కింగ్‌ఖాన్‌నే తలదన్నాడు..నెక్ట్స్ సూపర్‌స్టార్ అనుకున్నారు.. ఇంతలోనే!
90లలో బాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఓవర్‌నైట్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న కొద్దిమంది నటులలో పృథ్వీ వజీర్ ఒకరు.
90లలో బాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఓవర్‌నైట్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న కొద్దిమంది నటులలో పృథ్వీ వజీర్ ఒకరు. కేవలం పృథ్వీగా మాత్రమే అభిమానులకు సుపరిచితుడైన ఈ నటుడు 1992లో దివంగత నటి దివ్య భారతి సరసన `దిల్ కా క్యా కసూర్` చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేయడంతో పృథ్వీ రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయారు. ఆ సమయంలో దివ్య భారతి, పృథ్వీ జంట నటనతో పాటు నదీమ్-శ్రవణ్ అందించిన మ్యాజికల్ సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆనాటి మీడియా అతడిని బాలీవుడ్ నెక్ట్స్ రాజేష్ ఖన్నాగా కూడా అభివర్ణించింది. షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి నేటి సూపర్ స్టార్లు ఇండస్ట్రీలో తమ స్థానాన్ని వెతుక్కునే ప్రయత్నాల్లో ఉన్న ఆ కాలంలోనే పృథ్వీ ఒక ప్రామిసింగ్ రొమాంటిక్ హీరోగా ఎదిగి షారుఖ్‌కే గట్టి పోటీదారుగా నిలిచారు.
అయితే కెరీర్ ప్రారంభంలోనే అతడు తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం ఎదుగుదలను దెబ్బతీసింది. ఒక లీగల్ కాంట్రాక్ట్‌పై సంతకం చేయడం పృథ్వీ కెరీర్‌లో అతిపెద్ద తప్పుగా మారింది. 2021లో `ఝకాస్ బాలీవుడ్`కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పృథ్వీ ఈ విషయాలను వెల్లడిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఒక కాంట్రాక్ట్‌లో చిక్కుకుపోయాను.. దాని నుండి బయటపడటం చాలా కష్టంగా మారిందని అన్నారు.
నటుడిగా నా ప్రయాణం ఉత్తమ స్థితిలో ఉన్నప్పుడు కాంట్రాక్ట్ పేరుతో నన్ను లాక్ చేసారు. నేను పరిశ్రమ నుండి పూర్తిగా అదృశ్యం కాలేదు.. నా అభిమానుల హృదయాలలో ఎప్పుడూ బతికే ఉన్నాను. కానీ ఆ కాంట్రాక్ట్ ఆంక్షల వల్ల నేను సినిమాలు చేయలేకపోయాను! అని పృథ్వీ పేర్కొన్నారు. దీనివల్ల హీరోగా అవకాశాలు కోల్పోయిన అతడు ఆ తర్వాత సహాయక పాత్రలకే పరిమితం కావలసి వచ్చింది. చివరికి సుదీర్ఘకాలం పాటు నటనకు దూరమయ్యారు.
చాలా కాలం పాటు లైమ్‌లైట్‌కు దూరంగా ఉన్న పృథ్వీ వజీర్ కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక కొత్త ఇన్‌స్టా రీల్ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డాక్టర్ వనితా ఘాడగే దేశాయ్ అనే కంటెంట్ క్రియేటర్‌తో కలిసి అతడు చేసిన ఈ రీల్ ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యింది. ఇదే కంటెంట్ క్రియేటర్ గత నెలలో మరో సీనియర్ నటుడు రాహుల్ రాయ్‌తో చేసిన రీల్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడం గమనార్హం.
తన పాత సూపర్ హిట్ చిత్రం `దిల్ కా క్యా కసూర్`లోని చార్ట్‌బస్టర్ సాంగ్ `మిల్నే కీ తుమ్ కోశిష్ కర్నా`ను రీ-క్రియేట్ చేస్తూ పృథ్వీ ఈ రీల్‌ను రూపొందించారు. ఈ వీడియో క్యాప్షన్‌లో అతడు స్పందిస్తూ..''దయచేసి నెగెటివ్ కామెంట్లు పెట్టకండి. ఈ రీల్ కేవలం మీ వినోదం కోసం మాత్రమే రూపొందించాము. ఒకవేళ మీకు ఇది నచ్చకపోతే.. కేవలం స్క్రోల్ డౌన్ చేయండి'' అని రాసుకొచ్చారు. ఈ రీల్ ద్వారా అతడు తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ నెటిజన్లను అలరించారు.
ఇక పృథ్వీ వజీర్ ప్రస్తుత వృత్తిగత, వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆయన చివరిగా 2024లో విడుదలైన `ధాక్` చిత్రంలో ఒక చిన్న అతిథి పాత్రలో కనిపించారు. వ్యక్తిగత జీవితంలో ఆయన సప్నా వజీర్ (లుబ్నా వజీర్ అని కూడా పిలుస్తారు) ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులు అప్పుడప్పుడు పలు పబ్లిక్ ఈవెంట్లకు హాజరవుతూ కలిసి వేడుకల్లో పాల్గొంటూ కనిపిస్తుంటారు. ఒకప్పుడు బాలీవుడ్‌ను శాసిస్తాడనుకున్న ఓ స్టార్ హీరో.. కాంట్రాక్టుల వివాదాల వల్ల కెరీర్‌ను కోల్పోయి ఇప్పుడు ఇలా సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలకరించడం సినీ ప్రపంచంలోని ఒడిదుడుకులకు అద్దం పడుతోంది.