'పెద్ది' పై స్టార్ డైరెక్ట‌ర్ అద్భ‌త విశ్లేష‌ణ‌!

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో బుచ్చిబాబు సన తెరకెక్కించిన రూటెడ్ విలేజ్ డ్రామా `పెద్ది` ఇటీవ‌లే రిలీజ్ అయి దిగ్విజ‌యంగా దూసుకుపోతున్న‌ సంగ‌తి తెలిసిందే.

Update: 2026-06-08 10:22 GMT

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో బుచ్చిబాబు సన తెరకెక్కించిన రూటెడ్ విలేజ్ డ్రామా `పెద్ది` ఇటీవ‌లే రిలీజ్ అయి దిగ్విజ‌యంగా దూసుకుపోతున్న‌ సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. అయితే సినిమాకు రివ్యూలు మాత్రం డివైడ్ గానే వ‌చ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ప్రదీప్ అద్వైతం సోషల్ మీడియా వేదికగా `పెద్ది` చిత్రంపై తన సమీక్షను పంచుకున్నారు. తన సుదీర్ఘమైన సమీక్షలో సినిమాలోని సానుకూల అంశాలను ఎంతగానో ప్రశంసించారు.

`పెద్ది` చిత్రం ఒక గ్రామీణ నేపథ్యం ఉన్న కథ మాత్రమే కాదు. దీని వెనుక ఒక గుర్తింపు పోరాటం దాగి ఉందన్నారు. సమాజంలో గౌరవం, గుర్తింపు కోసం ఒక వ్యక్తి చేసే ఈ పోరాటం ప్రస్తుత కాలానికి ఎంతో ప్రాసంగికంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కాలంలో అస్తిత్వం కోసం తపించే ప్రతి ఒక్కరికీ ఈ కథ కనెక్ట్ అవుతుందన్నారు. కేవలం వ్యక్తిగత పోరాటంగా కాకుండా ఆత్మగౌరవ ప్రతీకగా ఈ సినిమా నిలుస్తుందని కొనియాడారు. రామ్ చరణ్ వంటి అగ్ర కథానాయకుడిని ఇలాంటి పల్లెటూరి నేపథ్యం ఉన్న, వాస్తవికతకు దగ్గరగా ఉండే పాత్ర కోసం ఒప్పించినందుకు దర్శకుడు బుచ్చిబాబు సనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

స్టార్ ఇమేజ్‌ను పక్కన పెట్టి ఇలాంటి కథలు చేయడానికి దర్శకుడికి, నటుడికి ఎంతో ధైర్యం కావాలన్నారు. సినిమాలో రామ్ చరణ్ పెద్ది అనే పాత్రలో న‌టించ‌లేద‌ని.. ఆ పాత్రలో జీవించారని ప్రశంసించారు. దేశంలోని మారుమూల ప్రాంతాల నుండి క్రీడల్లో రాణించాలనుకునే ఎంతో మంది యువతకు, కలలు కనే వారికి ఈ పాత్ర ఎప్పటికీ స్ఫూర్తిగా నిలిచిపో తుందని కొనియాడారు. అలాగే సినిమాపై వస్తున్న కొన్ని విమర్శలను కూడా ప్రదీప్ అంగీకరించారు. కథానాయిక పాత్రను డిజైన్ చేసిన విధానం ఇంకా మెరుగ్గా ఉండాల్సిందని.. కొన్ని డైలాగులు సమస్యాత్మకంగా ఉన్నాయని.. అవి అందరికీ నచ్చకపోవచ్చని అంగీకరించారు.

అయితే కొందరు తెలుగు రివ్యూవర్లు చేసిన విమర్శలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలో సమస్యలు ఉన్నప్పుడు అక్కడి ప్రజలు విజయనగరం లేదా బొబ్బిలి వంటి నగరాలకు ఎందుకు వలస వెళ్ళడం లేదని కొందరు సమీక్షకులు ప్రశ్నించడాన్ని తప్పుబట్టారు. సమీక్షకులు అడిగిన ప్రశ్నకు సమాధానం సినిమాలోనే స్పష్టంగా ఉందని ప్రదీప్ వివరించారు. గ్రామం అనేది ఒక ప్రాంతం మాత్రమే కాదని అది తరతరాలుగా ప్రజలు జీవిస్తున్న ఇల్లు అని గుర్తుచేశారు. అక్కడ పుట్టి పెరిగిన చ‌రిత్ర‌, అస్తిత్వం , బంధాలను అంత తేలికగా వదిలేసి వెళ్ళలేరన్నారు.

సమాజంలో వెనుకబడిన వర్గాల వారు ఎదుర్కొనే వివక్ష, వారి సామాజిక పరిస్థితులు, భూమితో వారికుండే అనుబంధాన్ని సినిమా చక్కగా చూపించిందని ఆ భూమే వారి గుర్తింపు అని ప్రదీప్ సమర్థించారు. ఇలాంటి సినిమాలకు లోతైన విశ్లేషణ అవసరమని ప్రదీప్ అద్వైతం పేర్కొన్నారు. థియేటర్లలో సినిమా చూస్తూ నిమిషానికి ఒక రివ్యూ పోస్ట్ చేయడం కాకుండా సినిమా అంతర్లీనంగా చెప్పాలనుకున్న అంశాలపై దృష్టి పెడితే దర్శకుడి అసలు ఉద్దేశం అర్థమవుతుందని హితవు పలికారు.

Tags:    

Similar News