సినిమాలను ఇబ్బంది పెట్టకండి: ఆర్.నారాయణమూర్తి పవర్ఫుల్ స్పీచ్!
జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో కోన ఫిల్మ్ కార్పొరేషన్, స్కంద వాహన మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ పీరియడ్ మూవీ టీజర్ లాంచ్ వేడుకకు పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.
శ్రీ విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కామ్రేడ్ కళ్యాణ్ టీజర్ మార్కెట్‌లో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో కోన ఫిల్మ్ కార్పొరేషన్, స్కంద వాహన మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ పీరియడ్ మూవీ టీజర్ లాంచ్ వేడుకకు పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఎర్ర కండువాలు, ఎర్ర గులాబీలతో చిత్ర యూనిట్ ఆయనకు గ్రాండ్‌గా స్వాగతం పలికిన తీరుపై ఆయన ఆసక్తికరంగా స్పందించారు.
ఒక దేశం విప్లవకారులు మరో దేశం సోదరులను కలిసినప్పుడు ఎర్ర కండువాలు, ఎర్ర గులాబీలతో స్వాగతిస్తారని, ఇవాళ ఆ గౌరవాన్ని తనకిచ్చిన చిత్ర బృందానికి మనస్ఫూర్తిగా సెల్యూట్ చేస్తున్నానని నారాయణమూర్తి అన్నారు. కామ్రేడ్ అనే పదం ఆషామాషీ కాదని, ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసిన యోధుల భావజాలం అని చెప్పారు. రీసెంట్‌గా ప్రసాద్ ల్యాబ్‌లో ఉన్నప్పుడు సెన్సార్ వాళ్లు కామ్రేడ్ అనే పదాన్ని వద్దంటున్నారని తెలిసి తాను తీవ్రంగా షాక్ అయ్యానని, ఎంతో హర్ట్ అయ్యానని వెల్లడించారు.
బూతులు ఉన్న కొన్ని సినిమాలను వదిలేస్తున్నారు సెన్సర్ బోర్డు వాళ్ళు.. ఎం లేకపోయినా చాలా ఇబ్బంది పెడుతున్నారు. సినిమాతల్లిని కాపాడండి సెన్సర్ పెద్దలరా, ఇబ్బంది పెట్టకండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కామ్రేడ్ అంటే ఒక అమ్మ, ఒక నాన్న లాంటి ప్రజల మనిషి అని, సమాజంలో దోపిడీ, పీడన ఉన్నంతకాలం ఎవరూ విప్లవోద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. హీరో శ్రీ విష్ణు వర్కింగ్ స్టైల్‌ను ప్రశంసిస్తూ మాస్ మహారాజా రవితేజతో పోల్చారు. ఇందాక డైరెక్టర్ బాబీ చెప్పినట్లు రవితేజ లాగే శ్రీ విష్ణు కూడా వచ్చే ప్రతి ఒక్క కొత్త దర్శకుడు, నిర్మాతకు తలుపులు తెరుస్తూ ఎంట్రీ ఇస్తున్నారని అభినందించారు.
కథ, టీమ్ నచ్చితే చాలు సినిమాను లైన్‌లో పెట్టే శ్రీ విష్ణు మంచి మనస్తత్వాన్ని అభినందించిన నారాయణమూర్తి, నేటి తరం హీరోలందరూ విష్ణును చూసి నేర్చుకోవాలని కోరారు. పాత రోజుల్లో హీరోల పనితీరును గుర్తు చేస్తూ సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణలా ఏడాదికి ఏడెనిమిది సినిమాలు చేయాలని హీరోలకు సూచించారు.
అప్పట్లో హీరోలు వరుస పెట్టి సినిమాలు చేయడం వల్ల ఇండస్ట్రీ ఎప్పుడూ నిత్యకల్యాణం పచ్చతోరణంలా కళకళలాడుతూ వేలాది మందికి ఉపాధి కల్పించేదని చెప్పారు. కానీ ఇవాళ చాలామంది హీరోలు ఏడాదికి ఒకటి లేదా రెండేళ్లకొకటి చేస్తూ కూర్చుంటున్నారని, అలా కాకుండా ఎక్కువ సినిమాలు చేసి పరిశ్రమను, నిర్మాతలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
కోన వెంకట్ తన కోసం సినిమా నిర్మిస్తానని స్టేజ్‌పై చెప్పిన మాటపై నారాయణమూర్తి ధన్యవాదాలు తెలిపారు. తనపై అంతటి నమ్మకంతో ఒక మంచి ఆఫర్ ఇచ్చినందుకు కోన వెంకట్‌కు చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఈ చిత్ర రైటర్ ఒకప్పుడు ఇండస్ట్రీకి కొత్తగా వచ్చినప్పుడు తనను సలహా అడిగితే ఇదొక మహాసముద్రం అని, ఈది ఒడ్డుకు చేరితే వీరుడివని చెప్పానని, ఇవాళ ఆ కుర్రాడు ఇండస్ట్రీలో తనకంటూ ఒక జెండా పాతడం చూసి గర్వపడుతున్నానని గుర్తు చేసుకున్నారు.
చివరగా చిత్ర యూనిట్‌లోని సభ్యులందరికీ, నిర్మాత వెంకట కృష్ణ కర్నాటికి పేరుపేరునా ఆల్ ది బెస్ట్ చెప్పారు. కామ్రేడ్ కళ్యాణ్ టీజర్ చూస్తుంటే మంచి కంటెంట్‌తో పక్కా ఎంటర్‌టైనర్‌గా వస్తున్నట్లు అర్థమవుతుందని, థియేటర్లలోకి రాబోయే ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని అన్నారు.