డీప్ ఫేక్ : దీపిక-ర‌ష్మిక త‌ర్వాత ప్రీతిజింటా కోర్టు పోరాటం!

ప్రస్తుతం కృత్రిమ మేధస్సు (ఏఐ) విపరీతంగా అభివృద్ధి చెందడం..అదే స‌మ‌యంలో సాంకేతిక‌త‌ దుర్వినియోగం సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌కు పెద్ద శాపంగా మారుతోంది.

Update: 2026-07-05 14:44 GMT

ప్రస్తుతం కృత్రిమ మేధస్సు (ఏఐ) విపరీతంగా అభివృద్ధి చెందడం..అదే స‌మ‌యంలో సాంకేతిక‌త‌ దుర్వినియోగం సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌కు పెద్ద శాపంగా మారుతోంది. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ ముద్దుగుమ్మలు రష్మిక మందన్న, దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా, ఐశ్వ‌ర్యారాయ్ వంటి టాప్ హీరోయిన్లు డీప్‌ఫేక్ వీడియోల బారిన పడి ఆందోళన వ్యక్తం చేయగా... తాజాగా ఈ జాబితాలోకి సీనియర్ నటి ప్రీతి జింటా చేరారు. తన అనుమతి లేకుండా ఏఐ సాంకేతికతతో సృష్టించిన నకిలీ డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ చేసిన ఫోటోలపై ప్రీతి జింతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చట్టపరమైన చర్యలకు దిగారు. తన వ్యక్తిత్వానికి, ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న ఆ కంటెంట్‌ను ఇంటర్నెట్ నుండి పూర్తిగా తొలగించాలంటూ ప్రీతి జింటా అధికారికంగా బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

ప్రీతి జింటా దాఖలు చేసిన ఈ సివిల్ దావాలో సోషల్ మీడియా స‌హా ప‌లు ఆన్‌లైన్ వేదిక‌లలో తన అనుమతి లేకుండా తన ముఖాన్ని, రూపాన్ని వాడుకుంటూ క్రియేట్ చేసిన అనేక డీప్‌ఫేక్ విజువల్స్ ఆధారాలను కోర్టుకు సమర్పించారు. ఈ పరిస్థితి అత్యంత తీవ్రమైనదని... తన అనుమతి లేని అన‌ధికారిక‌ కంటెంట్‌ను ఏయే ప్లాట్‌ఫారమ్‌లు వైర‌ల్ చేస్తున్నాయో.. వాటన్నింటి నుండి తక్షణమే ఆ వీడియోలను తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని ప్రీతి తన పిటిషన్‌లో కోరారు. కేవలం ప్రస్తుతం ఉన్న కంటెంట్ తొలగింపు మాత్రమే కాకుండా.. భవిష్యత్తులో కూడా తన రూపాన్ని గానీ... వాయిస్‌ని గానీ వాడుకుంటూ ఇలాంటి ఏఐ మెటీరియల్‌ను పంపిణీ చేయకుండా లేదా పబ్లిష్ చేయకుండా శాశ్వత నిషేధాజ్ఞలు విధించాలని ఆమె న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

ఈ సంచలన కేసు ఇటీవల జస్టిస్ మాధవ్ జామదార్ బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. కోర్టులో ప్రాథమిక వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి స్పందిస్తూ... వివాదాస్పదమైన ఆ నకిలీ కంటెంట్‌ను తొలగించడానికి ఒక పక్కా వ్యూహాన్ని రూపొందించాలని సంబంధిత ఆన్‌లైన్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు అన్ని పక్షాలకు కీలక సూచనలు చేశారు. ఈ కేసు పూర్తి వివరాలపై కోర్టు తక్షణమే ఎలాంటి తుది ఉత్తర్వులు ఇవ్వక‌పోయినా.. తదుపరి విచారణను జూలై 6వ తేదీకి వాయిదా వేసింది. త‌దుప‌రి సెషన్‌లో ఈ సమస్య తీవ్రతను, అలాగే వివాదాస్పద కంటెంట్ తొలగింపునకు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు తీసుకున్న చర్యలను కోర్టు మరింత లోతుగా పరిశీలించనుంది.

అసలు ఈ డీప్‌ఫేక్ అనేది అడ్వాన్స్‌డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి ఒక వ్యక్తి రూపం లేదా గొంతును ఉన్నది ఉన్నట్లుగా కాపీ చేస్తూ సృష్టించే అత్యంత ప్రమాదకరమైన నకిలీ కంటెంట్. ఇది ఎంత రియలిస్టిక్‌గా ఉంటుందంటే.. ఏది నిజమైన వీడియో, ఏది నకిలీ వీడియో అని గుర్తించడం సామాన్యులకు అస్సలు సాధ్యం కాదు. ఈ సాంకేతికత దుర్వినియోగం వల్ల ప్రీతి జింటా వంటి పబ్లిక్ ఫిగర్స్‌ వ్యక్తిగత భద్రతకు, సమాజంలో వారికున్న గౌరవ మర్యాదలకు తీవ్ర ముప్పు వాటిల్లుతోంది. సెలబ్రిటీలను తప్పుగా చిత్రీకరిస్తూ తప్పుడు సమాచారాన్ని సమాజంలోకి వేగంగా చేరవేయడానికి ఇదొక సాధనంగా మారుతోందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ప్రీతి జింటా వేసిన ఈ పిటిషన్ ప్రస్తుతం సెలబ్రిటీల వ్యక్తిగత హక్కులు, డిజిటల్ భద్రత, సాంకేతిక పరిమితులపై దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చకు దారితీసింది. టెక్నాలజీ ఇంతలా దూసుకుపోతున్న తరుణంలో ఇలాంటి డిజిటల్ నేరాల నుండి వ్యక్తుల ప్రతిష్టను రక్షించడానికి మన న్యాయపరమైన చట్టాలు కూడా మరింత వేగంగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ కేసు స్పష్టం చేస్తోంది. భవిష్యత్తులో రానున్న‌ ఇలాంటి ఎన్నో ఏఐ డీప్‌ఫేక్ కేసులకు బాంబే హైకోర్టులో నడుస్తున్న ప్రీతి జింటా కేసు తీర్పు ఒక ల్యాండ్‌మార్క్ గైడ్‌లైన్‌గా మారే అవకాశం ఉందని న్యాయ‌నిపుణులు, విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News