మొత్తానికి ప్ర‌శాంత్ నీల్ టాలీవుడ్ లో తిష్ట వేసిన‌ట్లే!

కన్నడ సంచ‌ల‌నం ప్రశాంత్ నీల్ ఇప్పుడు టాలీవుడ్‌ను తన శాశ్వత నివాసంగా మార్చుకున్నట్లు క‌నిపిస్తుంది.

Update: 2026-06-06 18:33 GMT

కన్నడ సంచ‌ల‌నం ప్రశాంత్ నీల్ ఇప్పుడు టాలీవుడ్‌ను తన శాశ్వత నివాసంగా మార్చుకున్నట్లు క‌నిపిస్తుంది. `కేజీఎఫ్` తో కన్నడ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నా? టాలీవుడ్ హీరోల మార్కెట్ పరిధి ..ఇక్కడి నిర్మాణ సంస్థల మేకింగ్ వాల్యూస్ ప్రశాంత్ నీల్‌ను అమితంగా ఆకర్షించాయి. ఒకప్పుడు టాలీవుడ్ దర్శకులు ఇతర పరిశ్రమలపై కన్నేస్తే ఇప్పుడు ప్రశాంత్ నీల్ లాంటి భారీ కమర్షియల్ డైరెక్టర్ టాలీవుడ్ అగ్ర హీరోలందరినీ లైన్లో పెట్టడం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారుతోంది. ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్‌కు టాలీవుడ్ హీరోల మాస్ ఇమేజ్ పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే రెబెల్ స్టార్ ప్రభాస్‌తో ఆయన తెరకెక్కించిన `సలార్` చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించి ఇద్ద‌రి కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్‌ను నిరూపించింది.

ప్రభాస్ కటౌట్‌ను ప్రశాంత్ నీల్ ఎలివేట్ చేసిన విధానం మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించింది. ఈ సక్సెస్ ఊపుతోనే టాలీవుడ్ అగ్ర హీరోలంతా నీల్ తో సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారు. టాలీవుడ్‌లో ఉన్న పాన్ ఇండియా మూడ్‌ను ప్రశాంత్ నీల్ పూర్తిగా వాడుకుంటూ ఇక్కడే తిష్ట వేసి వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు.

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో `డ్రాగన్` అనే హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తు న్నారు. ఎన్టీఆర్ లాంటి పవర్‌హౌస్ పర్ఫామర్‌ను ప్రశాంత్ నీల్ తన డార్క్ అండ్ రా స్టైల్‌లో ఎలా చూపిస్తారనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. `డ్రాగన్` సెట్స్‌పై ఉండగానే ప్రశాంత్ నీల్ తదుపరి ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం ఆయన ప్లానింగ్‌కు నిదర్శనం. ఈ చిత్రం పూర్తి కాగానే ప్రభాస్‌తో `సలార్ 2` షూటింగ్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

`సలార్ 2` అనంతరం ప్రశాంత్ నీల్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ తో భారీ ప్రాజెక్ట్ చేయనున్నట్లు పరిశ్రమలో గట్టి ప్రచారం సాగుతోంది. మహేష్ క్లాస్ అండ్ స్టైలిష్ లుక్‌కు ప్రశాంత్ నీల్ రా అండ్ రస్టిక్ యాక్షన్ తోడైతే స్క్రీన్ మోత మోగడం ఖాయం. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు ఇప్పటికే ప్రాథమిక దశకు చేరుకున్నట్లు సమాచారం. మహేష్ తో పాటు టాలీవుడ్‌లోని మరికొందరు స్టార్ హీరోలు కూడా ప్రశాంత్ నీల్ కథల కోసం ఎదురుచూస్తున్నారు. దీనిని బట్టి చూస్తే రాబోయే ఐదారు సంవత్సరాల పాటు ప్రశాంత్ నీల్ డైరీ పూర్తిగా టాలీవుడ్ హీరోలతోనే నిండిపోయేలా ఉంద‌ని తెలుస్తోంది.

ఒక దర్శకుడు వరుసగా ఒకే ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలతో పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేయడం సాధారణ విషయం కాదు. టాలీవుడ్‌లో ఉన్న భారీ బడ్జెట్ అనుకూలత, అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలు, హీరోలకు ఉన్న గ్లోబల్ మార్కెట్ ప్రశాంత్ నీల్‌కు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారాయి. మైత్రీ మూవీ మేకర్స్, హోంబాలే ఫిలిమ్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలు నీల్ అడిగినంత బడ్జెట్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. టాలీవుడ్ నుంచి ఉన్న గ్లోబల్ అప్పీల్ కారణంగా ప్రశాంత్ నీల్ ఇక్కడి నుంచే ఇండియన్ సినిమాను శాసించేలా కనిపిస్తున్నారు.

మొత్తానికి ప్రశాంత్ నీల్ కేవలం సినిమాలు చేయడం లేదు. ఒక‌ బలమైన సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నారు. కన్నడ ఇం డస్ట్రీలో `కేజీఎఫ్ 3` లాంటి క్రేజీ ప్రాజెక్ట్ లైన్లో ఉన్నప్పటికీ దానికి చాలా సమయం పడుతుందని తేలిపోవడంతో ఆయన పూర్తి ఫోకస్ టాలీవుడ్ పైనే పెట్టారు. ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ వంటి క్రేజీ కాంబినేషన్లతో ప్రశాంత్ నీల్ చేయబోయే లైనప్ చూస్తుంటే? రాబోయే రోజుల్లో బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ తిరగరాయబడటం ఖాయంగా కనిపిస్తోంది. టాలీవుడ్ వేదికగా ప్రశాంత్ నీల్ సృష్టించబోయే ఈ యాక్షన్ వండర్స్ ఇండియన్ సినిమాను ఏ స్థాయికి తీసుకెళ్తాయో చూడాలి.

Tags:    

Similar News