రాజా సాబ్ కలికితురాయి అవుతుంది
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఓ వైపు ది రాజా సాబ్ సినిమాను పూర్తి చేస్తూనే మరోవైపు ఫౌజీ అనే సినిమా చేస్తున్న ప్రభాస్, త్వరలోనే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ ను చేయనున్నారు. వాటిలో ది రాజా సాబ్ సినిమా ముందు రిలీజ్ కానుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ముందుగా డిసెంబర్ 5న రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ వెల్లడించిన విషయం తెలిసిందే.
కానీ రాజా సాబ్ ను డిసెంబర్ కంటే సంక్రాంతికి రిలీజ్ చేస్తే బావుంటుందని అందరూ భావిస్తుండటంతో మేకర్స్ వారి ఆలోచనను పరిగణనలోకి తీసుకుని రాజా సాబ్ ను డిసెంబర్ నుంచి జనవరికి పోస్ట్ పోన్ చేశారు. ఈ విషయాన్ని మిరాయ్ ప్రమోషన్స్ లో నిర్మాత టి.జి విశ్వప్రసాద్ వెల్లడించగా, ఇప్పుడు అదే విషయాన్ని మరోసారి టాలీవుడ్ ప్రొడ్యూసర్, మారుతికి సన్నిహితుడైన ఎస్‌కెఎన్ తెలిపారు.
అక్టోబర్ నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్
రీసెంట్ గా రిలీజైన లిటిల్ హార్ట్స్ మూవీ సక్సెస్ అవడంతో మేకర్స్ ఆ చిత్ర సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేయగా దానికి నిర్మాత ఎస్‌కెఎన్ హాజరయ్యారు. ఆ ఈవెంట్ లో ఎస్‌కెఎన్ మాట్లాడుతూ అందరూ రాజా సాబ్ అప్డేట్ అడుగుతున్నారని, అక్టోబర్ నుంచి వరుస అప్డేట్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ ఉంటుందని, సినిమా జనవరి 9న రిలీజ్ కానుందని చెప్పారు.
ప్రభాస్ కెరీర్లోనే మొదటిసారి..
రీసెంట్ గా విశ్వప్రసాద్ గారు నిర్మించిన మిరాయ్ అతనికి సూపర్ హిట్ ను అందిస్తే, ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ది రాజా సాబ్ ఆ బ్యానర్ లో ఓ కలికితురాయిగా మిగులుతుందని చెప్పగా ఆ మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే రాజా సాబ్ సినిమా మొదలుపెట్టినప్పుడు పెద్దగా అంచనాల్లేకపోయినా తర్వాత్తర్వాత దానిపై మంచి అంచాలు ఏర్పడ్డాయి. ప్రభాస్ తన కెరీర్లోనే మొదటిసారి హార్రర్ కామెడీ జానర్ లో చేస్తున్న సినిమా కావడంతో రాజా సాబ్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.