అడిగినోడు నక్సలైట్.. అడగనోడు ఆల్రైట్.. దట్ ఈజ్ కామ్రేడ్!

ఒక దేశపు విప్లవకారులు మరొక దేశ పోరాటయోధులను కలిసినప్పుడు ఇచ్చే ఈ గౌరవం..ప్రజల కోసం ప్రాణాలు పణంగా పెట్టే అమరవీరుల త్యాగానికి ప్రతీక అని పేర్కొన్నారు. సమాజంలో రాపిడి, దోపిడీ, పీడన ఉన్నంతకాలం ప్రజా ఉద్యమాలు ఆగిపోవని ఆయన సభాముఖంగా స్పష్టం చేశారు.

Update: 2026-09-06 03:13 GMT

శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న `కామ్రేడ్ కళ్యాణ్` మూవీ టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన విప్లవ చిత్రాల నటుడు, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి తనదైన ఆవేశపూరిత, సరదా ప్రసంగంతో వేదికను హోరెత్తించారు. సభలో అందరికీ ఎర్ర కండువాలు కప్పి.. ఎర్ర గులాబీలతో స్వాగతం పలకడాన్ని ఆయన ఎంతో భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు. ఒక దేశపు విప్లవకారులు మరొక దేశ పోరాటయోధులను కలిసినప్పుడు ఇచ్చే ఈ గౌరవం..ప్రజల కోసం ప్రాణాలు పణంగా పెట్టే అమరవీరుల త్యాగానికి ప్రతీక అని పేర్కొన్నారు. సమాజంలో రాపిడి, దోపిడీ, పీడన ఉన్నంతకాలం ప్రజా ఉద్యమాలు ఆగిపోవని ఆయన సభాముఖంగా స్పష్టం చేశారు.

ఈ వేదికపై నక్సలైట్ అనే పదానికి ఆర్. నారాయణమూర్తి ఇచ్చిన వినూత్న నిర్వచనం సభలో నవ్వులు పూయించింది. చిత్ర రచయితలు తమదైన శైలిలో రాసిన సంభాషణలను ప్రస్తావిస్తూ.. `అడిగినోడు నక్సలైట్.. అడగనోడు ఆల్రైట్.. దట్ ఈజ్ కామ్రేడ్!`` అని ఆయన చెప్పిన పంచ్ డైలాగ్ విప‌రీతంగా ఆకట్టుకుంది. ప్రయోగాత్మక డైలాగ్స్ విన్నప్పుడు మొదట ``ఏంటి ఇలా ఉన్నాయి డైలాగులు?`` అనిపించినా.. విప్లవ భావజాలాన్ని చాలా సహజంగా.. నేటి తరానికి అర్థమయ్యే రీతిలో చెప్పారని కొనియాడారు. ప్రతి మనిషి సమాజంలో అన్యాయాన్ని ప్రశ్నించే క్రమంలో నక్సలైట్‌గా మారడానికి వెనుక ఒక పెద్ద కథ ఉంటుందని.. ఈ చిత్రంలో కూడా అదే ప్రధానాంశంగా ఉండబోతోందని అన్నారు.

ఇదే క్రమంలో హీరో శ్రీవిష్ణు కంటెంట్ ఎంపికను.. వైవిధ్యాన్ని ఆర్. నారాయణమూర్తి ప్రత్యేకంగా ప్రశంసించారు. సీనియర్ హీరో రవితేజ తరహాలోనే శ్రీవిష్ణు కూడా కొత్త కథలతో వస్తూ నూతన దర్శకులకు, నిర్మాతలకు అవకాశాల ద్వారాలు తెరుస్తున్నారని చెప్పారు. పూర్వం సూపర్ స్టార్ కృష్ణ గారు ఏటా 7-8 సినిమాలు చేస్తూ చిత్ర పరిశ్రమను కలకలలాడేలా చేసేవారని గుర్తుచేసుకున్నారు. నేటి హీరోలు కూడా ఎక్కువ సినిమాలు చేస్తూ సినీ పరిశ్రమను, నిర్మాతల శ్రేయస్సును కాపాడాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.

సినిమా శీర్షికలోని `కామ్రేడ్` అనే పదంపై సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై ఆర్. నారాయణమూర్తి తీవ్ర అసహనం, ఆవేదన వ్యక్తం చేశారు. `కామ్రేడ్` అంటే ఒకే భావజాలం, ఒకే లక్ష్యంతో ప్రజల కోసం జీవితాలను త్యాగం చేసే ప్రజల మనిషి అని.. అమ్మ, నాన్న కూడా ఒక కామ్రేడేనని విశ్లేషించారు. ఎన్టీఆర్ గారి `యమగోల‌` సహా అనేక తెలుగు సినిమాల్లో ఈ పదాన్ని ఉపయోగించారని గుర్తుచేశారు. ఓటీటీలు, సోషల్ మీడియాలో వచ్చే అసభ్యకర కంటెంట్‌ను అడ్డుకోలేని సెన్సార్ బోర్డు, సమాజానికి మంచి చెప్పే సినిమాలను.. నిర్మాతల శ్రమను.. భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవద్దని దండం పెట్టి వేడుకున్నారు.

చివరగా `కామ్రేడ్ కళ్యాణ్` సినిమా- పాటల విశేషాలను షేర్ చేస్తూ.. ఇది కేవలం ఒక విప్లవాత్మక చిత్రం మాత్రమే కాకుండా.. అంతర్లీనంగా ఒక గొప్ప ప్రేమకథ అని తెలిపారు. ``ప్రేమించు.. ప్రేమింపబడు.. జీవించు.. జీవించనివ్వు`` అనే మహోన్నత భావన ఈ చిత్రంలో కనిపిస్తోందని.. పాటలు అత్యంత అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. ఈ చిత్ర దర్శకుడు జానకి శ్రీరామ్ తన స్వస్థలమైన కత్తిపూడి పరిసర ప్రాంతాలకు చెందినవాడు కావడంతో తనకి మరింత ఆనందంగా ఉందన్నారు. గొప్ప కథ, సంగీతంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ సాధించి.. చిత్ర బృందానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.



Tags:    

Similar News