెక్ట్‌లో నటిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని పలువురు అభిమానులు వ్యక్తపరుస్తున్నారు. పారిస్ వేదికగా జరిగిన ఈ అపూర్వ కలయిక అభిమానులకు గొప్ప విజువల్ ట్రీట్‌గా నిలుస్తోంది.
ప్రస్తుతం ప్రియాంక చోప్రా టాలీవుడ్ లో `వారణాసి` చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో అమ్మడు సూపర్ స్టార్ మహేష్ కు జోడీగా కనిపించనుంది. గ్లోబల్ వైడ్ రిలీజ్ అవుతున్న సినిమాకు ఇలాంటి అంతర్జాతీయ వేదికలు మరింతగా కలిసొచ్చే అవకాశం ఉంది. 120 దేశాల్లో రిలీజ్ అవుతున్న చిత్రం మార్కెట్ లో పీసీ ఎంట్రీ అత్యంత కీలకమైనదిగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.