విడాకుల కల్చర్‌లో భర్తకు హిందూ ఆచారాలు నేర్పిస్తున్న నటి!
ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి చిత్రంలో నటిస్తూ నిరంతరం తెలుగు మీడియా హెడ్ లైన్స్ లోకి వస్తోంది ప్రియాంక చోప్రా.;
ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి చిత్రంలో నటిస్తూ నిరంతరం తెలుగు మీడియా హెడ్ లైన్స్ లోకి వస్తోంది ప్రియాంక చోప్రా. గ్లోబల్ ఐకన్ గా పాపులరై, హాలీవుడ్ ని ఏలిన పీసీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు అత్యంత ప్రియమైన హీరోయిన్. ఇటీవల తెలుగు ప్రజలు కూడా ప్రియాంక చోప్రా గొప్పతనం గురించి గూగుల్ సెర్చ్ లో తరచి తరచి వెతికి చూస్తున్నారు.
అలా వెతికే వారికి తెలిసీ తెలియనట్టు ఉండే ఒక ముఖ్యమైన సమాచారమిది. ప్రియాంక చోప్రా తన వ్యక్తిగత జీవితం ద్వారా భారతీయ సంస్కృతిని, ముఖ్యంగా హిందూ సంప్రదాయాలను ప్రపంచ వేదికపై గౌరవప్రదంగా నిలబెడుతున్నారు. వెస్ట్రన్ కల్చర్‌లో ఉంటూ కూడా తన మూలాలను మర్చిపోకుండా తన భర్త నిక్ జోనాస్,
కూతురు మాల్తీ మేరీలకు మన ఆచారాలను నేర్పిస్తున్న తీరు అద్భుతం.
ప్రియాంక భారతదేశం నుంచి అమెరికాకు సాంస్కృతిక రాయబారం నెరుపుతున్నారంటే అతిశయోక్తి కాదు. అమెరికన్ పాప్ స్టార్ అయిన నిక్ జోనాస్.. ఇప్పుడు పక్కా భారతీయ అల్లుడిలా మారిపోయారు అంటే అది పీసీ పుణ్యమే. నిక్ తమ లాస్ ఏంజెల్స్ నివాసంలో ప్రియాంకతో కలిసి వినాయక చవితి, దీపావళి పూజల్లో పాల్గొనడమే కాకుండా, స్వయంగా మంత్రోచ్చారణలు చేయడం చూస్తున్నాం. ఆయనకు భారతీయ ఆచారాలపై గౌరవం పెరిగేట్టు చేయడం అంటే మొత్తం అమెరికాలో మన కల్చర్ సౌండ్ ని బలంగా వినిపించడమే. ముఖ్యంగా విడాకుల కల్లోలం ఎక్కువగా ఉండే అమెరికాలో మన సంప్రదాయాలను తక్కువ చేసి చూడకుండా, ఒక విద్యార్థిలా నేర్చుకుంటూ ప్రియాంకకు తోడుగా నిలుస్తున్నాడు నిక్. అందుకే నెటిజన్లు ఆయన్ని ప్రేమగా నేషనల్ జీజు అల్లుడు అని పిలుస్తున్నారు.
విడాకుల కల్చర్‌లో `ఆదర్శ కోడలు`:
జోనాస్ కుటుంబంలో నిక్ సోదరుడు జో జోనాస్ తన భార్య సోఫీ టర్నర్ నుంచి విడాకులు తీసుకున్న నేపథ్యంలో, ప్రియాంక - నిక్ (ప్రియానిక్) బంధం మరింత పటిష్టంగా కనిపిస్తోంది. పాశ్చాత్య దేశాల్లో పెళ్లిళ్ల కంటే విడాకులు ఎక్కువగా జరుగుతున్న తరుణంలో భారతీయ కుటుంబ వ్యవస్థలోని `కలిసి ఉండటం` అనే సూత్రాన్ని ప్రియాంక అక్కడ నిరూపిస్తున్నారు. అంతేకాదు జోనాస్ బ్రదర్స్ కుటుంబం ఒకే చోట ఉండేలా పీసీ జాగ్రత్తలు తీసుకోవడాన్ని ఆ కుటుంబం ఎంతగానో హర్షిస్తోంది. జోనాస్ బ్రదర్స్ తలిదండ్రులకు ప్రియాంక ఒక ఆదర్శ కోడలిగా, కుటుంబ పెద్దగా అండగా నిలుస్తున్నారు.
కూతురి కోసం `మహామృత్యుంజయ మంత్రం` జపించిన నిక్
మాల్తీ మేరీ పుట్టినప్పుడు ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యల గురించి ప్రియాంక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భావోద్వేగంగా మాట్లాడారు. నిక్ జోనాస్ కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎంతో ఆవేదన చెందుతూ మాట్లాడారు. మాల్తీ మేరీ నెలలు నిండకుండా పుట్టడం వల్ల 100 రోజులకు పైగా ఆసుపత్రిలో (NICU) ఉంది. ఆ సమయంలో పాప ప్రాణాలు కాపాడమని ప్రియాంక నిరంతరం `మహామృత్యుంజయ మంత్రం` ప్లే చేసేవారట. అది నిక్ జోనాస్ కి కంఠతా వచ్చేసింది. శాస్త్ర సాంకేతికతతో పాటు, తనలోని ఆధ్యాత్మిక విశ్వాసమే తన బిడ్డను కాపాడిందని ఇప్పుడు ప్రియానిక్ నమ్ముతున్నారు. మాల్తీకి కూడా చిన్నప్పటి నుండే భారతీయ భక్తిపాటలు, శ్లోకాలు నేర్పిస్తున్నారు.
గ్లోబల్ ఐకాన్ - లోకల్ హార్ట్..
ప్రియాంక చోప్రా కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, భారతీయ నమస్కారం నుండి మన పండుగల వరకు ప్రతి ఒక్కటి అంతర్జాతీయ మీడియా ముందు గర్వంగా ప్రదర్శిస్తారు. ఇది రాబోయే తరాలకు, ముఖ్యంగా ఎన్ఆర్ఐ కుటుంబాలకు ఒక గొప్ప స్ఫూర్తి.
రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న `వారణాసి` సినిమాలో కూడా పీసీ ఒక పవర్‌ఫుల్ ఇండియన్ పాత్ర (మందాకిని)లో నటిస్తున్నారు. ఆ సినిమాలో పీసీ పాత్రతో మన సంస్కృతిని మరింత లోతుగా చూపించేందుకు జక్కన్న ప్రయత్నిస్తున్నారని సమాచారం.
అభినందనలు..
ఒక అమెరికన్ ని పెళ్లాడి భారతీయ సాంప్రదాయాలు ఆధ్యాత్మిక విషయాలను నేర్పిస్తున్న ప్రియాంక చోప్రాకు భారతదేశం రుణపడి ఉంటుంది.. భారతీయతను ప్రపంచానికి చాటి చెప్పడానికి గ్లోబల్ ఐకన్ ప్రియాంక చోప్రా చేస్తున్న ప్రతి ప్రయత్నం అభినందనీయం.