జెన్-Zలో జాతీయ ఉత్తమ దర్శకుడు అర్హత ఇతడికే!
తెలుగు సినిమాని పాన్ ఇండియా- పాన్ వరల్డ్ చేర్చడంలో మన ప్రతిభావంతులైన దర్శకులను గుర్తిస్తే, అందులో నిస్సందేహంగా రాజమౌళి అగ్రపథంలో ఉంటారు.;
తెలుగు సినిమాని పాన్ ఇండియా- పాన్ వరల్డ్ చేర్చడంలో మన ప్రతిభావంతులైన దర్శకులను గుర్తిస్తే, అందులో నిస్సందేహంగా రాజమౌళి అగ్రపథంలో ఉంటారు. ఆ తర్వాత సుకుమార్ పుష్ప ఫ్రాంఛైజీతో పాన్ ఇండియాలో ప్రభంజనంగా మారారు. అయితే కేవలం అగ్ర దర్శకులు మాత్రమే కాదు, యువతరంలోను కొందరు ఉన్నారు. తెలుగు చిత్రసీమలో నేటితరంలో ప్రత్యేకంగా ప్రస్థావించదగిన పేరు- ప్రశాంత్ వర్మ. ఈ యంగ్ హీరో `హను-మ్యాన్` చిత్రంతో పాన్ ఇండియాలో సంచలనం సృష్టించారు. ఇప్పుడు `హనుమ్యాన్` కి ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ, AVGC రెండు విభాగాల్లో జాతీయ అవార్డులు వరించాయి. కమర్షియల్ సక్సెస్ తో పాటు, అవార్డులను అందించిన ఘనత ఇప్పుడు ప్రశాంత్ వర్మకు దక్కుతుంది.
ప్రయోగాత్మకత అతడి బలం:
నిజానికి ప్రశాంత్ వర్మ తెరకెక్కించి మొదటి సినిమా `అ!` చిత్రానికి రెండు జాతీయ అవార్డులు వరించాయి. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్- ఉత్తమ మేకప్ విభాగాల్లో జాతీయ పురస్కారాలతో అతడు ఆరోజే సంచలనంగా మారాడు. కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు హను-మ్యాన్ తో మరో రెండు జాతీయ పురస్కారాలను అందించిన ఘనత ప్రశాంత్ వర్మకే దక్కుతుంది. కెరీర్ లో నాలుగు సినిమాలను తెరకెక్కిస్తే, అందులో రెండు చిత్రాలకు జాతీయ అవార్డులు దక్కాయి. ఇదేమీ అంత సులువైన విషయం కాదు. నిజానికి ప్రశాంత వర్మ ఆలోచనలు, పనితనం ఇతర దర్శకుల కంటే చాలా భిన్నమైనవి. అతడిలోని ప్రయోగాత్మకత, వైవిధ్యమైన ఆలోచనలు, కథల్ని చెప్పే సత్తా గురించి ఈ సందర్భంగా చర్చించాలి.
కెరీర్‌లో అన్నీ ప్రయోగాలే:
24 శాఖల నుంచి అత్యుత్తమ పనితనాన్ని రాబట్టుకోవడంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ పనితనాన్ని ప్రశంసించి తీరాలి. ప్రశాంత్ తన కెరీర్ లో బ్యాక్ టు బ్యాక్ ప్రయోగాత్మక చిత్రాలతో సత్తా చాటాడు. అతడి మొదటి సినిమా `అ!` 2018లో విడుదలైంది. ప్రశాంత్ ఎంచుకున్న స్క్రీన్ ప్లే ఫార్మాట్ కి నిజంగానే థియేటర్లలో ఆడియెన్ అ! అంటూ ఆశ్చర్యపోయారు. టాలీవుడ్ కి ఒక వైవిధ్యమైన సినిమాని అందించిన సాహసికుడు ప్రశాంత్. ముఖ్యంగా ప్రయోగాత్మక పంథాలో స్క్రీన్ ప్లేలు అందించడంలో అతడి నిబద్ధత, పనితనాన్ని ప్రశంసించకుండా ఉండలేం. అ! తర్వాత 2019లో కల్కి చిత్రాన్ని అందించాడు. వెటరన్ రాజశేఖర్ ఈ చిత్రంలో హీరోగా నటించారు. అటుపై జోంబీ కథతో జోంబీ రెడ్డి అనే భారీ ప్రయోగం చేసాడు. జోంబీ కథతో ప్రయోగం చేయాలనే ఆలోచనే ఇన్నేళ్లలో వేరొక దర్శకుడికి రాలేదు! అంటే అతడి సాహసాన్ని అర్థం చేసుకోవాలి. 2021లో విడుదలైన ఈ చిత్రం పూర్తి ప్రయోగాత్మక చిత్రం. జయాపజయాలకు భిన్నంగా ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు తేజ సజ్జా లాంటి ఒక కొత్తతరం హీరోతో హనుమాన్ లాంటి ప్రయోగం చేసాడు ప్రశాంత్ వర్మ. 2024లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అటు హిందీ బెల్ట్ లో ఈ చిత్రం బంపర్ హిట్. టాలీవుడ్, బాలీవుడ్ క్రిటిక్స్ ఈ సినిమా మేకింగ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. విమర్శనాత్మకంగా, వాణిజ్యపరంగా ఈ చిత్రం ఎంతగా విజయం సాధించిందంటే, దానిని దాని స్వంత సూపర్ హీరో విశ్వంగా మారుస్తున్నారు.
సూపర్ హీరో విశ్వం అంతర్జాతీయ స్థాయికి:
ఈ శుక్రవారం నాడు కేంద్రం ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డులలో `హను-మాన్` రెండు గౌరవ ప్రదమైన పురస్కారాల్ని దక్కించుకుంది. ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ, AVGC (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ & కామిక్)లో జాతీయ ఉత్తమ చిత్రంగా పురస్కారాలు దక్కాయి. ఈ విజయంపై ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. ``నా మొదటి చిత్రానికి నాకు రెండు జాతీయ అవార్డులు కూడా వచ్చాయి, ఆపై ఈ చిత్రానికి మరో రెండు జాతీయ అవార్డులు రావడం.. వాణిజ్యపరంగా పెద్ద హిట్ అవ్వడం చాలా అద్భుతం. నిర్మాతలకు డబ్బు సంపాదించడంతో పాటు పురస్కారాలు దక్కడం చాలా అరుదైన విషయం. నేను దీని గురించి చాలా గర్వంగా భావిస్తున్నాను. వినయవిధేయతలతో ఆనందిస్తున్నాను`` అని అన్నారు. ఈ జాతీయ పురస్కారాలు తనలో ఉత్సాహాన్ని పెంచుతున్నాయని, సూపర్ హీరో విశ్వాన్ని మరింతగా విస్తరించడానికి ఇది సహకరిస్తుందని కూడా ప్రశాంత్ అన్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్శ్ ని అంతర్జాతీయ స్థాయికి విస్తరించేందుకు మరింత అదనపు హార్డ్ వర్క్ చేస్తానని అన్నారు.
డబ్బు కంటే ప్రతిభ ముఖ్యం:
చాలా పరిమిత బడ్జెట్ తో రూపొందించిన హనుమాన్ వీఎఫ్ఎక్స్ విభాగంలో పురస్కారం పొందడం ఆశ్చర్యపరుస్తోంది. అయితే వీఎఫ్ఎక్స్ పనితనం రాబట్టుకోవడానికి బడ్జెట్ కంటే హార్డ్ వర్క్ ముఖ్యం. ప్రతిభావంతులైన వ్యక్తులు మనకు అందుబాటులో ఉంటే.. అలాంటి వారికి డబ్బు కంటే ఎక్కువ సమయం ఇస్తే తప్పనిసరిగా మంచి ఔట్ పుట్ లభిస్తుందని కూడా ప్రశాంత్ వర్మ సూచించారు. నాణ్యమైన సినిమా తీయాలంటే తగినంత సమయం ఉండాలని, ఎక్కువ సమయం ఇచ్చినప్పుడు ఉత్తమ పనితనం రాబట్టగలమని కూడా ప్రశాంత్ అన్నారు.
`జై హనుమాన్` పై భారీ అంచనాలు:
ప్రస్తుతం ప్రశాంత్ వర్మ `హనుమాన్` సీక్వెల్ `జై హనుమాన్`ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్శ్ లో ఇది రెండో భారీ చిత్రం. తేజ సజ్జా ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తుండగా, పాపులర్ స్టార్లు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. `కాంతార` ఫేం రిషబ్ శెట్టి ఈ చిత్రంలో హనుమంతుడిగా నటిస్తుండడం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సినిమా మేకింగ్ కోసం ప్రశాంత్ ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. నాణ్యమైన సినిమాని అందించడమే ధ్యేయంగా అతడు హార్డ్ వర్క్ చేస్తున్నారు. పుష్ప తో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్ ని క్రియేట్ చేసిన `మైత్రి మూవీ మేకర్స్` ఈ చిత్రం కోసం రాజీ అన్నదే లేకుండా బడ్జెట్లను సమకూరుస్తోంది. భవిష్యత్ అంతా నవతరం దర్శకులదే. ముఖ్యంగా టాలీవుడ్ లో జాతీయ ఉత్తమ దర్శకుడు పురస్కారం అందుకునే జెన్ జెడ్ దర్శకుల్లో ప్రశాంత్ వర్మ పేరును కూడా రిజిస్టర్ చేసి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. పురస్కారాల కోసం కాదు, ప్రయోగాత్మకత కోసం జీవించే అరుదైన వ్యక్తిత్వం ఇప్పుడు ప్రశాంత్ వర్మను మరో స్థాయికి తీసుకెళుతుందనడంలో సందేహం లేదు.