మన `సీతయ్య`కు బ్రాండ్ అంబాసిడర్ ప్రియాంక చోప్రా!
కొందరు నటులు.. కొన్ని పాత్రలలో అరుదైన అభినివేశం, నట ప్రదర్శనతో అలరించి హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోతారు.
కొందరు నటులు.. కొన్ని పాత్రలలో అరుదైన అభినివేశం, నట ప్రదర్శనతో అలరించి హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోతారు. ఇహలోకంలో లేకపోయినా వైవిధ్యమైన పాత్రలు, నటనతో ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో సజీవంగానే ఉంటారు. ఈ మాట టాలీవుడ్ సీనియర్ నటుడు, దివంగత నందమూరి హరికృష్ణ విషయంలో అక్షరాలా నిజమని మరోసారి రుజువైంది. తాజాగా గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఒక వీడియో నెట్టింట తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. హరికృష్ణ నటించిన మాస్ క్లాసిక్ `సీతయ్య` సినిమాలోని ఒక షార్ట్ వీడియో క్లిప్‌ను పీసీ షేర్ చేస్తూ.. ''జీవితం చాలా చిన్నది, అనవసర వాదనలకు దిగకుండా ఇలా చేసి ముందుకు సాగండి'' అని అర్థమొచ్చేలా ఇచ్చిన క్యాప్షన్ అందరినీ ఆకట్టుకుంటోంది. దీంతో నందమూరి అభిమానులు ప్రియాంక షేర్ చేసిన పోస్ట్‌ను రీ-షేర్ చేస్తూ హరికృష్ణకు దక్కిన గ్లోబల్ గౌరవంగా పండుగ చేసుకుంటున్నారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. హరికృష్ణ `సీతయ్య` సినిమాలో ప్రదర్శించిన పవర్‌ఫుల్ అటిట్యూడ్‌కు ప్రియాంక చోప్రా ఏకంగా బ్రాండ్ అంబాసిడర్‌లా మారిపోయారంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఫాలోవర్లు ఉన్న ఒక గ్లోబల్ స్టార్.. తెలుగు సినిమాలోని ఒక సీనియర్ నటుడి డైలాగ్ లేదా సీన్‌ను తన జీవిత తత్వానికి ముడిపెట్టి పోస్ట్ చేయడం నిజంగా విశేషం. ఈ రకంగా మన `సీతయ్య` చిత్రానికి ... హరికృష్ణ నటనకు అంతర్జాతీయ స్థాయిలో ఒక అరుదైన గౌరవం దక్కిందని టాలీవుడ్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
మరోవైపు ప్రియాంక చోప్రా ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `వారణాసి`లో కథానాయికగా నటిస్తున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్` వంటి ప్రపంచ స్థాయి విజయం తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న ఈ విజువల్ వండర్‌లో ప్రియాంక `మందాకిని` అనే శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి విడుదల చేసిన రెండు విభిన్నమైన ఫస్ట్ లుక్ పోస్టర్లు సోషల్ మీడియాను ఊపేసాయి. ఆమె చిరునవ్వులో ప్రశాంతత ఉంటుంది.. అదే నవ్వు లేకపోతే అగ్నిపర్వతంలా మండుతుంది! అంటూ రాజమౌళి ఇచ్చిన క్యాప్షన్ ప్రియాంక పాత్రపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు రుద్ర.. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే విలన్ పాత్రలో నటిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం దాదాపు 1,000 కోట్ల నుంచి 1,300 కోట్ల రేంజు భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలవనున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. రామాయణంలోని ఒక అధ్యాయం ఆధారంగా వేల సంవత్సరాల కాలక్రమం నేపథ్యంలో సాగే ఈ కథ కోసం అంటార్కిటికా, ఆఫ్రికా లాంటి విదేశీ లొకేషన్లతో పాటు హైదరాబాద్‌లో వారణాసి ఘాట్‌ల భారీ సెట్లను నిర్మించారు. 2019 తర్వాత ప్రియాంక మళ్లీ భారతీయ వెండితెరపై కనిపించబోతున్న సినిమా ఇదే కావడం విశేషం.
అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న `వారణాసి` చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ ఫార్మాట్‌లో 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఒకవైపు రాజమౌళి సినిమాతో గ్లోబల్ ప్రాజెక్ట్‌లో భాగమవుతూనే.. అటు హాలీవుడ్ లోను పీసీ నటిసతోంది. మరోవైపు సోషల్ మీడియాలో `సీతయ్య` క్లిప్‌ను షేర్ చేస్తూ తెలుగు సినిమాపై ఉన్న అభిమానాన్ని చాటుకున్న ప్రియాంక చోప్రా ఇక్కడా అక్కడా చర్చల్లోకొచ్చారు. నందమూరి హరికృష్ణ నటనకు గ్లోబల్ ఐకాన్ ఇచ్చిన ఈ రెస్పెక్ట్ చూసి.. మన సీతయ్య క్యారెక్టర్‌కు ప్రియాంక నిజమైన ప్రమోటర్‌లా నిలిచారని సినీ ప్రియులు కొనియాడుతున్నారు.