'బాలన్: ది బాయ్' హిస్టరీలో మైలురాయిగా నిలిచిపోయే థ్రిల్లర్: ప్రియదర్శన్
మలయాళ చిత్ర పరిశ్రమ నుండి మరో సంచలనాత్మక చిత్రం `బాలన్: ది బాయ్` విడుదలకు సిద్ధమవుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ - థెస్పియన్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ థ్రిల్లర్ చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
మలయాళ చిత్ర పరిశ్రమ నుండి మరో సంచలనాత్మక చిత్రం `బాలన్: ది బాయ్` విడుదలకు సిద్ధమవుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ - థెస్పియన్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ థ్రిల్లర్ చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాను వీక్షించిన భారతీయ సినీ దిగ్గజ దర్శకుడు ప్రియదర్శన్ ప్రశంసల జల్లు కురిపించారు. గత రెండేళ్ల కాలంలో తాను చూసిన అత్యంత ప్రతిభావంతమైన, అద్భుతమైన చిత్రం ఇదొక్కటేనని కొనియాడారు.
ఈ చిత్రానికి నేటితరం టాలెంట్స్ వెన్నుముకగా నిలిచారు. గతేడాది `మంజుమ్మెల్ బాయ్స్` సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన దర్శకుడు చిదంబరం ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. `ఆవేశం` వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించిన జితు మాధవన్ ఈ సినిమాకు కథను సమకూర్చడం విశేషం. కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కె. నారాయణ - శైలజ దేశాయ్ ఫెన్ ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ సినిమాను నిర్మించారు. ఈ మోస్ట్ అవైటెడ్ థ్రిల్లర్ మూవీ జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
చిత్రబృందంతో చిట్ చాట్ లో దర్శకుడు ప్రియదర్శన్ మాట్లాడుతూ... ఇది మలయాళ సినిమా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని.. ఒక శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకుంటుందని జోస్యం చెప్పారు. ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి బలమైన స్క్రీన్‌ప్లేయే ప్రధాన కారణమని...అదే ఈ చిత్రానికి పునాది అని ఆయన అభివర్ణించారు. దర్శకుడు చిదంబరం నేతృత్వంలో సినిమాలోని ప్రతి ఒక్క విభాగం ఎంతో సహజంగా... అంకితభావంతో పనిచేసి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించిందని ప్రియదర్శన్ చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించారు.
ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డ్ సభ్యులు సైతం సినిమా మేకింగ్, ప్రెజెంటేషన్, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్‌గా ఉందంటూ ప్రత్యేకంగా ప్రశంసించడం విశేషం. భావోద్వేగాలు, ఉత్కంఠభరితమైన సస్పెన్స్, స్థానిక సంస్కృతీ సంప్రదాయాల కలయికతో తెరకెక్కిన ఈ చిత్రం... కేవలం దేశీయంగానే కాకుండా ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రం హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ప్రేక్షకులను పలకరించనుంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకురావడానికి టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ `అన్నపూర్ణ స్టూడియోస్` డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేయడానికి సదరు సంస్థ ప్లాన్ చేస్తోంది.