హాలీవుడ్ ఆఫ‌ర్ల కోసం తీర‌ని అవ‌మానాలు?

ప్రియాంక చోప్రా హాలీవుడ్ ఆఫ‌ర్ల కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డారు.. కానీ ఆ స‌మ‌యంలో అవ‌మానాల్ని ఎదుర్కొన్నారని వ్య‌క్తిగ‌త మేనేజ‌ర్ అంజుల అన్నారు. కానీ పీసీ భార‌త‌దేశ‌పు బియాన్స్ అని అంజుల ప్ర‌శంసించారు.;

Update: 2026-01-20 03:15 GMT

ప్రియాంక చోప్రా నేడు గ్లోబ‌ల్ స్టార్ కావొచ్చు.. కానీ ఒక‌ప్పుడు అంద‌రిలాగే ఒక ఆరంభ న‌టి. త‌న‌కు కూడా ఆరంభ క‌ష్టాలు ఉన్నాయి. ఇండ‌స్ట్రీ త‌న‌ను చాలా చిన్న చూపు చూసింది. త‌న అందాల‌కు మెరుగుల‌ద్దుకోవాల‌ని కూడా కొంద‌రు సూచించారు. మిస్ వ‌ర‌ల్డ్ గా కిరీటం గెలుచుకున్న త‌ర్వాత కూడా సినీప‌రిశ్ర‌మ‌లో త‌నను గేలి చేసిన వారున్నారు. అయితే అన్నిటినీ ఎదుర్కొని నెమ్మ‌దిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్ప‌టి ఈ స్థాయికి ఎదిగారు.

ఇంకా చెప్పాలంటే గ్లోబ‌ల్ ఐక‌న్ ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో ఈరోజు అనుభవిస్తున్న గ్లోబల్ స్టార్‌డమ్ వెనుక చాలా క‌ష్ట‌న‌ష్టాలు, అవ‌మానాలు ఉన్నాయి. అయితే పీసీ ప్ర‌ద‌ర్శించిన‌ సహనం ఎంతో గొప్ప‌ది. ఈ వివ‌రాలను పీసీ మేనేజర్ అంజుల ఆచార్య `ది ఓకే స్వీటీ షో` అనే ఇంటర్వ్యూలో వెల్ల‌డించారు.

ప్రియాంక చోప్రా హాలీవుడ్ ఆఫ‌ర్ల కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డారు.. కానీ ఆ స‌మ‌యంలో అవ‌మానాల్ని ఎదుర్కొన్నారని వ్య‌క్తిగ‌త మేనేజ‌ర్ అంజుల అన్నారు. కానీ పీసీ భార‌త‌దేశ‌పు బియాన్స్ అని అంజుల ప్ర‌శంసించారు. ప్రియాంక తొలినాళ్ల పోరాటాన్ని వివరిస్తూ అంజుల ఇలా అన్నారు. `భారతదేశంలో ప్రియాంక ఒక బియాన్స్‌ లాంటి సూపర్ స్టార్. కానీ అమెరికాలో అడుగుపెట్టినప్పుడు త‌ను ఎవరో ఎవరికీ తెలియదు. ఆమె అప్పటికే కవర్ పేజీలపై ద‌ర్శ‌న‌మిచ్చిన పెద్ద స్టార్. కానీ మ్యాగజైన్ ఆఫీసులకు వెళ్లి.. మళ్లీ కొత్తగా ``నేను ప్రియాంక చోప్రా.. మీరు నన్ను గుర్తించకపోవచ్చు అని పరిచయం చేసుకోవడం చూసి నా మనసు విలవిలలాడేది` అని తెలిపారు.

భార‌త‌దేశంలో అంత పెద్ద స్టార్ అయినా కానీ, హాలీవుడ్‌లో అవకాశాల కోసం ఆ కేఫెటేరియాల్లో కూర్చుని జూనియర్ అసిస్టెంట్ల తాలూకా అసిస్టెంట్లను కలిసేవారని, ఆ సమయంలో ప్రియాంక తన అహాన్ని పక్కన పెట్టి జీరో స్థాయి నుండి ప్రయాణాన్ని మొదలుపెట్టారని అంజుల గుర్తుచేసుకున్నారు. ప్రియాంకను హాలీవుడ్‌కు తీసుకెళ్లాలని అంజుల నిర్ణయించుకున్నప్పుడు, స్నేహితులు పరిశ్రమ వ్య‌క్తులు విమర్శించారు.

ఒక బ్రౌన్ కలర్ బాలీవుడ్ నటిని అమెరికాలో స్టార్‌ను చేయడం అసాధ్యం.. నువ్వు వెర్రిదానివి! అని చాలామంది ఎగతాళి చేశారు. ఆ సమయంలో ఇంటర్‌స్కోప్ రికార్డ్స్ కో ఫౌండర్ జిమ్మీ ఐయోవిన్.. నేను ఎమినెమ్‌ను లాంచ్ చేస్తానన్నప్పుడు కూడా అందరూ నన్ను వెర్రిదానిని అని అన్నారు! అని చెప్పి అంజులకు ధైర్యం ఇచ్చారు.

అంజుల కొన్ని సందర్భాల్లో `మనం ఈ మీటింగ్ కి వెళ్లాల్సిన అవసరం లేదు.. మనం దీని కంటే పై స్థాయిలో ఉన్నాం` అని అన్నప్పుడు, ప్రియాంక మాత్రం ``లేదు మనం వెళ్లాలి.. మనం దేనికీ పై స్థాయిలో లేము`` అని పూర్తిగా ఒదిగి ఉండేవార‌ట‌. కష్టపడి పని చేయడంలో ప్రియాంక చోప్రా చూపిన నిబద్ధతే ఆమెను నేడు గ్లోబల్ ఐకాన్ గా నిలబెట్టిందని అంజుల కొనియాడారు.

ప్రియాంక ఇటీవల జరిగిన 83వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల వేడుకలో ప్రెజెంటర్‌గా వ్యవహరించి హాలీవుడ్ టాప్ స్టార్ల సరసన నిలిచారు. ఇప్ప‌టికే పీసీ న‌టించిన సిటాడెల్ రెండో సీజన్ స్ట్రీమింగులో ఉంది.

ఎస్.ఎస్. రాజమౌళి - మహేష్ బాబు సినిమా `వారణాసి`లో ప్రియాంక ఒక కీలక పాత్ర పోషిస్తున్న విష‌యం తెలిసిన‌దే. ఈ సినిమా 2027 సంక్రాంతికి విడుదల కానుంది. హాలీవుడ్‌లో ప్రియాంక తదుపరి `ది బ్ల‌ఫ్` అనే చిత్రంలో న‌టిస్తోంది. ఇది ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల‌వుతుంది.

Tags:    

Similar News