స్టార్‌డమ్‌ని పక్కన పెట్టి.. నానమ్మ కోసం ప్రభాస్
ప్రభాస్ కి ఒకసారి చేసిన క్యారెక్టర్ మళ్ళీ చేయడం అస్సలు ఇష్టం ఉండదట. "ఏముంది ఇందులో కొత్త?" అని ప్రతిసారీ అడుగుతారట.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటేనే భారీ యాక్షన్ సినిమాలు, విజువల్ వండర్స్ గుర్తుకొస్తాయి. లోకాన్ని రక్షించే సూపర్ హీరోగానే మనం ఈ మధ్య ఆయన్ని ఎక్కువగా చూస్తున్నాం. కానీ 'రాజాసాబ్'లో మాత్రం డార్లింగ్ తన స్టార్‌డమ్ ని పూర్తిగా పక్కన పెట్టేశారట. కటౌట్ ని నమ్ముకోకుండా, కేవలం కథను, అందులోని కంటెంట్ ని నమ్ముకుని ఈ సినిమా చేశారని దర్శకుడు మారుతి క్లారిటీ ఇచ్చారు.
ప్రభాస్ లోని ఆ పాత వింటేజ్ కోణాన్ని ఈ సినిమాలో చూస్తామని ఆయన మాటల్ని బట్టి అర్థమవుతోంది. ఇది ప్రపంచాన్ని కాపాడే కథ కాదు.. కేవలం తన నానమ్మను కాపాడుకునే ఒక మనవడి కథ. వినడానికి ఈ లైన్ చాలా సింపుల్ గా అనిపిస్తున్నా, ఇందులో ఎమోషన్ మాత్రం చాలా లోతుగా ఉంటుందట. ఇన్నాళ్లు గొడ్డళ్లు, కత్తులు పట్టుకుని యుద్ధాలు చేసిన ప్రభాస్, ఇందులో కుటుంబం కోసం, ముఖ్యంగా నానమ్మ సెంటిమెంట్ తో చేసే ప్రయాణం ఆడియెన్స్ కి ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని మారుతి చెప్పుకొచ్చారు.
ప్రభాస్ కి ఒకసారి చేసిన క్యారెక్టర్ మళ్ళీ చేయడం అస్సలు ఇష్టం ఉండదట. "ఏముంది ఇందులో కొత్త?" అని ప్రతిసారీ అడుగుతారట. అందుకే రొటీన్ సీన్లు, రెగ్యులర్ డైలాగులు ఉంటే వెంటనే నో చెప్పేస్తారట. ఆయన మైండ్ సెట్ కి తగ్గట్టు, ప్రతి సీన్, ప్రతి డైలాగ్ ఫ్రెష్ గా ఉండాలని మారుతి చాలా కసరత్తు చేయాల్సి వచ్చిందట.
ఈ కొత్తదనం కోసమే స్క్రిప్ట్ వర్క్ కి ఏకంగా ఏడాది టైమ్ పట్టిందట. ప్రభాస్ ఇమేజ్ కి డ్యామేజ్ కాకూడదు, అలాగని రెగ్యులర్ కమర్షియల్ సినిమా అనిపించకూడదు.. ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేయడం కోసమే ఇంత టైమ్ తీసుకున్నానని మారుతి తెలిపారు. ఫైనల్ గా అవుట్‌పుట్ చూశాక ఆ కష్టానికి ఫలితం దక్కిందని అనిపిస్తోందట.
ఇక ప్రభాస్ కేవలం హీరో మాత్రమే కాదు, ఒక అద్భుతమైన టెక్నీషియన్ కూడా అని మారుతి ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. ఆయనకు వరల్డ్ సినిమా మీద ఉన్న నాలెడ్జ్ చూసి షాక్ అయ్యానని అన్నారు. ఏ కెమెరా వాడుతున్నాం, లైటింగ్ ఎలా ఉంది, షాట్ మేకింగ్ ఏంటి అనే విషయాల్లో ప్రభాస్ ఇన్వాల్వ్ మెంట్, ఆయన ఇచ్చే సలహాలు సినిమా క్వాలిటీని పెంచాయట.
మొదట్లో దీన్ని ఒక హారర్ కామెడీ అనుకున్నారు కానీ, తీస్తూ వెళ్లేకొద్దీ ఇది ఒక 'హారర్ ఫాంటసీ'గా మారిపోయిందట. అంటే కేవలం నవ్వించడమే కాదు, విజువల్ గా ఒక కొత్త లోకాన్ని చూపించబోతున్నారు. హారర్ ఎలిమెంట్స్ కి ఫాంటసీ టచ్ ఇచ్చి, దానికి ప్రభాస్ మార్క్ ఎమోషన్ జోడిస్తే 'రాజాసాబ్' రేంజ్ ఏంటో థియేటర్లో తెలుస్తుందని మారుతి కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు.