కేరళలో బీఫ్ వంటకాలపై ప్రకాష్ రాజ్ సంచలన పోస్ట్
నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా పోస్ట్‌లు తరచుగా వివాదాలకు కేంద్రబిందువు అవుతుంటాయి.;
నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా పోస్ట్‌లు తరచుగా వివాదాలకు కేంద్రబిందువు అవుతుంటాయి. ముఖ్యంగా ఆయన కేరళ బీఫ్ వంటకాలపై చేసిన తాజా పోస్ట్ రాజకీయంగా, సామాజికంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ప్రకాష్ రాజ్ కేరళలో బీఫ్ వంటకాలను ఎలా తయారు చేస్తారో వివరిస్తూ ఒక వీడియోని పోస్ట్ చేసి దానిని `రియల్ కేరళ స్టోరీ` అని పేర్కొన్నారు. గతంలో విడుదలైన `ద కేరళ స్టోరీ 2` చిత్రానికి కౌంటర్‌గా ఆయన ఈ పోస్ట్ చేయడం చర్చకు వచ్చింది. తన ట్రేడ్‌మార్క్ హ్యాష్ ట్యాగ్ `#జస్ట్ ఆస్కింగ్` తో ఆయన కేరళ సంస్కృతిలో ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయో చూపించే ప్రయత్నం చేశారు.
అయితే ఈ పోస్ట్ హిందూ సమాజంలోని మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గోవును పవిత్రంగా భావించే హిందువుల విశ్వాసాలను ప్రకాష్ రాజ్ కావాలనే కించపరుస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఒక వర్గం (ముస్లిం లేదా మైనారిటీల) భద్రత, మనోభావాల గురించి మాట్లాడే ప్రకాష్ రాజ్, హిందువుల సెంటిమెంట్లను ఎందుకు గౌరవించరు? అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల ఆయన హిందూ మెజారిటీ వర్గానికి క్రమంగా దూరమవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కేరళ స్టోరీ 2 చిత్రంలో కొన్ని సున్నితమైన వివాదాస్పద సన్నివేశాలు ఉన్నాయని ఆయన భావిస్తే వాటిపై సెటైర్ వేయడం సరైనదే కావొచ్చు. మతమార్పిడి, అత్యాచారం, బలవంతంగా గోమాంసం తినిపించడం వంటివి కేరళ స్టోరీ చిత్రంలో ఉన్నాయనే వార్తల నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ఈ పోస్ట్ చేశారు. అయితే సినిమాలో చూపించేది కల్పితమని ప్రకాష్ రాజ్ నిరూపించదలిచారా? కేరళలో బీఫ్ తినడం అనేది ఒక సాధారణ ఆహారపు అలవాటు మాత్రమే అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారా?. అయితే ఆయన విధానం సరైనది కాదు! అంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు.
ఆహారపు అలవాట్లు వ్యక్తిగతమని, వాటిని రాజకీయం చేయకూడదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక బాధ్యతాయుతమైన నటుడిగా ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తిగా, కోట్లాది మంది ప్రజల సెంటిమెంట్లతో ముడిపడి ఉన్న అంశంపై (ముఖ్యంగా గోమాంసం) వ్యంగ్యంగా లేదా రెచ్చగొట్టేలా పోస్టులు చేయడం వల్ల సమాజంలో విద్వేషాలు పెరిగే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రకాష్ రాజ్ ఒక వివేచనతో కూడుకున్న ఆలోచనాపరుడిగా తనను తాను చెప్పుకుంటున్నా కానీ, ఆయన చేసే కొన్ని పోస్టులు విమర్శనాత్మకంగా కాకుండా.. ఒక నిర్దిష్ట వర్గాన్ని టార్గెట్ చేస్తున్నట్లుగా అనిపించడం వల్లే ఈ స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉన్నా కానీ, అది ఇతరుల విశ్వాసాలను కించపరిచేలా ఉండకూడదనేది నెటిజన్ల ప్రధాన వాదన. ఆయన భాజపా వ్యతిరేకి అయితే కేవలం ఆ పార్టీని తిట్టే పనిలో ఉండాలని మొత్తం హిందూ ప్రపంచాన్ని ఆయన కెలికి, వ్యతిరేకిగా మారడం సరికాదని కూడా కొందరు సూచిస్తున్నారు.