30 కోట్లు నష్టపోయినా సైలెంట్‌గా నిర్మాత..!
ఈ నిర్మాత సినిమా అర్థాంతరంగా ఆగిపోవడంతో ఏకంగా 30 కోట్లు నష్టపోయాడు. హీరోలంతా ఒక్కొక్కరుగా వేరే ప్రాజెక్టులకు కమిటవ్వడానికి సినిమా కాంట్రాక్ట్ నుంచి వైదొలిగారు.
ఈ నిర్మాత సినిమా అర్థాంతరంగా ఆగిపోవడంతో ఏకంగా 30 కోట్లు నష్టపోయాడు. హీరోలంతా ఒక్కొక్కరుగా వేరే ప్రాజెక్టులకు కమిటవ్వడానికి సినిమా కాంట్రాక్ట్ నుంచి వైదొలిగారు. చివరికి ఆ సినిమాని నిర్మాత మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇలాంటి క్రైసిస్ ని ఎదుర్కొని కూడా ఆ నిర్మాత సైలెంట్ గానే ఉన్నారు. తన నెక్ట్స్ ప్రాజెక్టులపై దృష్టి సారించారు. ఇంతకీ ఎవరా నిర్మాత? అంటే... ది గ్రేట్ బోనీకపూర్.
బాలీవుడ్‌లో ఒకప్పుడు సంచలన విజయం సాధించిన `నో ఎంట్రీ` చిత్రానికి సీక్వెల్‌గా `నో ఎంట్రీ 2`ని ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు. మొదటి భాగం తెచ్చిపెట్టిన భారీ విజయం.. క్రేజ్ దృష్ట్యా ఈ సీక్వెల్‌పై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలైన ఈ ప్రాజెక్ట్ ఆ తర్వాత ఊహించని మలుపులు తిరుగుతూ మధ్యలోనే నిలిచిపోవడం షాకిచ్చింది.
ఈ సినిమాను ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే పట్టుదలతో నిర్మాత బోనీ కపూర్ ప్రాజెక్ట్ ప్రారంభంలోనే భారీగా పెట్టుబడులు పెట్టారు. కేవలం కొంత భాగం షూటింగ్ పూర్తి చేయడానికే ఆయన దాదాపు 30 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు స్వయంగా వెల్లడించారు. అయితే దురదృష్టవశాత్తూ షూటింగ్ మధ్యలోనే నిలిచిపోవడంతో ఆ ప్రొడక్షన్ వర్క్ అంతా వృథాగా మిగిలిపోయింది. సినిమా ముందుకు సాగకపోవడంతో పెట్టిన పెట్టుబడి పూర్తిగా లాక్ అయిపోయింది.
సినిమా ఆగిపోవడమే కాకుండా ఆ 30 కోట్ల పెట్టుబడిపై నెలకు వస్తున్న వడ్డీలు కూడా తోడవడంతో నిర్మాతకు నష్టం మరింత భారంగా మారింది. ఈ సినిమాకు పెట్టిన ఖర్చు, దానిపై పెరుగుతున్న వడ్డీల భారం అంతా కలిపి ఇప్పుడు భారీ నష్టంగా పరిణమించింది. అసలు ఇంతటి క్రేజీ ప్రాజెక్ట్ మధ్యలోనే ఎందుకు ఆగిపోయింది? ప్రస్తుతం ఈ సినిమా ఏమైంది? అనే విషయాలపై ఇండస్ట్రీ వర్గాల్లో ఎవరికీ స్పష్టమైన సమాచారం లేకుండా పోయింది.
గతంలో నిర్మాత బోనీ కపూర్ ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. తనకు జరిగిన భారీ ఆర్థిక నష్టంపై మీడియా ముందు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు. అంత పెద్ద మొత్తం వృథా కావడంపై ఆయన తీవ్ర అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. కానీ ఆ తర్వాత కాలంలో ఆ మూవీని తిరిగి పట్టాలెక్కించడానికి ఎందుకు ప్రయత్నించలేదు? అసలు ఆ సినిమాను పూర్తి చేయడానికి ఉన్న అడ్డంకులేమిటనేది ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని ప్రశ్నగానే మిగిలిపోయింది.
ఒకవైపు ఇంతటి భారీ నష్టం కళ్లముందు కనిపిస్తున్నా బోనీ కపూర్ ఇటీవల ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. అసలింతకీ సినిమాను శాశ్వతంగా పక్కనబెట్టేశారా? లేక భవిష్యత్తులో ఏదైనా ప్రణాళిక ఉందా? అనే దానిపై ఆయన పూర్తిగా సైలెన్స్ పాటిస్తున్నారు. ఒక బ్లాక్‌బస్టర్ సీక్వెల్ కోసం 30 కోట్లు నష్టపోయినా నిర్మాత ఇలా మౌనంగా ఉండిపోవడం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం బోనీ తన కుమార్తెలు జాన్వీకపూర్, ఖుషీ కపూర్ కెరీర్ పై పూర్తిగా ఫోకస్ పెట్టారు. వారిని పెద్ద స్టార్లుగా ఎలివేట్ చేయడానికి ఆయన వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. వారసుడు అర్జున్ కపూర్ సినిమాలకు అతడు పెట్టుబడుల్ని సమకూరుస్తున్నారు.