ఆర్భాటం లేకుండా ఆమిర్ పెళ్లి! 61 ఏళ్ల వయసులో కొత్త జీవితానికి శ్రీకారం!

మధ్యాహ్నం సుమారు 12.45 గంటల సమయంలో ఆమిర్, గౌరీ పెళ్లికి సంబంధించిన అధికారిక పత్రాలపై సంతకాలు చేశారు.

Update: 2026-07-05 14:44 GMT

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తన ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. 61 ఏళ్ల వయసులో తన సన్నిహితురాలు గౌరీ స్ప్రాట్ ను పెళ్లి చేసుకుని ఇద్ద‌రూ క‌లిసి దాంపత్య బంధంలోకి అడుగుపెట్టారు. ముంబైలోని బాంద్రాలో ఉన్న ఆమిర్ ఇంట్లో ఆదివారం మధ్యాహ్నం అత్యంత సాదాసీదాగా ఈ పెళ్లి జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, కొద్దిమంది స్నేహితుల సమక్షంలో పెళ్లి నమోదు ప్రక్రియ పూర్తి చేశారు.

మధ్యాహ్నం సుమారు 12.45 గంటల సమయంలో ఆమిర్, గౌరీ పెళ్లికి సంబంధించిన అధికారిక పత్రాలపై సంతకాలు చేశారు. ఆర్భాటాలకు దూరంగా, అత్యంత వ్యక్తిగతంగా ఈ వేడుకను నిర్వహించాలని ముందుగానే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ పెళ్లిలో ఎలాంటి మార్పులు చేయకుండా అనుకున్న సమయానికే పూర్తి చేశారు. ఈ వేడుకకు ఆమిర్ కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. ఆయన మొదటి భార్యతో కలిగిన పిల్లలు జునైద్ ఖాన్, ఐరా ఖాన్ తో పాటూ రెండో భార్య కిర‌ణ్ రావు తో కలిగిన కొడుకు ఆజాద్ కూడా ఈ ప్రత్యేక సందర్భానికి సాక్ష్యమయ్యాడు. గౌరీకు గత వివాహం ద్వారా జన్మించిన కొడుకు కూడా ఈ పెళ్లి కార్య‌క్ర‌మంలో పాల్గొన్నాడు. కుటుంబ సభ్యులు కలిసి ఈ కొత్త బంధాన్ని ఆనందంగా స్వాగతించినట్లు సమాచారం.

సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ వేడుకకు విచ్చేశారు. డైరెక్ట‌ర్ అశుతోష్ గోవారిక‌ర్, యాక్ట‌ర్ వీర్ దాస్, మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ ప‌ఠాన్, ప్ర‌ముఖ బిజినెస్ మ్యాన్ ముఖేష్ అంబానీ, పొలిటీషియ‌న్ రాజ్ తాక‌రే, లిరిసిస్ట్ ప్ర‌సూన్ జోషి తదితరులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. మొత్తం దాదాపు 150 మంది అతిథులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

ఆమిర్ ఖాన్ వ్యక్తిగత జీవితాన్ని పరిశీలిస్తే, ఇది ఆయనకు మూడో వివాహం. 1986లో రానీ ద‌త్తాను పెళ్లి చేసుకున్న ఆయన, 2002లో విడిపోయారు. ఆ దంపతులకు జునైద్, ఐరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనంతరం 2005లో డైరెక్ట‌ర్ కిరణ్ రావును పెళ్లి చేసుకున్న ఆమిర్, 2021లో ఆమెతో కూడా విడిపోయారు. అయితే కొడుకు ఆజాద్ పెంపకంలో మాత్రం ఇద్దరూ కలిసి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక గౌరీ స్ప్రాట్ విష‌యానికొస్తే, బెంగళూరుకు చెందిన ఆమె వెల్‌నెస్, బ్యూటీ రంగంలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో ఒక ప్రముఖ సలూన్ నిర్వహిస్తున్నారు. ఆమెకు కూడా గత వివాహం ద్వారా ఒక కొడుకు ఉన్నాడు. ఆమిర్ ఖాన్ ఈ ఏడాది తన 60వ పుట్టిన రోజు సందర్భంగా గౌరీతో ఉన్న అనుబంధాన్ని మొదటిసారి బహిరంగంగా వెల్లడించారు. దాదాపు 25 ఏళ్లుగా ఒకరికొకరు పరిచయం ఉన్నప్పటికీ, గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నామని అప్పట్లో చెప్పారు. ఇప్పుడు ఆ బంధాన్ని పెళ్లితో మరింత బలపరుస్తూ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. బాలీవుడ్‌లో ఈ పెళ్లి ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News