స్టార్ హీరో కోసం పోటీ పడుతున్న డైరెక్టర్లు
ఈ తరుణంలో స్టార్ హీరోల నుంచి సినిమా రావడానికి మినిమం ఏడాదిన్నర పడుతుంది. కానీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రం దీనికి మినహాయింపు.;
తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో సత్తా చాటిన తర్వాత దాని డిమాండ్ పూర్తిగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రతీ సినిమానీ చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తూ పలు విషయాల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ తరుణంలో స్టార్ హీరోల నుంచి సినిమా రావడానికి మినిమం ఏడాదిన్నర పడుతుంది. కానీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రం దీనికి మినహాయింపు.
సలార్ తర్వాత ఏడు నెలలకే కల్కి
బాహుబలి తర్వాత ప్రభాస్ కూడా మొదట్లో కాస్త నెమ్మదిగానే సినిమాలు చేశారు కానీ తర్వాత వేగం పెంచి ఫాస్ట్ గా సినిమాలు చేస్తున్నారు. ప్రభాస్ ఎంతో వేగంగా సినిమాలు చేయబట్టే సలార్ సినిమా రిలీజైన ఏడు నెలలకే కల్కి సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాగలిగారు. మధ్యలో కొన్ని కారణాల వల్ల కుదరలేదు కానీ లేకపోతే ఇప్పటికే మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజాసాబ్ కూడా రిలీజై ఉండేది.
ఒకేసారి సెట్స్ పైకి రాజా సాబ్, కల్కి
మధ్యలో ప్రభాస్ హెల్త్ ఇష్యూస్ కారణంగా షూటింగులకు హాజరుకాలేకపోవడంతో రాజా సాబ్ షూటింగ్ పెండింగ్ ఉండిపోయింది. ప్రస్తుతం బ్యాలెన్స్ షూటింగ్ ను పూర్తి చేస్తున్న ప్రభాస్, దాంతో పాటే హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమాను కూడా చేస్తున్నారు. ఫౌజీ షూటింగ్ కూడా ఆల్మోస్ట్ సగం వరకు పూర్తైందని టాక్. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక మరో మూడు సినిమాలను కూడా ప్రభాస్ చేయాల్సి ఉంది. ఇప్పటికే వాటికి సంబంధించిన అనౌన్స్‌మెంట్స్ కూడా వచ్చాయి.
అవే సలార్2, కల్కి2, స్పిరిట్. వీటిలో సలార్2 మొదలవడానికి కాస్త సమయం పడుతుంది. ఎందుకంటే సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్తయ్యే వరకు సలార్2 జోలికి రారు. కాబట్టి సలార్2 ను పక్కన పెడితే మిగిలిన కల్కి2, స్పిరిట్ మేకర్స్ మాత్రం ప్రభాస్ ఎప్పుడెప్పుడు డేట్స్ ఇస్తారా అని వెయిట్ చేస్తున్నారు.
అందులో భాగంగానే ప్రభాస్ డేట్స్ కోసం ఆయా చిత్రాల మేకర్స్ చాలా గట్టిగా పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో స్పిరిట్ ను సెప్టెంబర్ ఎండింగ్ కి సెట్స్ పైకి తీసుకెళ్తానని సందీప్ రెడ్డి వంగా చెప్తుంటే కల్కి2 మేకర్స్ కూడా తమ సినిమాను వీలైనంత త్వరగా మొదలుపెట్టాలని చూస్తున్నారట. ఆల్రెడీ కల్కి2 కు సంబంధించిన స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పూర్తవడంతో ప్రభాస్ ఎప్పుడంటే అప్పుడు ఆ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకుంటున్నారట. ప్రభాస్ కు కుదిరినప్పుడు అతని డేట్స్ ను వాడుకుని సినిమాను పూర్తి చేయాలని నాగ్ అశ్విన్ భావిస్తున్నారట. కానీ సందీప్ మాత్రం స్పిరిట్ సినిమాకే బల్క్ డేట్స్ కావాలని, తన సినిమా చేస్తున్నప్పుడు ప్రభాస్ పూర్తిగా ఒకే లుక్ ను మెయిన్‌టెయిన్ చేయాలని భావిస్తున్నారట. మరి ఈ సిట్యుయేషన్స్ ను ప్రభాస్ ఎలా మ్యానేజ్ చేస్తారో చూడాలి.