ప్ర‌భాస్‌ను ఇన్‌స్పైర్ చేస్తున్న డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా

ఇవాళ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆయ‌న‌కు టాలీవుడ్లోని ప‌లువురు సెల‌బ్రిటీల నుంచి విషెస్ అందుతున్నాయి.;

Update: 2025-04-23 12:30 GMT

ఇవాళ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆయ‌న‌కు టాలీవుడ్లోని ప‌లువురు సెల‌బ్రిటీల నుంచి విషెస్ అందుతున్నాయి. అందులో భాగంగానే పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కూడా నాగ్ అశ్విన్ కు సోష‌ల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌చేస్తూ ఓ స్పెష‌ల్ పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ లో నాగ్ అశ్విన్ పై త‌న‌కున్న అభిమానాన్ని చాటుకున్నాడు ప్ర‌భాస్.

ప్ర‌భాస్ షేర్ చేసిన పోస్ట్ లో నాగ్ అశ్విన్ క‌ల్కి సినిమాలోని ఫ్యూచ‌రిస్టిక్ సూప‌ర్ కార్ బుజ్జిలో కూర్చుని ఉన్నాడు. ఆ ఫోటోను షేర్ చేస్తూ నాగ్ అశ్విన్ కు ఉన్న దూర‌దృష్టితో పాటూ అత‌ని డెడికేష‌న్ ను కూడా ఎంత‌గానో ప్ర‌శంసించాడు. ఎంతో అద్భుత‌మైన నాగికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు, నీ దూరదృష్టి, సినిమాపై ఉన్న డెడికేష‌న్ న‌న్ను ఎప్పుడూ ఇన్‌స్పైర్ చేస్తూ ఉంటాయి. క‌ల్కి2 తో నువ్వు చేసే మ్యాజిక్ చూడ్డానికి ఎంతో ఆతృత‌గా ఉంది అంటూ రాసుకొచ్చాడు.

ప్ర‌భాస్, నాగ్ అశ్విన్ క‌ల‌యిక‌లో గ‌తేడాది క‌ల్కి 2898 ఏడి సినిమా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కురుక్షేత్ర యుద్ధం జ‌రిగిన 6000 సంవ‌త్స‌రాల తర్వాత భ‌విష్య‌త్తు ఎలా ఉంటుందో నాగ్ అశ్విన్ క‌ల్కి ద్వారా ఒక గొప్ప సైన్స్ ఫిక్ష‌న్ సినిమాతో చూపించాడు. ఈ సినిమాలో సుప్రీం యాస్కిన్ గా క‌మ‌ల్ హాస‌న్ క‌నిపించాడు. మొద‌టి భాగంలో ఆయ‌న పాత్ర పెద్ద‌గా చూపించ‌క‌పోయినా రెండో పార్ట్ లో క‌మ‌ల్‌హాస‌న్ న‌ట విశ్వ‌రూపం చూస్తార‌ని ముందు నుంచే అంద‌రూ చెప్తున్న సంగ‌తి తెలిసిందే.

క‌ల్కి2లో ప్ర‌భాస్ భైర‌వుడు పాత్ర‌లో, అమితాబ్ అశ్వ‌త్థామ పాత్ర‌లో, SUM-80 మిష‌న్ ల‌క్ష్యంగా మ‌హావిష్ణువు యొక్క ఆఖ‌రి అవ‌తారాన్ని మోస్తున్న సుమ‌తిని ర‌క్షిస్తుంటారు. క‌ల్కి2లో కూడా అమితాబ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువే ఉండ‌నుంద‌ని అంటున్నారు. కల్కిని మించేలా క‌ల్కి2ను నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నాడ‌ని యూనిట్ స‌భ్యులు చెప్తున్నారు.

ఇక నాగ్ అశ్విన్ విష‌యానికొస్తే ఇప్ప‌టివ‌ర‌కు అత‌ను తీసింది మూడే సినిమాలు. అయిన‌ప్ప‌టికీ ఎంతో పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్నాడు. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యంతో ఇండ‌స్ట్రీకి డైరెక్ట‌ర్ గా ప‌రిచ‌య‌మైన నాగ్ అశ్విన్, ఆ త‌ర్వాత మ‌హాన‌టి పేరుతో హీరోయిన్ సావిత్రి బయోపిక్ తీసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆ త‌ర్వాత క‌ల్కి సినిమాతో ఎన్ని సంచ‌ల‌నాలు సృష్టించాడో, ఆ సినిమాతో త‌న పేరు ఎలా మార్మోగిపోయేలా చేసుకున్నాడో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు.

Tags:    

Similar News