హీరో ఎవరైనా వాళ్లిద్దరు మాత్రం ఫిక్స్..!

ఆ ఇద్దరు ఎవరో కాదు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ. హీరో పక్కన ఉంటున్నారు కదా వీళ్లకి సైడ్ రోల్స్ అనుకుంటే పొరపడినట్టే.. కథలో భాగం అవుతూ వారి మార్క్ చాటుతున్నారు.

Update: 2024-03-27 03:15 GMT

ప్రేక్షకుల ఆలోచన ధోరణి మారుతున్నా కొద్దీ వారిని అలరించేందుకు కొత్త కథలతో.. కొత్త పాత్రలతో వస్తున్నారు దర్శకులు. ఒకప్పుడు కథలో కథానాయకుడు ఒక్కడే ఉండేవాడు అతనే మెయిన్ లీడ్ గా ఉంటూ సినిమాను.. కథను నడిపించే వాడు కానీ మారిన స్టోరీ టెల్లింగ్ విధానంలో భాగంగా కథలో ఒక్కరు కాదు ఇద్దరు ముగ్గురు ప్రధాన పాత్రలుగా చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఇదివరకు హీరో పక్కన ఉండే వారు కేవలం అతని హీరోయిజాన్ని లేపడానికి.. అతను పంచులు వేస్తే పడడానికి మాత్రమే ఉండే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.

కథలో హీరో ఒక్కడు కాదు ఇద్దరు ముగ్గురు ఉంటున్నారు. ప్రేక్షకులకు ఎంటర్టైనింగ్ అందించడమే ముఖ్య ఉద్దేశ్యం తో ప్రేక్షకుల కోసం ముగ్గురు ప్రధాన పాత్రలతో కథలు రాస్తున్నారు. అలాంటి కథలకు పేరుకి లీడ్ హీరో ఒకరిని పెడుతున్నా అతని పక్కన ఫ్రెండ్స్ పాత్రల్లో ఒక ఇద్దరిని తీసుకుంటున్నారు. కథలు.. పాత్రలకు తగినట్టుగా హీరోలు మారుతున్నా కూడా ఆ ఇద్దరు ఫ్రెండ్స్ మాత్రం మారట్లేదు.

ఆ ఇద్దరు ఎవరో కాదు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ. హీరో పక్కన ఉంటున్నారు కదా వీళ్లకి సైడ్ రోల్స్ అనుకుంటే పొరపడినట్టే.. కథలో భాగం అవుతూ వారి మార్క్ చాటుతున్నారు. ప్రియదర్శి ఒక పక్క సోలో సినిమాలు చేస్తూ సత్తా చాటుతుండగా మరోపక్క ఇలా హీరో పక్క పాత్ర అది కూడా కథలో కీలకం అనిపించే పాత్రలు చేస్తున్నారు. రాహుల్ రామకృష్ణ కూడా ఇలాంటి పాత్రలకు పెట్టింది పేరు. హీరో పక్కన సైడ్ రోల్ గా కాకుండా అతను కూడా ఒక హీరోగా తన మార్క్ చాటుతున్నాడు.

Read more!

జాతిరత్నాలు తో మొదలైన ఈ క్రేజీ కాంబో సినిమాలు వస్తూనే ఉన్నాయి. లేటెస్ట్ గా ఈ ఇద్దరు కలిసి చేసిన ఓం భీం బుష్ కూడా సూపర్ హిట్ అయ్యింది. శ్రీ విష్ణుతో పాటు కథలో కీలకంగా మారిన రాహుల్, ప్రియదర్శి పాత్రలు అద్భుతంగా పండాయి. ఆ ఇద్దరు లేకుండా శ్రీ విష్ణు ఒక్కడే నడిపించడం అన్నది కుదిరే పని కాదు. సో టాలీవుడ్ కి దొరికిన జాతిరత్నాలుగా ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ అటు కథానాయకుడికి సపోర్ట్ గా కథలో తాము కూడా బలంగా మారుతూ తమ సత్తా చాటుతున్నారు. ఇలాంటి కథలకు హీరో ఎవరైనా సరే వీళ్లిద్దరు మాత్రం ఫిక్స్ అనిపించేలా ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు.

Tags:    

Similar News