జాన్వీకి పెరుగుతున్న మద్దతు.. ఇప్పటికైనా మార్పు వస్తుందా?
డిజిటల్ యుగంలో కూడా లింగ సమానత్వం కోసం పోరాడాల్సి వస్తోంది అంటూ కొంతమంది నటీమణులు చేస్తున్న కామెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.;
డిజిటల్ యుగంలో కూడా లింగ సమానత్వం కోసం పోరాడాల్సి వస్తోంది అంటూ కొంతమంది నటీమణులు చేస్తున్న కామెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సాధారణంగా ఒకప్పుడు మహిళలు అంటే వంటగదికే పరిమితమయ్యేవారు. కానీ కాలం మారుతున్న నేపథ్యంలో మహిళలు ప్రతి రంగాలలో ముందుంటున్నారు. అంతేకాదు అంతరిక్షానికి కూడా వెళ్లి తమ సత్తా ఏంటో నిరూపిస్తున్నారు. ఇక ఒక్కటేమిటి పురుషుడితో సమానంగా పోటీపడుతూ దూసుకుపోతున్న ఈ డిజిటల్ యుగంలో కూడా మహిళలకు సరైన గౌరవం లభించడం లేదు అని, పురుష అహంకారం ఎక్కువవుతోంది అంటూ జాన్వీ కపూర్ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సమానత్వం కోసం ఇప్పుడు పోరాడగలిగితేనే వచ్చే జనరేషన్ కైనా ఈ ఇబ్బందులు ఉండవు అని ఆమె తన అభిప్రాయంగా చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు ఆమె అభిప్రాయానికి అండగా నిలిచారు గ్లోబల్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా. లింగ సమానత్వం కోసం మాత్రమే కాదు ఇలా పోరాడే వారికి కూడా మద్దతుగా నిలవాలి అంటూ చెప్పుకొచ్చింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
బాలీవుడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న జాన్వీ కపూర్ శ్రీదేవి, బోనీకపూర్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఒకవైపు నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న ఈమె.. మరొకవైపు సినీ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న విషయాలపై కూడా స్పందిస్తోంది. విషయంలోకి వెళ్తే.. తాజాగా ముంబై వేదికగా జరిగిన "వీ ది విమెన్ ఆసియా" కార్యక్రమంలో జాన్వీ మాట్లాడుతూ.. "మహిళగా పుట్టడాన్ని నేను గౌరవంగా భావిస్తున్నాను. సమానత్వం అనేది మాటలతో, చర్చల తోనే ప్రారంభమవుతుంది. మనం ఈ అంశం గురించి ఇప్పటికైనా ఓపెన్ గా మాట్లాడితేనే మన తర్వాత తరానికైనా దీనిపై పూర్తి అవగాహన వస్తుంది. నేను మహిళగా పుట్టినందుకు గర్వపడుతున్నాను. మనల్ని మనం ప్రశంసించుకుంటూ ముందుకు సాగాలి. మహిళలు శక్తిమంతులు. వారిని ప్రోత్సహిస్తే.. అద్భుతాలు సృష్టిస్తారు" అంటూ జాన్వీ కపూర్ తెలిపింది.
జాన్వీ కపూర్ మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ వీడియోని తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ ద్వారా షేర్ చేస్తూ "ఇలా మాట్లాడే వారిని కూడా ప్రోత్సహించాలి" అంటూ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కామెంట్ చేసింది. జాన్వీ కపూర్ మాటలకు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మద్దతుగా నిలవడంతో అందరూ ప్రశంశలు కురిపిస్తున్నారు. అంతేకాదు ఇప్పటికైనా ఇండస్ట్రీలో మార్పు రావాలి అని కామెంట్లు చేస్తున్నారు.
ఇకపోతే గతంలో ట్వింకిల్ ఖన్నా, కాజోల్ కలసి నిర్వహించిన టాక్ షోలో పాల్గొన్న జాన్వీ కపూర్ మాట్లాడుతూ.." ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే పురుష అహంకారాన్ని ఎదుర్కోవాలి. ముఖ్యంగా నలుగురు మహిళలు ఉన్నచోట నా అభిప్రాయాన్ని వ్యక్తం చేయగలను. కానీ అదే ప్రదేశంలో నలుగురు పురుషులు ఉంటే మాత్రం నా అభిప్రాయాన్ని వ్యక్తపరచలేదు. దీనికి చాలా నేర్పు ఉండాలి. ఒక స్టార్ కిడ్ కి అలాంటి సమస్యలు ఏమి ఉండవు అనుకుంటారు. కానీ నేను కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఎన్నో పోరాటాలు చేశాను" అని కూడా జాన్వి కపూర్ తెలిపింది. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.