ఈ వారం హిట్టు కొట్టే ఎమోషన్ ఏది?
దాదాపు అందరూ అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఆకట్టుకునే ఎమోషన్ తో వస్తున్నారు. మరి ఎవరు బాక్సాఫీస్ విన్నర్ గా నిలుస్తారో చూడాలి.
ఈ వారం థియేటర్ల దగ్గర పెద్ద స్టార్ వార్ లేదు. కానీ రిలీజ్ సినిమాల ట్రైలర్లు చూస్తే ఒక్కోటి ఒక్కో ఎమోషన్ మీదే బతకాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సర్దార్ 2కు సీక్వెల్ అడ్వాంటేజ్ ఉంది. మండాదికి ఊరు, పోటీ అనే రూటెడ్ ఫీల్ ఉంది. మారెమ్మ ఒక దున్నపోతుతో మనిషి ఎమోషన్. ఎపిక్ ప్రేమ, బ్రేకప్, పెరుగుతున్న వయసు చుట్టూ తిరుగుతోంది. మహేంద్రగిరి వారాహి భక్తి, భయం కలిపి వస్తోంది. అందుకే ఈ వారం హిట్టు కొట్టేది హీరో కంటే ఎమోషన్ అనిపిస్తోంది.
సర్దార్ మొదటి భాగం.. తండ్రిని తప్పుగా అర్థం చేసుకున్న కొడుకు, చివరకు ఆయన చేసిన త్యాగం తెలుసుకోవడం ఆ కథకు మంచి ఎమోషన్ ఇచ్చింది. ఇప్పుడు రెండో భాగం అదే ప్రపంచాన్ని పెద్ద స్కేల్‌లోకి తీసుకెళ్లింది. కార్తి డ్యూయల్ రోల్, ఎస్ జే సూర్య విలన్, స్పై సెటప్ అన్నీ ఉన్నాయి. అయితే మొదటి భాగంలో ఉన్న కుటుంబ బంధం స్థాయిలో ఈసారి కూడా ఏదైనా పట్టుకునే పాయింట్ ఉంటేనే సీక్వెల్ క్లిక్ అయ్యే అవకాశం ఉంటుంది.
మండాది మాత్రం మరో రూట్. సముద్రం మీద జరిగే పడవ పోటీని కథకు బేస్‌గా తీసుకున్నారు. ఒకప్పుడు రేసుల్లో పేరు తెచ్చుకున్న సూరి పాత్ర మళ్లీ ఊరికి రావడం, ఎదురుగా సుహాస్ టీమ్ ఉండటం ట్రైలర్‌లో కనిపించింది. స్పోర్ట్స్ డ్రామాల్లో చివరి రేసు కంటే ముందున్న పగ, పరువు, మనుషుల మధ్య బంధాలే ఎక్కువ హైలెట్ అవుతాయి. ఆ తమిళ నేటివిటీ తెలుగులో కూడా పట్టేస్తే మండాది సైలెంట్‌గా మంచి టాక్ తెచ్చుకునే సినిమా కావచ్చు.
అయితే ఈ లిస్టులో ట్రైలర్ చూసిన వెంటనే గుర్తుండిపోయే ఎమోషన్ మారెమ్మ దగ్గర ఉంది. హీరో తన దున్నపోతును కాపాడుకోవడానికి పడే తాపత్రయం కథకు హార్ట్‌గా పెట్టారు. గ్రామ దేవత, జాతర, బలి అనే సెటప్ మధ్య ఆ జంతువుతో ఉన్న బంధం సరిగ్గా పండితే ప్రేక్షకుడికి కొత్తగా అనిపించొచ్చు.
ఎపిక్‌కు మాత్రం మరో డిఫరెంట్ ఎమోషన్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య క్రేజ్ ఉంది. కానీ ఆదిత్య హాసన్ ఈసారి కాలేజీ ప్రేమను మాత్రమే కాకుండా విదేశాల్లో చదువు, కుటుంబ ఒత్తిడి, రిలేషన్‌షిప్‌లో వచ్చే మార్పులను కలిపాడు. 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్‌లో ఫ్యామిలీ ఎమోషన్‌ను సింపుల్‌గా పట్టుకున్న ఈ దర్శకుడు ఈసారి యూత్ పల్స్‌ను ఎంతవరకు పట్టుకుంటాడో చూడాలి.
ఇక సుమంత్ మహేంద్రగిరి వారాహి దగ్గర భక్తి ఎమోషన్ ఉంది. శాపం, వరుస మరణాలు, వారాహి అమ్మవారి నేపథ్యంతో సినిమాను మిస్టరీగా తీసుకొస్తున్నారు. ఇటీవలి కాలంలో భక్తి టచ్ ఉన్న సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే కంటెంట్ జనాలకు కొత్తగా కనెక్ట్ అవ్వాలి. దాదాపు అందరూ అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఆకట్టుకునే ఎమోషన్ తో వస్తున్నారు. మరి ఎవరు బాక్సాఫీస్ విన్నర్ గా నిలుస్తారో చూడాలి.