జర్మనీ అమ్మాయితో ప్రేమలో సూపర్‌స్టార్ కొడుకు!
అతడు సూపర్‌స్టార్ నటవారసుడు. తలుచుకుంటే పాన్ ఇండియన్ సినిమాలు చేయగలడు.;
అతడు సూపర్‌స్టార్ నటవారసుడు. తలుచుకుంటే పాన్ ఇండియన్ సినిమాలు చేయగలడు. అతడి కోసం వందల కోట్లు పెట్టే నిర్మాతలు అందుబాటులో ఉన్నారు. కానీ అతడి వైఖరి పూర్తిగా భిన్నమైనది. తాను ఇండస్ట్రీని ఏలే ఒక పెద్ద సూపర్ స్టార్ కొడుకుని అనే గర్వం కానీ, లెగసీని ముందుకు నడిపించాలనే ఆశ కానీ అతడికి లేవు. ఉన్న జీవితాన్ని నచ్చినట్టు గడపాలి. అనవసర ఒత్తిళ్లకు దూరంగా మనసుకు తోచింది మాత్రమే చేయాలి.
పొలానికి వెళతాడు. పైరగాలి పీలుస్తాడు. మేకల్ని మేపుతాడు. నగర జీవనానికి ఒడిదుడుకులకు దూరంగా ఉంటాడు. వీలున్నంతవరకూ ఎక్కువగా ప్రయాణిస్తాడు. సంగీతాన్ని ఆస్వాధిస్తాడు. రచనలు చేయడానికి పూనుకుంటాడు. ఇప్పటివరకూ ఏ సినీపరిశ్రమలో ఇలాంటి నటవారసుడిని చూడలేం. టాలీవుడ్ లో అగ్ర హీరోల కొడుకులు హీరోలే.. విలన్లు, కమెడియన్ల కొడుకులు కూడా హీరోలే. హీరో అయితే ఇండస్ట్రీని ఏలేయొచ్చని ఆశ. కానీ ఈ స్టార్ హీరో కొడుక్కి అలాంటి ఆలోచనలేవీ లేవు. అందుకే అప్పుడప్పుడు గెస్టులా అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు తప్ప పూర్తి స్థాయిలో స్టార్ అవ్వాలని అనుకోవడం లేదు. అసలింతకీ ఇలాంటి భిన్నమైన హీరో ఎవరు? అంటే.. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్.
ఇప్పుడు అతడి గురించి ఓ కొత్త విషయం తెలిసింది. అతడు కొన్నేళ్లుగా మలయాళ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్ తో ప్రేమలో ఉన్నాడని ప్రచారం సాగుతోంది. ఈ జంట కలిసి హృదయం అనే చిత్రంలో నటించారు. ఆ తర్వాత ప్రణవ్ సినిమాలు ఎక్కువగా చేయడం లేదు. తదుపరి ఆది అనే చిత్రంతో అభిమానుల ముందుకు రాబోతున్నాడు. తండ్రిలా ప్రతిభావంతుడే అయినా కానీ అతడి ఆసక్తులు వేరుగా ఉన్నాయి. ఇంతలోనే ప్రణవ్ గురించి వేడెక్కించే మరో ఆసక్తికర విషయం తెలిసింది. అతడు కళ్యాణి ప్రియదర్శన్ ని ప్రేమించడం లేదు. ఆ ఇద్దరూ అన్నా చెల్లెళ్ల తరహా. ఈ విషయాన్ని ఫిలింమేకర్ అలెప్పీ అష్రాఫ్ మాతృభూమి వెబ్ సైట్ కి చెప్పారు. లిస్సీ అనే నటి ద్వారా మరో విషయం తెలిసిందని అతడు కన్ఫామ్ చేసాడు. ప్రణవ్ ప్రస్తుతం ఓ జర్మనీ అమ్మాయితో నిండా ప్రేమలో ఉన్నాడు.. అయితే ఈ విషయాన్ని అధికారికంగా అతడే ధృవీకరించాల్సి ఉంది.