పరిశ్రమలో హద్దులు దాటిన ప్రవర్తన!
స్క్రిప్ట్ ప్రకారం జరగాల్సిన ముద్దు సన్నివేశంలో ఆ నటుడు ముందుగా అనుకున్న పరిమితులను దాటి అసౌకర్యంగా ప్రవర్తించడంతో తాను ఆందోళనకు గురైనట్లు పేర్కొన్నారు.
వెండితెరపై కనిపించే ఆకర్షణ.. గ్లామర్ వెనుక నటీనటులు ఎదుర్కొనే అభద్రత.. అసౌకర్యకరమైన పరిస్థితులు తరచూ చర్చనీయాంశమవుతుంటాయి. ముఖ్యంగా రొమాంటిక్ లేదా ముద్దు సన్నివేశాల చిత్రీకరణ సమయంలో నటీనటుల మధ్య పరస్పర గౌరవం, వృత్తిపరమైన హద్దులు పాటించడం అత్యంత ముఖ్యం. తాజాగా ప్రముఖ మరాఠీ -హిందీ నటి ప్రియా బాపట్ తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకుంటూ చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలోని ఇంటర్నల్ వర్క్ కల్చర్‌పై సరికొత్త చర్చకు దారితీశాయి. ఒక టాక్ షో లో ప్రియా బాపట్ ఓ సినిమా షూటింగ్ సమయంలో సహనటుడు వృత్తిపరమైన హద్దులను దాటి ప్రవర్తించాడని గుర్తు చేసుకున్నారు.
స్క్రిప్ట్ ప్రకారం జరగాల్సిన ముద్దు సన్నివేశంలో ఆ నటుడు ముందుగా అనుకున్న పరిమితులను దాటి అసౌకర్యంగా ప్రవర్తించడంతో తాను ఆందోళనకు గురైనట్లు పేర్కొన్నారు. కెరీర్ ప్రారంభ దశలో ఉన్నందున ఆ సమయంలో సెట్స్‌పై వెంటనే ఎలా స్పందించాలో తెలియక, ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక తీవ్ర మనోవేదనకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో తన భర్త , నటుడు ఉమేష్ కామత్ అండగా నిలిచారన్నారు. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే కామత్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా షూటింగ్ జరుగుతున్న లొకేషన్‌కు నేరుగా ఫ్లైట్ ఎక్కి చేరుకున్నారన్నారు. సెట్స్‌పైకి వచ్చిన తర్వాత భార్యకు మానసిక ధైర్యాన్ని అందించడమే కాకుండా నటీనటుల రక్షణ , వృత్తిపరమైన హద్దుల విషయంలో చిత్ర బృందాన్ని, సదరు సహనటుడిని నిలదీశారన్నారు.
పరిశ్రమలో మహిళా నటీనటులకు కనీస గౌరవం, సురక్షితమైన పని వాతావరణం కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందంటూ గట్టిగా గళం విప్పినట్లు గుర్తు చేసుకున్నారు. ఈ రకమైన సంఘటనలు ఒక పరిశ్రమకే పరిమితం కాదని గ్లామర్ ప్రపంచంలో చాలా మంది నటీమణులు ఇలాంటి అవాంఛనీయ పరిస్థితులను మౌనంగా భరిస్తుంటారని ప్రియా బాపట్ అభిప్రాయపడ్డారు.`షూటింగ్ సమయంలో స్క్రిప్ట్ డిమాండ్ మేరకు చేసే నటనకు, వ్యక్తిగత ప్రవర్తనకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. వృత్తిని ఆసరాగా చేసుకుని హద్దులు దాటే ప్రవర్తనను ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్థించలేం` అని తెలిపింది.
నటీనటుల మధ్య కన్సెంట్.. ఒకరినొకరు గౌరవించుకోవడం అనేవి షూటింగ్ లొకేషన్‌లో ప్రాథమిక సూత్రాలు కావాలని పిలుపునిచ్చారు. ఆధునిక చలనచిత్ర పరిశ్రమలో ఇలాంటి సమస్యల నివారణకు ఇంటిమసీ కోఆర్డినేటర్స్ అనే సరికొత్త వ్యవస్థ అందుబాటులోకి వస్తోంది. హాలీవుడ్ తరహాలోనే భారతీయ సినిమాల్లోనూ రొమాంటిక్, కాంప్లికేటెడ్ సీన్స్ తీసేటప్పుడు నటీనటులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు ఈ నిపుణులను నియమిస్తున్నారు. ప్రియా బాపట్ పంచుకున్న ఈ అనుభవం, పరిశ్రమలో ఇంకా మారాల్సిన పరిస్థితులను , ప్రతీ సెట్‌లోనూ సురక్షిత వాతావరణం, కఠినమైన నిబంధనలు ఉండవలసిన అవసరాన్ని మరోసారి గుర్తుచేస్తోంది.
స్టార్‌డమ్ .. కెరీర్ భయంతో వెనకడుగు వేయకుండా నటీనటులు తమకు ఎదురయ్యే అసౌకర్యాల పట్ల గొంతు విప్పడం మంచి పరిణామం. ప్రియా బాపట్ ధైర్యంగా తన గతాన్ని పంచుకోవడం.. ఉమేష్ కామత్ ఆమెకు అండగా నిలవడం వంటివి తోటి నటీనటుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. సినిమా రంగాన్ని మరింత వృత్తిపరంగా, సురక్షితంగా మార్చడానికి ఇలాంటి ఓపెన్ డిస్కషన్స్ ఎంతగానో తోడ్పడతాయి.