KGF, సలార్‌కు పూర్తి భిన్నంగా డ్రాగన్.. ప్రశాంత్ నీల్ ప్లాన్ షాకింగ్‌గా ఉందే!
ఇక ఈ ఎమోషనల్ ట్రాక్‌లో కీలక పాత్ర పోషించబోతున్న వ్యక్తిగా మలయాళ నటి దర్శన రాజేంద్రన్ పేరు వినిపిస్తోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా డ్రాగన్‌పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే యాక్షన్ లవర్స్ దృష్టిని ఆకర్షించిన ఈ ప్రాజెక్ట్ గురించి తాజాగా బయటకు వస్తున్న వివరాలు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రశాంత్ నీల్ తనకు అలవాటైన డార్క్ టోన్‌ను పక్కనపెట్టి ఓ విభిన్నమైన విజువల్ ప్రపంచాన్ని సృష్టిస్తున్నారనే వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పటివరకు కేజీఎఫ్, సలార్ వంటి సినిమాల్లో బ్లాక్ అండ్ గ్రే షేడ్స్‌తో మాస్ యాక్షన్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లిన ప్రశాంత్ నీల్, ఈసారి డ్రాగన్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను పూర్తిగా కలర్‌ఫుల్‌గా డిజైన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సినిమా కథలో ఫ్లాష్‌బ్యాక్ భాగమే కీలకమని, అదే మొత్తం కథనానికి ఎమోషనల్ బేస్‌గా నిలుస్తుందని సమాచారం. ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన గతాన్ని, అతని వ్యక్తిత్వాన్ని మలిచిన సంఘటనలను ఈ ఎపిసోడ్‌లో చూపించనున్నారట. అందుకే విజువల్‌గా కూడా దానిని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ సినిమాల్లో సాధారణంగా కనిపించే డార్క్ ఫ్రేమ్స్‌కు పూర్తి భిన్నంగా ఈ భాగం ఉండబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఫ్లాష్‌బ్యాక్‌లో కనిపించే ప్రపంచం, పాత్రల మధ్య బాండింగ్స్, ఎమోషన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలవొచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక ఈ ఎమోషనల్ ట్రాక్‌లో కీలక పాత్ర పోషించబోతున్న వ్యక్తిగా మలయాళ నటి దర్శన రాజేంద్రన్ పేరు వినిపిస్తోంది. ఇప్పటికే ఆమె చిత్ర యూనిట్‌లో చేరినట్లు వార్తలు వస్తుండగా, కథలో భావోద్వేగాలకు కేంద్ర బిందువుగా నిలిచే పాత్రను ఆమె పోషిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. సహజమైన నటనతో మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శనకు, డ్రాగన్ కెరీర్‌లో అతిపెద్ద అవకాశంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమాలో ఎన్టీఆర్ లైఫ్ లో కీలక మలుపు తీసుకువచ్చే వ్యక్తిగా ఆమె కనిపించవచ్చనే ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే యాక్షన్‌తో పాటు ఎమోషన్‌ను సమతుల్యం చేసే పాత్రగా దర్శన క్యారెక్టర్ నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ నుంచి అనిల్ కపూర్ నటిస్తుండటంతో బాలీవుడ్ లో సినిమాకు మంచి మార్కెట్ ఏర్పడే అవకాశముంది. ఇప్పుడు మలయాళ నటి కూడా సినిమాలో భాగమైతే అక్కడ కూడా ఈ సినిమాకు మంచి మార్కెట్ తో పాటూ భారీ ఓపెనింగ్స్ కు అవకాశముంది.
మరోవైపు చిత్ర బృందం నెక్ట్స్ షెడ్యూల్‌కు కూడా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో ఓ కీలక సాంగ్ ను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఫ్లాష్‌బ్యాక్ నేపథ్యంలో వచ్చే ఈ సాంగ్ కథనంలో ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్‌కు ఇప్పటివరకు కనిపించని కొత్త లుక్, కొత్త బాడీ లాంగ్వేజ్ కూడా ఈ ఎపిసోడ్‌లో కనిపించవచ్చనే ప్రచారం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం చూస్తే, డ్రాగన్ లో యాక్షన్ సన్నివేశాల కంటే కూడా ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకునేది ఆ కలర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్, దానికి ముడిపడిన ఎమోషనల్ జర్నీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ప్రశాంత్ నీల్ కెరీర్‌లో ఇది మరో కొత్త యాంగిల్ ను పరిచయం చేసే సినిమాగా నిలిచే అవకాశం ఉంది.